లుంగీ పోయి నిక్కరు వచ్ఛే ఢాం..డాం…ఢాం.

March 24, 2008 at 11:59 AM (అనగనగా .....)

తొమ్మిదేళ్ళ క్రితం అహ్మదాబాదుకి ఉద్యోగంలో చేరటానికి వెళ్ళేంత వరకు నన్ను నేను ఒక సెక్యులరిస్ట్ గా ఊహించుకుని గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. స్నేహితుల్లో ముస్లిములు, క్రిస్టియన్లు ఇంకా అనేక ఇతర మతాల వారుండటంతో నాలో నేనే గర్వపడేవాడిని. అయితే అహ్మదాబాదు లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే గర్వమంతా అణిగిపోయింది. దీనికంతా కారణం ఒక లుంగీ. పొట్ట బొడిస్తే హిందీ ముక్క రాని నేను ఎట్టకేలకు సిటీ అంతా తిరిగి ఆఫీసులో ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్నాను. ఉద్యోగంలో చేరేటప్పుడు నా దగ్గర ప్రతిజ్ఞ (అదో ప్రొసీజరులే) తీసుకున్నపెద్దాఫీసరు నాకు షేక్ హ్యాండిచ్చి ఒకటే మాట చెప్పాడు. “నువ్వు హిందువయితే నది (సబర్మతికి) కి పడమర వైపు ఇల్లు తీసుకో, ముస్లిం అయితే నదికి తూర్పు వైపు తీసుకో” అని. ఈ మాటలిన్నాక నేనాయన్ని ఏమనుకోవాల? ఈడి ముండ మొహాన ఎండ గాయ,ఈ ఊర్లో ఇట్ట అడుగు బెట్టామో లేదో హిందువనీ ముస్లిమనీ గొడవలు పెట్టేటట్టు ఉన్నాడు మహానుభావుడు అనుకున్నాను. బుద్ది గా ఆయనమాట ఆనాడు వినుంటే, ఎన్నో భయానక అనుభవాలు తప్పిపోయిఉండేవి. మతకలహాలప్పుడు, తిండినిద్రా కరువయ్యుండేది కాదు. చీమ చిటుక్కుమన్నా గుండె ఝల్లుమనేది కాదు. చాకు పట్టుకోవటం కూడా సరిగా రాని మాకు పెద్ద పెద్ద కత్తులు, బరిశలు ఇచ్చి, ఎవరైనా మన సొసయిటీ మీద దాడి చేస్తే అందరం కల్సి వాళ్ళతో పోరాడాల అని చెప్పిన ఇంటి ఓనరు. చీపురు కట్ట పెట్టే దగ్గర ఈ కత్తులు బరిశలు పెట్టాల్సి వచ్చింది కదరా దేవుడా అని వాటిని చూసినప్పుడల్లా, మేము ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం. ముస్లిం పేరున్న ఓ హిందు స్నేహితుడి వల్ల ఒకనాడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం. అలాగే మేము ఈ పాత బస్తీ నుండి మకాం ఎత్తేసి సబర్మతి నదికి పడమరవైపుకి మార్చినప్పుడు మమ్మల్ని వదలలేని రజాక్ అనే ముస్లిం స్నేహితుడిని రాజు అని అందరినీ నమ్మించి, రెండేళ్ళ తరువాత ఆ నిజం బయటపడి మళ్ళీ అక్కడి నుండి రాత్రికిరాత్రే మకాం ఎత్తేయటం…ఇలా ఒకటని కాదు, కాని మాలో మాకు ఎంత స్నేహమున్నా, చివరకి హిందువులం పడమరవైపు ముస్లిములు తూర్పువైపు స్థిరపడాల్సి వచ్చింది. ఇలా అనేక ఆసక్తికరమైన సంఘటనలు ఎన్ని జరిగినా, ఈ లుంగీ ఎపిసోడ్ మాత్రం జాతి వైషమ్యాల విషయంలో నాకు జరిగిన మొట్టమొదటి తమాషా అనుభవం. అది ఎలా జరిగిందంటే…

