లుంగీ పోయి నిక్కరు వచ్ఛే ఢాం..డాం…ఢాం.

March 24, 2008 at 11:59 AM (అనగనగా .....)

తొమ్మిదేళ్ళ క్రితం అహ్మదాబాదుకి ఉద్యోగంలో చేరటానికి వెళ్ళేంత వరకు నన్ను నేను ఒక సెక్యులరిస్ట్ గా ఊహించుకుని గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. స్నేహితుల్లో ముస్లిములు, క్రిస్టియన్లు ఇంకా అనేక ఇతర మతాల వారుండటంతో నాలో నేనే గర్వపడేవాడిని. అయితే అహ్మదాబాదు లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే గర్వమంతా అణిగిపోయింది. దీనికంతా కారణం ఒక లుంగీ. పొట్ట బొడిస్తే హిందీ ముక్క రాని నేను ఎట్టకేలకు సిటీ అంతా తిరిగి ఆఫీసులో ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్నాను. ఉద్యోగంలో చేరేటప్పుడు నా దగ్గర ప్రతిజ్ఞ (అదో ప్రొసీజరులే) తీసుకున్నపెద్దాఫీసరు నాకు షేక్ హ్యాండిచ్చి ఒకటే మాట చెప్పాడు. “నువ్వు హిందువయితే నది (సబర్మతికి) కి పడమర వైపు ఇల్లు తీసుకో, ముస్లిం అయితే నదికి తూర్పు వైపు తీసుకో” అని. ఈ మాటలిన్నాక నేనాయన్ని ఏమనుకోవాల? ఈడి ముండ మొహాన ఎండ గాయ,ఈ ఊర్లో ఇట్ట అడుగు బెట్టామో లేదో హిందువనీ ముస్లిమనీ గొడవలు పెట్టేటట్టు ఉన్నాడు మహానుభావుడు అనుకున్నాను. బుద్ది గా ఆయనమాట ఆనాడు వినుంటే, ఎన్నో భయానక అనుభవాలు తప్పిపోయిఉండేవి. మతకలహాలప్పుడు, తిండినిద్రా కరువయ్యుండేది కాదు. చీమ చిటుక్కుమన్నా గుండె ఝల్లుమనేది కాదు. చాకు పట్టుకోవటం కూడా సరిగా రాని మాకు పెద్ద పెద్ద కత్తులు, బరిశలు ఇచ్చి, ఎవరైనా మన సొసయిటీ మీద దాడి చేస్తే అందరం కల్సి వాళ్ళతో పోరాడాల అని చెప్పిన ఇంటి ఓనరు. చీపురు కట్ట పెట్టే దగ్గర ఈ కత్తులు బరిశలు పెట్టాల్సి వచ్చింది కదరా దేవుడా అని వాటిని చూసినప్పుడల్లా, మేము ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం. ముస్లిం పేరున్న ఓ హిందు స్నేహితుడి వల్ల ఒకనాడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం. అలాగే మేము ఈ పాత బస్తీ నుండి మకాం ఎత్తేసి సబర్మతి నదికి పడమరవైపుకి మార్చినప్పుడు మమ్మల్ని వదలలేని రజాక్ అనే ముస్లిం స్నేహితుడిని రాజు అని అందరినీ నమ్మించి, రెండేళ్ళ తరువాత ఆ నిజం బయటపడి మళ్ళీ అక్కడి నుండి రాత్రికిరాత్రే మకాం ఎత్తేయటం…ఇలా ఒకటని కాదు, కాని మాలో మాకు ఎంత స్నేహమున్నా, చివరకి హిందువులం పడమరవైపు ముస్లిములు తూర్పువైపు స్థిరపడాల్సి వచ్చింది. ఇలా అనేక ఆసక్తికరమైన సంఘటనలు ఎన్ని జరిగినా, ఈ లుంగీ ఎపిసోడ్ మాత్రం జాతి వైషమ్యాల విషయంలో నాకు జరిగిన మొట్టమొదటి తమాషా అనుభవం. అది ఎలా జరిగిందంటే…

