స్మ్ర్రుతులూ మరణిస్తాయి…..
వర్షపు చినుకొకటి నీ కనురెప్పల పై వాలినపుడు
బద్దలైన నా గుండె చప్పుడు పిడుగు పడ్డట్టుగా
ఉందన్నావు … నీకు గుర్తుందా?
ఆణిముత్యాల వాకిళ్ళ లో కాంతుల పరదాలు
తొలగించినపుడు, నీ కళ్ళలో చెలరేగిన
చిలిపి కోరిక గుర్తుకొచ్చిందా?
మల్లెపూల తెల్లదనం పెనవేసుకు పోయిన
వాలు చూపుల తో గతుక్కుమన్న నీ గుండెల్లో
కదలాడిన అలజడి మరచిపోయావా?
ఓ అమ్మాయీ!
బహుశా నీకివన్నీ గుర్తు లేవేమో?
కాని …
నీ నయనాల చాటున మెరిసిన మేఘాల పంక్తిని నేనెలా విడిచేది?
పలుచటి కన్నీటి లో తడిసిన నీ కాటుక రేఖ
వెలుగునే కమ్మేసిన వైనం నేనెలా మరిచేది?
గుడి తలుపుల చిరుగంటల లో నీవు వదిలి వెళ్ళిన పారిజాత పరిమళాన్ని
దండగా కూర్చి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను ప్రియతమా!
గతాల నేలమాగళి లో నీ ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరి అవుతూ…
నిన్ను ఆఖరి గా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను ఓ నేస్తమా!
“అసలు నేనెవరో గుర్తున్నానా?”



కొత్త రవికిరణ్ said,
July 26, 2007 at 4:25 PM
గుర్తున్నావు మిత్రమా.
ఈ వయసులో గుర్తొస్తే ఆ వెంటనే గుండె నొప్పొస్తుందని నీకు తెలుసా?