కాశీమజిలీ కథల్లో లాగ “ఓ రాజకుమారా! నువ్వే దిక్కు కయినా వెళ్ళు గాని ఆ ఉత్తరం దిక్కుకు మాత్రం వెళ్ళద్దు.” అని పేదరాశి పెద్దమ్మ చెప్పినట్టు ఆ ఆఫీసరు చెప్పింది బుద్దిగా విని పాటించక నదికి తూరుపు దిక్కున, చుట్టూ ముస్లింలు ఉండే ఓ హిందూ సొసైటీలో మిద్దె మీద గది అద్దెకు తీసుకున్నాను. ఓ పదిరోజుల్లోనే ఆయన మాటల్ల్లో వాస్తవం అర్ధమై దిమ్మదిరిగిపోయింది. ఈ పదిరోజుల్లో పరిసరాలు కాస్త పరిచయమయ్యి, ఫ్రీ గా తిరగటం , ఎవరైనా పలకరిస్తే నవ్వటం వంటివి జరగతున్నాయి (మాట్లాడాలంటే భాషరావాలిగా) . ఆంధ్రాలో ఉన్నప్పుడు లుంగీలు ఎక్కువగా కట్టేవాడిని, కనీసం అహ్మదాబాద్ వెళ్ళినతరువాత అయినా షార్ట్ లు వాడదాం అన్న కోరిక మనసులో ఉండిపోయింది. ఇదా కొత్త ప్రదేశం, అసలేపెళ్ళైన ఆడవాళ్ళు కొంగు తలపై నుండి తీయటం లేదు. ఇక అవేసుకుని తిరిగితే ఏమేమి సమస్యలు వస్తాయో అని షార్ట్ లని వాయిదా వేసి లుంగీలే వాడుతున్నాను.

అప్పటికే ఆఊరి అమ్మాయిల అందాలకి పరవశుడ్నైపోయి ఉన్నానేమో. ఓ శలవు దినాన షేవింగ్ చేసుకుని గ్లామరస్ గా తయారయి ఊరిమీద పడదామనుకుని, బ్లేడ్ కోసమని మెట్లు దిగి కిందకు వచ్చాను. మెట్లు దిగేటప్పుడు లుంగీ కాళ్ళకి అడ్డు పడుతుందని పైకి మడిచి కట్టడం అలవాటుకదా. అప్పుడు కూడా అలాగే దిగి, ఈ రోజు ఏఏ పార్కుల్లో తిరిగివద్దామా? అని అలోచించుకుంటూ సొసయిటీ బయట ఉండే ఓ షాప్ కెళ్ళి బ్లేడ్ కొని, తిరిగి సోసైటీలో అడుగు పెట్టాను. అంతే అక్కడో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. నేను ఆశ్చర్యపోయాను. బ్లేడ్ కొనటానికి వెళ్ళేటప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. ఈ పదినిమిషాల్లో ఏమైందబ్బా? అనుకుని. అహ్మదాబాద్ లో మొదటి గొడవ కదా! ఓ గోడ వారగా నుంచుని చోద్యం చూడసాగాను. మనం అక్కడ చూడగలమే గాని, ఆ గుజరాతీభాష ఒక్క ముక్క కూడా అర్ధం జేసుకోలేము కదా. నాకర్ధమైందేమిటంటే, అక్కడ రెండు గ్రూపులు గొడవాడు కుంటున్నాయి. నాకు కాస్త ముఖపరిచయం ఉన్న వాడిది మన బ్యాచ్ అనుకుంటే, ఎదుటి గ్రూప్ వాడిని ఎవరూ పట్టలేకున్నారు. ఎవరినో కొట్టడానికి పై పైకి వస్తుంటే వాడిని అందరూఆపుతున్నారు. చివరికి మన గ్రూప్ లీడర్ కూడా వాడిని శాంతింప జేస్తున్నాడు. అయితే నన్ను కలవర పెట్టిన విషయం ఏమంటే, మాటి మాటికీ నా పేరు ఆ గొడవలో వినపిస్తూ ఉండటం. అందరి చూపులూ నామీదే ఉన్నాయి. నాకాళ్ళు సన్నగా వణకసాగాయి. ఏమైఉంటుందిరా భగవంతుడా? అనుకుంటుండగా నాకు తెలిసిన గ్రూప్ లీడరు నా వైపు వచ్చాడు. ఏంది గొడవ? అని అడిగాను. “ఏందా? ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు నీ లుంగీని పైకి మడిచి ఎందుకు కట్టుకున్నావు? ఇక్కడ ముస్లిములే అట్టా కట్టుకుంటారు. నువ్వు ముస్లిమ్ వో లేక వారి మద్దతుదారుడివో అయ్యుంటావని నిన్ను కొట్టడానికి వస్తూంటే నేనాపాను. సౌత్ ఇండియన్లు అలాగే కడతారు అని అంటే వాడు వినటం లేదు. నాతోనే గొడవపెట్టుకుంటున్నాడు.” అన్నాడు పాన్ మసాలా నవులుతూ. ఇదన్న మాట విషయం. నేను వారి మధ్యకెళ్ళి సర్ధిచెప్పిమాట్లాడాలంటే మనకటు హిందీ రాదు ఇటు గుజరాతీ రాదు. మరో కొత్త గొడవని సృష్టించుకోవటం దేనికనుకుని. నా లుంగీ పైకుందా? కిందికుందా? అని ఓ సారి చూసుకున్నాను. “సరే నువ్వెళ్ళు నేను చూసుకుంటాలే, బయట మాత్రం లుంగీని ఎగకట్టకు” అని అనటంతో, సరే కొట్టుకుచావండి అనుకుని మెల్లగా నా రూంకి వెళ్ళిపోయాను. అయితే ఈ సారి మెట్లెక్కేటప్పుడు లుంగీ పైకి మడవలేదు కాని మనసులో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. షేవింగ్ చేసుకున్నానో లేదో గుర్తులేదు కాని త్వరగా తయారయి, బస్ ఎక్కి లాల్ దర్వాజా మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ఓ అరడజను షార్ట్ లు కొని సాయంత్రానికి తిరుగుముఖం పట్టాను.ఆహా నాచేత షార్ట్లు వేయించటానికి ఆ పైవాడు హిందు ముస్లింల గొడవలు రేపాడే అనుకుని, ఆ రోజునుండి షార్ట్ లు వేసుకుని కులకటం మొదలుపెట్టాను.అవి మోకాళ్ళ పైకి ఉండి అర్ధనగ్నంగా కనిపిస్తూఉన్నా ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేకుండాపోయింది. అంతే ఆనాడు విప్పిన లుంగీ మళ్ళీ కట్టనే లేదు అహ్మదాబాద్ లో.అలా లుంగీ పోయి నిక్కరు వచ్ఛే ఢాం..డాం…ఢాం.