కాశీమజిలీ కథల్లో లాగ “ఓ రాజకుమారా! నువ్వే దిక్కు కయినా వెళ్ళు గాని ఆ ఉత్తరం దిక్కుకు మాత్రం వెళ్ళద్దు.” అని పేదరాశి పెద్దమ్మ చెప్పినట్టు ఆ ఆఫీసరు చెప్పింది బుద్దిగా విని పాటించక నదికి తూరుపు దిక్కున, చుట్టూ ముస్లింలు ఉండే ఓ హిందూ సొసైటీలో మిద్దె మీద గది అద్దెకు తీసుకున్నాను. ఓ పదిరోజుల్లోనే ఆయన మాటల్ల్లో వాస్తవం అర్ధమై దిమ్మదిరిగిపోయింది. ఈ పదిరోజుల్లో పరిసరాలు కాస్త పరిచయమయ్యి, ఫ్రీ గా తిరగటం , ఎవరైనా పలకరిస్తే నవ్వటం వంటివి జరగతున్నాయి (మాట్లాడాలంటే భాషరావాలిగా) . ఆంధ్రాలో ఉన్నప్పుడు లుంగీలు ఎక్కువగా కట్టేవాడిని, కనీసం అహ్మదాబాద్ వెళ్ళినతరువాత అయినా షార్ట్ లు వాడదాం అన్న కోరిక మనసులో ఉండిపోయింది. ఇదా కొత్త ప్రదేశం, అసలేపెళ్ళైన ఆడవాళ్ళు కొంగు తలపై నుండి తీయటం లేదు. ఇక అవేసుకుని తిరిగితే ఏమేమి సమస్యలు వస్తాయో అని షార్ట్ లని వాయిదా వేసి లుంగీలే వాడుతున్నాను.

