వెతుకులాట
అవును, నాకు నే కానరాక నలుదిక్కులా వెతుకుతున్నా,
కాలం విసర్జించిన నిన్నలో, మిగిలిన
అవశేషాలను కెలుకుతూ,
వ్యర్ధంగా వెతుకుతున్నా…
మనసు కుంపటిలో కాగుతున్న
ఆలోచనల పొగసూరు ఉక్కిరిలో,
కానరాని రేపటి భాగఫలాల కోసం
నిర్లజ్జగా వెతుకుతున్నా..
అవును నిజం
నిన్న కాలిన చేనులో
మిగిలిన నా శేషం కోసం
కాలసర్ప కౌగిలిలో,
నలుదిక్కులా కానరాక,
నన్ను నే వెతుకుతున్నా.
నువ్వే నువ్వే
అందమంటే నీదే
ఎందుకంటే
నీవందని ఎత్తులో ఉన్నావు కాబట్టి.
స్వప్నమంటే నువ్వే
ఎందుకంటే
అది పిలిస్తే వచ్చేది కాదు కాబట్టి.
కాలమంటే నీవే
ఎందుకంటే
నీవు లేని క్షణం నాకు లేదు కాబట్టి.
బలమంటే నీదే
ఎందుకంటే
నీవు కొట్టిన దెబ్బ ఇంకా తగ్గలేదు కాబట్టి.