Permalink 11 Comments

కృకీలు

March 13, 2008 at 8:05 PM (కృకీలు)

నీలో నన్ను చూడాలనుకున్నాను,
నాలో నన్నే పోగొట్టుకున్నాను.

Permalink 2 Comments

మనసు దోచుకున్న తెలుగు కీచకుడు

March 11, 2008 at 7:25 PM (మనసులో మాట)

(కీచక వేషధారి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు మరియు విరాటరాజు పాత్రధారి)

వసంత కాలం ఆరంభమైందంటే చాలు, కళలు పురివిప్పి నాట్యం చేస్తాయి అహ్మదాబాద్ లో. దక్షిణ భారతదేశం లో పుట్టి జగమంతా వ్యాప్తి చెందిన భరతనాట్యానికి గుజరాత్ లో జీవం పోసింది గురు శ్రీమతి ఇలాక్షి బెన్ ఠాకోర్. “నృత్యభారతి” సంస్థని 1960 లో స్థాపించి భరతనాట్యానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి కొన్ని వందలమంది నృత్యకారుల్ని తయారుచేసింది . కళ కే అంకితమైన ఈ సంస్థను ఇప్పుడు పాత కొత్తల మేలి కలయికలతో, అనేక కొత్త నృత్యరీతులు కనుగొని సరికొత్త కోణాలను ఆవిష్కరించిన ఆమె కుమారుడు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ మరియు నృత్యకారుడు శ్రీ చందన్ ఠాకూర్ సమర్ధవంతంగా నడిపిస్తున్నారు.

(గురు శ్రీ చందన్ ఠాకోర్)

ప్రతి సంవత్సరం వసంత కాలారంభంలో మూడు రోజులపాటు కనులవిందుగా జరిగే ఈ నృత్య కార్యక్రమాలకు మన దేశంలోని ఇతర నృత్యకారుల్ని సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా ఈ సారి చెన్నై నుండి చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అధినేత శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ మరియు ఆమె శిష్యురాళ్ళు, ఒరిస్సా , నృత్యాయన్ నుండి శ్రీ దుర్గా చరణ్ రణబీర్ మరియు వారి విద్యార్ధులు…..ఇక ఆడిటోరియం ని దద్దరిల్లజేసి, అందరి చేత ఔరా! అనిపించుకున్న శ్రీ బాల త్రిపుర సుందర కూచిపూడి నాట్య కళాక్షేత్రం, విజయవాడ నుండి గురు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ మరియు వారి తోటి నృత్యకారులు. మీడియా కూడా వీరిగురించి అద్భుతంగా వ్రాసింది. అహ్మదాబాద్ లో ఇలాంటి కార్యక్రమాలు రాత్రి భోజన సమయం దాటిన తరువాత మొదలవుతాయి. ఠాగూర్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమం లో మొదటి రోజు 20-2-08 శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ గారి శిష్యురాళ్ళు అసలు క్లాసికల్ డాన్స్ అంటే ఏమిటో అందరికీ రుచి చూపించారు. ముఖ్యంగా శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ గారు గంగానది థీమ్ మీద కొరియోగ్రఫీ చేసిన “ప్రవాహాంజలి” చెప్పుకోదగ్గది. గంగానది ఒక్కోదగ్గర ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మరోదగ్గర రౌద్ర రూపం కలిగి ఉంటుంది..ఇలా ఎన్నో రూపాలు. కాని గంగ “The river of wisdom , neither forgetting the roots nor the destination.” ఈ భావంతో సాగిన భరతనాట్యం ఆద్యంతమూ అద్భుతంగా జరిగింది.”అబ్బా భలే చేసారు వీళ్ళు.”, “ఎంతైనా భరతనాట్యం చూడాలంటే సౌత్ ఇండియన్స్ చేస్తేనే చూడాలి.” అనే కామెంట్స్ వినిపించాయి రాత్రి 11 గంటలప్పుడు కార్యక్రమం ముగిసిన తరువాత. “రేపు రాత్రి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారి ట్రూప్ చే కూచిపూడి నృత్యరూపకం.” అని అనౌన్స్ చేసారు ముగింపులో .

