కాలమే దేవుడా…..? ఏమో?

September 10, 2009 at 12:59 PM (మనసులో మాట)

question mark

                ఎప్పుడూ అనిపిస్తూఉంటుంది, నిజానికి (కొంతవరకు) కాలమే దేవుడని. ఎందుకంటే  దేవుడు చూడలేని ప్రదేశాలు ఉండవచ్చునేమో కాని, కాలం కాలుపెట్టని ప్రదేశం లేదు. తను స్పర్శించని వస్తువుకాని, తను ప్రయాణించలేని దూరము కాని లేవు. రాయి,రప్ప,నువ్వు, నేను,మంచి చెడు, ఇలా మనల్ని తను పలకరించని క్షణం లేదు. అలాంటి క్షణం ఉంటే మనం లేము. 

నిజానికి రాముడు,కృష్ణుడు,మిగతా దేవుళ్ళు ఎవరైనా సృష్టి చేసిన దేవుళ్ళుకాదు, ఎందుకంటే వాళ్ళకి తల్లి తండ్రులున్నారు, వారికి ముందు కావలిసినంత సృష్టి జరిగింది కాబట్టి వారిని అవతార పురుషులుగానే కీర్తిద్దాం. అలా అయితే మరి అసలు సృష్టి కర్త ఎవరు? ఈ గ్రహాలని, నక్షత్రాలని, అంతులేని పాలపుంతలకి పద్దతులు,నడకలు నేర్పిన ఘనుడెవరు? నేను దేవుడిని, సర్వశక్తి సంపన్నడునని, నేను ఈ సృష్టి చేయాలి అన్న భావన తనకు పుట్టకముందు తనెక్కడ? తనెవరు?  మొట్టమొదటిసారిగా తన శక్తి గురించి తనకు ఎప్పుడు తెలిసింది? ఒకవేళ తనే ఈ సృష్టి ని చేసివుంటే ఎందుకు ఒకేసారి అభివృద్దితో కూడిన సృష్టి చేయలేదు? ఎందుకు ఒకేసారి నాగరికుడిని, అన్నీ తెలిసిన ఆధునిక మానవుడిని ఈ ప్రపంచంలోకి  సృష్టించి వదలలేదు? ఎవరన్నా ఓ మంచి చిత్రకారుడు తన తృప్తి తీరా ఓ బొమ్మ వేసి అది పూర్తయిన తరువాతే ప్రపంచంమీదకి వదులుతారు, మరి మనం తన బొమ్మలమైతే మరి అంచలంచలుగా ఏకకణ జీవులనుంచి ఇన్ని కోట్ల సంవత్సరాలకు ఈ ప్రస్తుత రూపానికి ఎందుకు తీసుకుని వచ్చాడు? ఒకేసారి ఈ రూపం సృష్టించ వచ్చుగదా? వినోదమా? మరి ఈ ప్రస్తుత రూపమైనా పరిపూర్ణమా లేక అసంపూర్ణమా? కొన్ని కోట్ల  సంవత్సరాల తరువాత మనమూ ఆదిమ మానవులమేనా? అప్పటి తరం మైక్రోగా మారి మన గురించి వాళ్ళు ఇళ్ళల్లో ఉండేవారంట, ప్రయాణాలు చేసేవారంట, చేతులతో పనిచేసే వారంట అని చెప్పుకుంటారా?  మనము ప్రస్తుతము అనుకుంటున్నట్లుగా ఆదిమ మానవుడు కూడా తనని తాను ఆధునికమానవుడిగానే పరిగణించుకున్నాడా? ఏమో?

                                          అసలు ఆదినుంచి మనతోపాటు ప్రయాణిస్తూ మన అవసరాలని గమనిస్తూ, పరిస్తితులని దానికి అణుగుణంగా మారుస్తూ, (న్యూటన్ ముందు ఆపిల్ పడేసినట్లు), మనల్ని అభివృద్దితో కూడిన కాలానికి తీసుకపోతున్నదెవరు? తనతోపాటు మనల్నితీసుకుని పోతూ, అన్నీ గమనిస్తూ  కాలమే ఆ భాద్యతలని మోస్తోందా? అయినా కాలం కూడా భూప్రదక్షిణలతోనే మొదలైందికదా? అసలు ఆ భూమి సృష్టి ఎవరిది? ఒకవేళ భూమి తన వేగం తగ్గించుకుని తన చుట్టూ తను తిరగటానికి ఇరవై నాలుగు గంటలు కాకుండా నలభై ఎనిమిది గంటలు తీసుకుంటే మన జీవితకాలం రెట్టింపు అవుతుందా? లేక కాలం అనేది కేవలం ఓ కొలమానమేనా?  తను కాకపోతే ఎవరిది ఆ శక్తి?  హిందూ ధర్మశాస్ర ప్రకారం మనల్ని సృష్టించిన చతుర్ముఖ బ్రంహ్మదా?  అయితే తనను నమ్మని అమెరికా అగ్రరాజ్యం గా ఎందుకుంది? తనని నమ్మే మనమెందుకు వెనుకబడ్డాం?