అప్పటికే ఆఊరి అమ్మాయిల అందాలకి పరవశుడ్నైపోయి ఉన్నానేమో. ఓ శలవు దినాన షేవింగ్ చేసుకుని గ్లామరస్ గా తయారయి ఊరిమీద పడదామనుకుని, బ్లేడ్ కోసమని మెట్లు దిగి కిందకు వచ్చాను. మెట్లు దిగేటప్పుడు లుంగీ కాళ్ళకి అడ్డు పడుతుందని పైకి మడిచి కట్టడం అలవాటుకదా. అప్పుడు కూడా అలాగే దిగి, ఈ రోజు ఏఏ పార్కుల్లో తిరిగివద్దామా? అని అలోచించుకుంటూ సొసయిటీ బయట ఉండే ఓ షాప్ కెళ్ళి బ్లేడ్ కొని, తిరిగి సోసైటీలో అడుగు పెట్టాను. అంతే అక్కడో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. నేను ఆశ్చర్యపోయాను. బ్లేడ్ కొనటానికి వెళ్ళేటప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. ఈ పదినిమిషాల్లో ఏమైందబ్బా? అనుకుని. అహ్మదాబాద్ లో మొదటి గొడవ కదా! ఓ గోడ వారగా నుంచుని చోద్యం చూడసాగాను. మనం అక్కడ చూడగలమే గాని, ఆ గుజరాతీభాష ఒక్క ముక్క కూడా అర్ధం జేసుకోలేము కదా. నాకర్ధమైందేమిటంటే, అక్కడ రెండు గ్రూపులు గొడవాడు కుంటున్నాయి. నాకు కాస్త ముఖపరిచయం ఉన్న వాడిది మన బ్యాచ్ అనుకుంటే, ఎదుటి గ్రూప్ వాడిని ఎవరూ పట్టలేకున్నారు. ఎవరినో కొట్టడానికి పై పైకి వస్తుంటే వాడిని అందరూఆపుతున్నారు. చివరికి మన గ్రూప్ లీడర్ కూడా వాడిని శాంతింప జేస్తున్నాడు. అయితే నన్ను కలవర పెట్టిన విషయం ఏమంటే, మాటి మాటికీ నా పేరు ఆ గొడవలో వినపిస్తూ ఉండటం. అందరి చూపులూ నామీదే ఉన్నాయి. నాకాళ్ళు సన్నగా వణకసాగాయి. ఏమైఉంటుందిరా భగవంతుడా? అనుకుంటుండగా నాకు తెలిసిన గ్రూప్ లీడరు నా వైపు వచ్చాడు. ఏంది గొడవ? అని అడిగాను. “ఏందా? ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు నీ లుంగీని పైకి మడిచి ఎందుకు కట్టుకున్నావు? ఇక్కడ ముస్లిములే అట్టా కట్టుకుంటారు. నువ్వు ముస్లిమ్ వో లేక వారి మద్దతుదారుడివో అయ్యుంటావని నిన్ను కొట్టడానికి వస్తూంటే నేనాపాను. సౌత్ ఇండియన్లు అలాగే కడతారు అని అంటే వాడు వినటం లేదు. నాతోనే గొడవపెట్టుకుంటున్నాడు.” అన్నాడు పాన్ మసాలా నవులుతూ. ఇదన్న మాట విషయం. నేను వారి మధ్యకెళ్ళి సర్ధిచెప్పిమాట్లాడాలంటే మనకటు హిందీ రాదు ఇటు గుజరాతీ రాదు. మరో కొత్త గొడవని సృష్టించుకోవటం దేనికనుకుని. నా లుంగీ పైకుందా? కిందికుందా? అని ఓ సారి చూసుకున్నాను. “సరే నువ్వెళ్ళు నేను చూసుకుంటాలే, బయట మాత్రం లుంగీని ఎగకట్టకు” అని అనటంతో, సరే కొట్టుకుచావండి అనుకుని మెల్లగా నా రూంకి వెళ్ళిపోయాను. అయితే ఈ సారి మెట్లెక్కేటప్పుడు లుంగీ పైకి మడవలేదు కాని మనసులో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. షేవింగ్ చేసుకున్నానో లేదో గుర్తులేదు కాని త్వరగా తయారయి, బస్ ఎక్కి లాల్ దర్వాజా మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ఓ అరడజను షార్ట్ లు కొని సాయంత్రానికి తిరుగుముఖం పట్టాను.ఆహా నాచేత షార్ట్లు వేయించటానికి ఆ పైవాడు హిందు ముస్లింల గొడవలు రేపాడే అనుకుని, ఆ రోజునుండి షార్ట్ లు వేసుకుని కులకటం మొదలుపెట్టాను.అవి మోకాళ్ళ పైకి ఉండి అర్ధనగ్నంగా కనిపిస్తూఉన్నా ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేకుండాపోయింది. అంతే ఆనాడు విప్పిన లుంగీ మళ్ళీ కట్టనే లేదు అహ్మదాబాద్ లో.అలా లుంగీ పోయి నిక్కరు వచ్ఛే ఢాం..డాం…ఢాం.

Permalink 11 Comments

పూలవాన పెళ్ళిపిలుపు

January 8, 2008 at 6:16 PM (అనగనగా .....)

మన పూలవాన రవికిరణ్ తెలుగులో (పిలిచి) చేసిన తన సోదరుని వివాహ ఆహ్వానపత్రిక ఈ వీడియోలో వీక్షిద్దాం  …….

Permalink 1 Comment

చార్వాకుడు

September 22, 2007 at 1:04 PM (అనగనగా .....)

 ఈమధ్య బ్లాగులోకములో “చార్వాకుడు” గురించి  జరిగిన చర్చకు స్పందించి మాకు తెలిసిన ఈ కొద్దిపాటి సంగ్రహాన్ని కూడా దానికి తోడుగా   అందిస్తున్నాము…   

రమగారూ! చార్వాకుల గురించి ఈ కంప్యూటర్ కాలంలో అడిగారు కాబట్టి సరిపోయింది. అదే పురాణకాలంలో అడిగి వుండి వుంటే…..అనుమానం లేదు గొడవలు జరిగిపోయి ఉండేవి.