(అద్బుత భంగిమలో ఉన్న ఈ నర్తకి వయస్సు 14 సంవత్సరాలు!!)

ఇక ఆ పక్క రోజు ఏం జరిగిందో చెప్పటానికి మాటలు చాలవు. రాత్రి 9 గంటలకు శంఖారావం తో మొదలుపెట్టి “కీచక వధ” కూచిపూడి నృత్యరూపకం, రెండు గంటలు నడుస్తుంది అని అనౌన్స్ చేసినప్పుడు. ఎరక్కపోయి వచ్చామురా! అన్నట్టు గుసగుస లాడుకున్నారు ఆడియన్స్. కూచిపూడి అంటే ఏదో భరతనాట్యం టైప్ లోనే ఏ పళ్ళెంలోనో..దీపాలు పట్టుకునో డాన్స్ ఉంటుందనే అనుకున్నారు చాలామంది. విరాట రాజు కొలువు కి భీముడు(నిజంగా భీముడు లాగే ఉన్నారాయన ఎవరోగాని) వచ్చి తన గురించి పరిచయం చేసుకునే సమయంలో ఆయన చేసిన నృత్యం చూసి ప్రేక్షకులు నోళ్ళు తెరిచారు. ధర్మరాజు, నృత్యమంటే ఇలా ఉండాలి అన్నట్లు గా చేసిన అర్జున పాత్రధారి, ద్రౌపది, గాంధారి, విరాటరాజు, సంగీత కళాకారులు…ఇలా అందరూ న్యాయం చేసి కూచిపూడి పేరు నిలబెట్టారు. ఇక కీచకుడి గురించి ఎంత పొగిడినా తక్కువే…ఆ హావభావాలు, అలవోకగా చేసే నృత్యం, బాడీ లాంగ్వేజ్, అభినయం. దానికి తోడు వీరందరికీ ఎవరి తత్వానికి తగ్గట్లుగా వారికి గాత్రం అందించిన గాయకుడు. నటనలో, నాట్యం లో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, కాని దాదాపు వేయి మంది ప్రేక్షకులు మూడు గంటలు ఊపిరి బిగపట్టుకుని చూసారంటే మాత్రం దానికి కారణం కీచక వేషధారి గౌరవనీయులు శర్మ గారే. సభలో పాండవులని మొదటి సారి చూసినప్పుడు వీరు తమ హావభావాలతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు. అద్భుతమైన టాలెంటు తో వీరు చేసిన నృత్యవిన్యాసాలు అందరినీ ఆశ్చర్యానందాలతో ముంచెత్తాయి. నృత్యరూపకం పూర్తయినవెంటనే ప్రేక్షకులందరూ లేచి నిలుచుని హాలుని చప్పట్లతో మారుమ్రోగించారు. ఇలా నుంచుని గౌరవించటం నేనిక్కడ చూడటం ఇదే మొదటిసారి. తరువాత శ్రీ శర్మ గారు ” I am poor … in english…” అని మొదలుపెట్టి “I would like to tell you about my feelings..but.. due to language problem..I am unable to express..my thoughts.” అని వినమ్రంగా అనటంతో సభ మళ్ళీ హర్షాతిరేకంతో నిండి పోయింది. స్టేజ్ ని గడ గడ లాడించిన కీచకుడితడేనా అనిపించేంత సాధారణం గా మారిపోయింది శ్రీ శర్మ గారి శరీర భాష. వీరు వెంటనే అహ్మదాబాదు విడిచి వెళ్ళిపోయినా…మూడవరోజు రాత్రి జరిగింది వీరికి అసలు సత్కారం. ఆ రోజు రాత్రి కార్యక్రమాలను మొదలుపెడుతూ యాంకర్ ఇలా అంది “ఈ స్టేజ్ ఇప్పుడు ఖాళీగా ఉన్నా…ఇంకా కీచకుడు తిరుగుతున్నట్లుగానే ఉంది కదా మీ అందరికీ?” అంతే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది మరోసారి.

గురువు గారు! మీకు పాదాభివందనాలు.

Permalink 9 Comments

Next page »