గొంగళి పురుగు…పారిజాతం.
మహా శివరాత్రి బద్దకంగా కళ్ళు తెరిచాను, నా మేని పై పూర్తి గా విప్పారిన పారిజాత పువ్వు . పైన దాని చుట్టూ తిరుగుతూ మకరందం కోసం ఎగబడుతున్న రంగు రంగుల సీతాకోక చిలుకల సందడితో మరింత అహ్లాదకరముగా ఉంది. దాన్ని చూడగానే ఠక్కున పార్వతిదేవి గుర్తుకొచ్చింది. కానీ అప్పుడెప్పుడో కృష్ణుడు ఇచ్చిన ప్రచారపు దెబ్బ ఇప్పటికీ నన్నువదలలేదు. పూసిన ప్రతీసారీ ఇంద్రుడి రెకమండేషన్ అనో, బ్రహ్మ రెకమండేషన్ అనో నా ముచ్చట తీరకముందే కోసుకుని వెళ్ళిపోతారు. కాని ఈ సారి ఎవరికీ ఇవ్వదలుచుకోలేదు. తప్పకుండా ఆ పార్వతీ దేవికే పంపాలి, పైగా శివరాత్రి, సంతోషిస్తుంది. మనసులో అనుకున్నదే తడువుగా ఎదురుగా ప్రత్యక్షమయిపోయాడు ఆ దేవదేవుడు. ఆశ్చర్యంగా తన ముఖం నిండా చిరు చెమటలు పట్టి ఉన్నాయి, అందరికి చెమటలు పట్టించే మహాశివుడికి చెమటలు ఎవరు పట్టించి ఉంటారా అని ఆలోచిస్తూ, స్వామీ ఏమిటి ఆ చిరుచెమటలు అంటూ అరా తీసాను. ఆ ఏమిలేదు పారిజాతం, పార్వతి దేవి రాజకీయాల మీద పరిశోధన చేస్తూ , రౌడీయిజానికి , రాజకీయానికి సంబందం ఏమిటి దేవా! అని అడిగింది, మనకా రాజకీయాలు తెలియకపోయే, అందుకని మన దగ్గరే ఉన్న రాజకీయ ధురంధురుడు పీవీ గారిని అడిగితే తెలుస్తుందని ఇక్కడకు వస్తే ఆయన నవ్వి మూతి ముందుకు పెట్టుకుని నిన్ను కలవమన్నాడు, అయినా నువ్వేమి చెబుతావో నాకర్ధం కాలా, అంటూ నా వీపు మీద వున్నఓ గొంగళి పురుగు వంక కొద్దిగా అసహ్యంగా చూసి ఓ అడుగు వెనక్కి వేశాడు. అది చూసి స్వామీ! గొంగళి పురుగు అంటే మీకులాగే నాకూ అసహ్యమే, పేరుకి పెద్ద పారిజాతాన్నే అయినా, ఉండేది స్వర్గలోకం లో అయినా కొమ్మలు ,పూలూ, ఆకులు తప్ప చేతులులేని దాన్ని, దాన్నిఏలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతూవుంటా…కాని సరైన మార్గమే దొరుకదు. అది నా ఆకులను మెల్లమెల్లగా కొరికి తినేస్తువుంటే నేను ఏమి చేయలేక ఓ రోజు ఈవినింగ్ వాక్ కు వచ్చిన మన పీవీ గారికి నా సమస్య చెబితే ఆయన నవ్వి, కాలం తన పని తను చేసుకొని పోతుంది అని మీరు చెప్పినట్లే మూతి ముందుకి పెట్టుకుని జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు. కాని తరువాత కొన్నిరోజులకు నా కర్ధమైంది, నాడు ఆ మౌన మేధావి చెప్పింది నిజమే అని, నేను ఈ రోజు ఆనందంగా చూస్తున్నసీతాకోకచిలుకలే దానికి సాక్ష్యం. నాడు నన్ను బాధ పెట్టిన ఆ గొంగళి పురుగులే నేటి సీతాకోక చిలుకలని …..ఇంకా ఏదో చెప్పేలోపలే రౌడీ యిజానికి , రాజకీయానికి సంబంధం అర్ధమయిందోచ్…..థాంక్స్ పీవీ అంటూ ఒక్కసారిగా మాయమయ్యాడు ఆ దేవదేవుడు నే చెప్పేది పూర్తిగా వినకుండానే…
పొటాటో ప్రేమ.
మాంచి మసాలా కూర చేద్దామని, బుట్టలోనుండి బంగాళాదుంపలు బయటికి తీసాను.
కూనిరాగం తీస్తూ వాటిని కడిగి, తీరా తరుగుదామని కత్తి దూస్తే, ఇంకేముంది దాని
దుంపదెగ బంగాళాదుంప కాస్తా ప్రేమరాగాలు పాడింది. అంటే అర్ధం కాలేదా?
పైన ఫోటోలో చూడండి. ప్రేమ గుర్తులో ఎంత ముద్దుగా ఉందో. దాని ప్రేమ సందేశం
ఎర్రగా బుర్రగా ఉండే టమేటాకో మరి దేనికో మరి. అలా తరగటానికి మనసు రాక.
ప్లాస్టిక్ కవర్ లో మడచి ఫ్రిజ్ లో ఉంచాను ఇప్పటికి.
అయ్యలారా! అమ్మలారా! దాన్ని ఏం చేస్తే బాగుంటుందో కాస్త చెప్పండి.