అత్యంత బాధాకరంగా అంతమైన చార్వాకుని కథ గురించి తెలుసుకునే ముందు  ఈ చార్వాకుల శాఖ గురించి తెలుసుకోవటం ముఖ్యం.

చార్వాక, లోకాయత, బార్హస్పతి అని అనేక పేర్లు గలవు ఈ శాఖకు.

‘లోకేషు అయతాః లోకాయత’

‘లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా ఒక మూల పురుషుడు లేడు. ఇది సామాన్య ప్రజల్లో పుట్టిన ‘అనుమాన’, ‘తర్క’ ల ప్రభావమే. మనం భగవంతుడికి ప్రసాదం రోజూ పెడుతూనే వున్నాం కాని ఆయన ఎప్పుడన్నా దాన్ని తిన్నాడా? ఇలాంటి తర్కాలను లేవదీసి, చివరకు ఆనాటి అధ్యత్మికవాదులచే తిరస్కరింపబడ్డారు ఈ లోకాయతులు.

14వ శతాబ్ధికి చెందిన మాధవాచార్య తన ‘సర్వదర్శక సంగ్రహం’ లో ఇలా వివరించాడు. “సంపదనూ, కోరికలనూ…మానవ లక్ష్యాలుగా భావించి, సంతోషాన్ని ధ్యేయంగా పెట్టుకున్న విధానాన్ని, సూత్రాలను అనుసరించుతూ, భవిష్యత్ ప్రపంచ వాస్తవికతను నిరాకరించే మానవ సమూహాన్ని చార్వాక సిద్దాంతాన్ని అనుసరించే వారిగా గుర్తించవచ్చు. వారి సిద్దాంతానికి మరోపేరు ‘లోకాయుత’. వస్తు రీత్యా సరైన పేరు.”
దేవుడు లేడు, ఆత్మలేదు, మరణానంతరం మిగిలేదేమీ లేదు అని నమ్మి ఇంద్రియసౌఖ్యాలకి ప్రాధాన్యత నిచ్చిన వీరిని చరిత్ర భౌతికవాదులుగా పేర్కొనింది.

