ఎవరు వీరు?
పూర్వకాలంలో సిద్ధులు కాళ్ళకు అంజనం పూసుకుని చిటిక వేసినంతలోనే మరో ప్రదేశానికి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించేవారంట. మహర్షులు తమ దివ్యదృష్టితో జరిగిన సంగతీ, జరుగుతున్న సంగతీ మరియు జరగబోయే సంగతులూ తెలిపేవారంట. అయితే ఇవన్నీ “అంట”, “ట” ల తోనే ముగిసిపోతాయి. కాని, నేడు అలాంటి మహర్షులు కూడా మన మధ్య ఉన్నారు. అలాంటి ఓ ముగ్గురి గురించి ఇప్పుడు ప్రస్థావించదలిచాను. గత ఆరు నెలలనుండి ఒక క్లిష్టమైన సమస్య నా కంప్యూటర్లోనూ, మరియు ఆఫీసులో నా బాధ్యతలో భాగమైన ఇతర కంప్యూటర్ లలోనూ ఏర్పడి సవాలు గా నిలిచింది. దీని పరిష్కారంకోసం నేను చేయని ప్రయత్నమంటూ లేదు. గూగులమ్మని అడుగుతూనే ఉన్నాను. అందరూ అలా చేయి, ఇలా చేయి అని మొండి చేయి చూపించిన వాళ్ళే. అలాంటిది ఈ మధ్య ఒక రోజు ఊసుబోక అంతర్జాలంలో ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఒక లింకు దొరికింది. ఏమిటా ఇది? అని తెరచి చూస్తే, అది సాంకేతిక సహాయాన్నందించే ఓ తెలుగు సైట్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. అందులో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులకీ నా సమస్యని క్లుప్తంగా వివరించాను. వివరించిందే తడవుగా రంగంలోకి దూకారు వాళ్ళు. అందులో ఒకరు నన్ను http://www.teamviewer.com/index.aspx నుండి మృదుజాలాన్ని దిగుమతి చేసుకోమని చెప్పి, దాని ద్వారా వారికి వేల మైళ్ళ దూరంలో ఉన్న నా కంప్యూటర్ లోకి దూరి అరగంట కష్టపడి, ఆరు నెలలుగా కొరకరాని కొయ్యగా ఉండిన నా సమస్యని పరిష్కరించేసారు. మరి ఒకరు నేను తెలుగులో నేరుగా వ్రాయటానికి కష్టపడుతున్నానని అర్ధం చేసుకుని http://baraha.com/BarahaIME.htm నుండి మృదుజాలాన్ని దిగుమతి చేయించి మరో ప్రధాన సమస్యని కూడా నిమిషాల్లో తీర్చేసారు.
అయితే అప్పటినుండే నా అసలు సమస్య మొదలైంది. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు నాలాంటి వాళ్ళ సమస్యలను, వారి విలువైన సమయాన్ని వెచ్చించి తీరుస్తున్నారు? దీని వల్ల వాళ్ళకేమైనా లాభం ఉందా? అంటే అదీ లేదు. వాళ్ళని నేనెన్నడూ చూడలేదు, వాళ్ళూ నన్ను చూడలేదు. కనీసం వాళ్ళు నా వివరాలు కూడా అడగలేదు. గంటల తరబడి తమ సమయాన్ని వెచ్చించి ఇతరులకు సహాయం చేస్తూ తద్వారా సమాజానికి తమ చేతనైనంత సేవని అందించాలన్న తపనతో వీళ్ళెంచుకున్న రంగం అతి క్లిష్టమైనది, అది “సాంకేతిక రంగం”. అలనాటి మహర్షులు తమ దివ్యశక్తులను ఎలా ఉపయోగించారో నాకు తెలియదు గాని, వీళ్ళు మాత్రం తమ మేధస్సుని, టెక్నాలజి ని మంచి కార్యాలకోసం వినియోగిస్తున్నారు. తమ జ్ఞానాన్ని నలుగురికి పంచాలన్న అంకితభావం కలిగిన ఈ ముగ్గురు మహానుభావులు మీ అందరికి కూడా చిరపరిచితులే.
వీరు, తెలుగు నేలని “కంప్యూటర్ లిటరసీ స్టేట్” గా మార్చాలన్న లక్ష్యం మరియు ధృఢమైన సంకల్పం కలిగిన కంప్యూటర్ ఎరా ఎడిటర్ నల్లమోతుల శ్రీధర్ గారు, అంతర్జాలంలో మన తెలుగుని సులభంగా వ్రాయటానికి కంకణం కట్టుకుని “లేఖిని” అనే అద్భుతమైన మృదుజాలాన్నీ, “కూడలి” లాంటి అసామాన్యమైన వెబ్ సైట్ లని మనకందించిన వీవెన్ గారు, మరియు తెలుగు బ్లాగంటే చాలు ఎందరికో స్పూర్తినిచ్చి, అందరికీ కొండంత అండగా నిలిచే మరియు కొత్తపాళీ గారి మాటల్లో చెప్పాలంటే “ఐదు బ్లాగుల్ని పంచకళ్యాణి గుర్రాల్లా నడిపిస్తున్న” జ్యోతి గారు. సాంకేతిక సహాయంకోసం వీళ్ళు ఏర్పాటు చేసిన మరియు నేనారోజు వీళ్ళని కలిసిన లింకు http://computerera.koodali.org/.
వీరి నిస్వార్ధ సేవానిరతిని పొగిడి వదిలివేయకుండా, వీరిని స్పూర్తిగా తీసుకుని మనమూ మన తోటి సమాజానికీ, తెలుగు తల్లికీ సేవలందించటానికి ముందుకు అడుగువేయాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాము.