ఆనాటి సమాజంలో రాజకీయంగా, ఆర్ధికంగా బలవంతులైన వైదిక సంప్రదాయ వాదులచే  అణగద్రొక్కబడిన లోకయతుల ప్రాచీన గ్రంధాలన్నీ క్రీ.పూర్వమే ధ్వంసం చేయబడ్డాయని అంటారు. చివరకు వీరి ఆచారాలు, సంప్రదాయాలను, వీరి ప్రత్యర్దుల గ్రంధాల నుండి,(వ్యంగ్య) వ్యాఖ్యల  నుండి తీసుకోవలసి వచ్చింది. క్రీ.పూ.300 కి చెందిన కాత్యాయనుడు వైయాకరిణి లోకాయతపై ‘భాగురి వ్యాఖ్యానం’ ఉదహరించాడు. అంటే ఆ కాలం లోనే లోకాయత గ్రంధమూ, దానిపై వ్యాఖ్యానమూ వున్నాయన్నమాట.
‘బ్రహ్మ సూత్రాల’ భాష్యంతో శంకరాచార్య వీరిని ‘ప్రకృతిజనాః’(మూర్ఖజనులు) అంటే లోకాయతులనే చెప్పాడు. ‘షడ్ దర్శన సముచ్చయ’ రచయిత హరిభద్రుడు, లోకాయతులను వివేచన లేని గుంపుగా, ఆలోచన లేని సముదాయంగా వర్ణించాడు.
ఆ కాలంలో దీని వ్యతిరేకతలోనే దీని ప్రభావం, శక్తి, ముఖ్యత గోచరిస్తాయి.
సామాన్య బ్రాహ్మణుడినుండి, పాలకుల వరకు లోకాయత శాస్త్రాన్ని అభ్యసించే వారని అనేక ఆధారాలున్నాయి. బ్రాహ్మణుడైన జాబాలి, శ్రీరాముడికి మత విరోధ భావాలు బోధించాడు. బౌద్ధులు పిడి సూత్రాలలో, బ్రాహ్మణులు అభ్యసించే అనేక శాస్త్రాలలో లోకాయత ఒకటని పేర్కొన్నారు. ‘వినయపిటిక’ ప్రకారం, బుద్దుడు ఆపి వుండకపోతే కొందరు బౌద్ధ సన్యాసులు కూడా లోకాయతను పఠించడానికి సిద్దపడ్డారట. బుద్దఘోషుడు లోకాయతను “వితండవాద శాత్త” అని పిలిచాడు. (పాళీభాషలో శాత్త అంటే సంస్కృతంలో ‘శాస్త్రం’.).మహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుతో తన చిన్ననాటి విషయాలు ముచ్చటిస్తూ ద్రౌపది ఇలా అంది. తన చిన్ననాడు, తమతో వుండటానికి ఒక బ్రాహ్మణుడ్ని తన తండ్రి ఆహ్వానించాడనీ, ఆ బ్రాహ్మణుడే తన తండ్రికి, తన సోదరులకు బార్హస్పత్య భావాలను బోధించాడనీ, తనూ వాటిని ఆసక్తితో వినేదాన్ననీ చెప్పింది. ద్రౌపది చెప్పిన విషయాలు విని ధర్మరాజు ఆమెను మత వ్యతిరేక భావాల ప్రభావంలో పడిపోయిందని నిందించాడు. కౌటిల్యుడు తన ‘అర్ధశాస్త్రం’ లో సాఖ్య, యోగశాస్త్రాలతో పాటు, లోకాయతను కూడా ఉదహరించి, దానిని ‘తర్కశాస్త్రం’ అన్నాడు. బాణుని  ‘హర్షచరిత్ర’లో విచ్చేసిన ఋషుల జాబితాలో ‘లోకాయత’ పేరు కూడా వుంది.

14వ శతాబ్ధపు జైన వ్యాఖ్యాత అయిన గుణరత్నుడు లోకాయతుల గురించి ఇలా చెప్పాడు. జీవితం బుద్బుదప్రాయం అని తలచి, మానవుడు చైతన్యసహితమైన శరీరం తప్ప ఇంక ఏమీలేదు అన్న అభిప్రాయంతో మద్యపానం, మాంసభక్షణ, అదుపు లేని లైంగిక క్రియలలో పాల్గొనేవారు. కామానికతీతమైన దేన్నీ వారు గుర్తించరు. వారిని చార్వాకులనీ, లోకాయతులనీ అంటారు. పానం చేయుట, నములుట(భుజించుట) వారి నీతి. నములుతారు కనుక వారిని చార్వికులంటారు. (చర్వ్:నములుట). అంటే వివేచన లేకుండా భుజిస్తారట. వీరి సిద్దాంతం బృహస్పతి ప్రతిపాదించాడు కనుక వారిని బార్హస్పత్యులని కూడా అంటారు.
వాస్తవ జగత్తును మినహా , అన్నింటినీ తిరస్కరించినందువల్లే ఈ తత్వశాస్త్రాన్ని ‘లోకాయత’ అంటారని పంచానన తర్కరత్న ఉవాచ. మొత్తానికి అనాటి వైదికసాంప్రదాయాలనూ, మూఢ నమ్మకాలనూ  ఎండగట్టి తిరస్కరించినందువలనే, ఈ లోకాయతులు అణచివేయబడ్డారన్నది సుస్పష్టం.

‘మహా భారతం’ లో శాంతిపర్వంలో వున్న ప్రసిద్దమైన చార్వాక వధ.

కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలకొలదీ బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యధిష్టురుని ఆశీర్వదించడానికి ప్రోగయ్యారు. వారిలో చార్వాకుడు కూడా వున్నాడు . మిగతా బ్రాహ్మణుల అనుమతి తీసుకోకుండానే, ముందుకు వెళ్ళి ధర్మరాజు నుద్దేశించి ఇలా అన్నాడు.
“ఈ బ్రాహ్మణ సమూహం, నీ రక్త బంధువులను వధించిన నిన్ను శపిస్తోంది. నీ మనుషులనే, నీ పెద్దలనే సమ్హరించి నీవు సాధించిందేమిటి? నీవు చనిపోయి తీరాలి (నశించాలి)”
హఠాత్తుగా జరిగిన చార్వాకుని మాటలకు, అక్కడ సమావేశమైన బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. యధిష్టిరుడు నైతికంగా గాయపడి మరణించాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికి మిగతా బ్రాహ్మణులు తెలివి తెచ్చుకుని, చార్వాకుడు తమ ప్రతినిధి కాదనీ, బ్రాహ్మణ వేషంలో వున్న రాక్షసుడనీ, రాజ విరోధి దుర్యోధనుని మిత్రుడనీ చెప్పారు. అలాగే తమకు రాజు చేసిన ఘనకార్యాల పట్ల మెచ్చుకోలు మాత్రమే కలదని హామీ ఇచ్చారు. నిరసన తెలిపిన చార్వాకుని నిలువునా దహించి వధించి వేసారు.

‘మహాభారతం’ ప్రకారం పవిత్రులైన బ్రాహ్మణుల చేతిలో దగ్ధమైపోయిన “చార్వాకుడు అంతకు పూర్వం ఒక రాక్షసుడు. కఠోరమైన తపస్సులు చేసి విపరీతమైన శక్తులు సంపాదించాడు. ఆ తరువాత దేవతలను బాధించి అణచివేయటం ప్రారంభించాడు.” అని ముద్రవేశారు . ఇది మామూలే, ఆ రోజుల్లో బ్రాహ్మణ సంప్రదాయాలను వ్యతిరేకించేవారిని రాక్షసులు, అసురులుగా ముద్రవేయటం పరిపాటి.

చార్వాకుడు  యధిష్టిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం.  ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే.
సామాన్యుని అభిప్రాయాన్ని మతాతీతంగా, సాహసవంతంగా వెల్లడించి ఆవిధంగా సాంప్రదాయవాదుల చేతిలో బలైపోయాడు చార్వాకుడు.

—‘చార్వాకుల’ గురించి అనేక చరిత్రకారులు పరిశోధనలు జరిపారు. వీరిలో ముఖ్యులు యస్.యన్.దాస్ గుప్తా, రాధాకృష్ణన్, తుచ్చి, గార్బే, రిస్ డేవిడ్స్, జార్జ్ ధాంసన్, హెచ్.పి.శాస్త్రి, ఇ.బి.కావెల్. పై వ్యాసంలో అధికవివరాలు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చే ముద్రింపబడిన “లోకాయత –అసుర ధృక్పధం” నుండి చాలా వరకు మక్కికి మక్కి తీసుకున్నాను. దీని మూల గ్రంధకర్త శ్రీ దేవీప్రసాద్ చటోపాధ్యాయ, తెనుగించినవారు శ్రీ హరి పురుషోత్తమరావు.10 రూ. కూడా లేని ఈ చిన్ని పుస్తకంలో చాలా విజ్ఙానముంది.

 కొసమెరుపు:ఈ చార్వాకుడి కథ చదివి ప్రభావితులమై, నువ్వుశెట్టి బ్రదర్స్ లో ఒకరి బాబుకి ‘చార్విక్’ అని పేరుపెట్టుకున్నాము. నామకరణం చేసిన పంతులు మాత్రం ఈ పేరువిని ఆశ్చర్యపోయాడు.

Permalink 4 Comments

« Previous page · Next page »