                            ఏమో? ” అన్నిటి కి కాలమే జవాబు చెప్పాలి” అన్న మాటలలో సత్యం ప్రతి నిత్యం ఋజువు చేసుకుంటూ తన కనుగుణంగా, రహస్యాలని ఒక్కొక్కటిగా విప్పుతూ  పరిస్తితులని మారుస్తూ, శక్తి వంతులమని భ్రమలు కలిపిస్తూ, మనల్ని మనం గమనించలేని విధంగా అందలాలెక్కిస్తూ, మనల్ని గమనిస్తూ, ప్రమాదాలు సృష్టిస్తూ, నల్లమల అడవులలో తోసేస్తూ, తను చేసిన కర్మలలో కాలీ కాలని చితులను గుర్తు తెస్తూ మనతో పాటు ప్రయాణిస్తున్నదెవరు? అసలు మనలను గమనిస్తున్నదెవరు? కాలమా? మరేదైనా? ఏమో కాలమే జవాబుచెప్పాలి. మీరైనా సరే.

 

Permalink 6 Comments

గుష్ రాత్ లో “ఇష్” కథ

April 3, 2009 at 10:11 AM (మనసులో మాట)

girichand 

 చిన్నప్పుడు నేను ఏడుస్తుంటే శబ్దం వచ్చేది కాదంట. కన్ను ముక్కు తీరు బాగున్నా మూగోడు పుట్టేడనుకుని బాధపడ్డారంట. కొన్ని నెలల తరువాత ఎప్పుడో గుక్క పెట్టి ఏడస్తా ఉంటే కాస్త నా గొంతు బయట పడిందంట. ఇంత కష్టపడి తెచ్చుకున్న నా మాటని ఈనాడు పట్టించుకునేవాడే లేడు ఈ గుజరాత్ లో. నా పేరు ’గిరి చంద్’ అని ఎందుకు పెట్టేరో ఇప్పుడెందుకు గాని, గిరి చంద్ అంటే అర్ధమేందిరా? అంటే మాత్రం పైన ఫోటో చూపిస్తా అందరికీ. గంభీరమైన పర్వతం (గిరి), దాని శిఖరం పక్కనే అందమైన చంద మామ (చంద్). ఈ రెండు కలిపితే నేను అని గొప్పలు పోయే వాడిని. అంతిష్టం నాకు నా పేరంటే. అయితే… గుజరాత్ లో అడుగు పెట్టినప్పటి నుండి నా పేరుతో నాకు నరకం చూపిస్తా ఉండారు ఇక్కడోళ్ళు. ఎవరికి నా పేరు గిరి చంద్ అని చెప్పినా “ఆ..గిరీష్ చంద్రా” అని గిరికి ఇష్, చంద్ కి ’ర’ వత్తు చేర్చేవాళ్ళు.  కాదు “గిరి చంద్” అని నొక్కి చెప్పినా, “సరేలే” అని చెప్పి మళ్ళీ గిరీష్ అనే పిలిచేవాళ్ళు. నా గోడు ఎవరూ  పెద్దగా పట్టించుకునేటోళ్ళు కాదు. ఇక్కడ మొగాళ్ళ పేర్లలో ఎక్కువగా ఇష్ శబ్ధం ఉంటుంది. శివభక్తులు ఎక్కువే. పరేష్, ఆశిష్, కల్పేష్ .. ఇలా. తరువాత తరువాత హిందీలో కాస్త పట్టు దొరికిన తరువాత వాళ్ళతో వాదించటం మొదలు పెట్టేను. “నా పేరులో ఇష్ లేదు. కేవలం గిరిచంద్ ..గిరి చంద్ .. గిరిచంద్…మానిక్ చంద్ లాగా.” అని ఎంత గింజుకున్నా వాళ్ళు “సరేలే గిరీష్” అని భుజం తట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ ప్రస్థానం ఎప్పుడూ ఆగలేదు.  ఏ దుకాణానికెళ్ళినా,
బిల్లు రాసేటప్పుడు  “గిరి చంద్” అని నేను చెప్పటం, వాళ్ళు “గిరీష్ చంద్ర” అని రాయటం. నేనొక్కోసారి దాన్ని కొట్టిపిచ్చేసి వేరే పేపర్లో నా పేరు రాసి చూపించి మార్పించే సరికి తల ప్రాణం తోకకొచ్చేది. ఎందుకంటే నా పేరునలా మార్చి నాకే ఇవ్వటం నాకు బాధ కలిగించేది. నా హక్కునెవరో లాగేసుకున్నట్లనిపించేది.

            ఓసారి ఇండియన్ గాస్ కనక్షన్ కి అప్లై చేశాను. దానికి వాళ్ళు  ఐడెంటిటీ ప్రూఫు, రెసిడెన్షియల్ ప్రూఫు,బర్త్ సర్టిఫికేటూ, డెత్ సర్టిఫికేటూ వాళ్ళ పిండాకూడూ అన్నీ అడిగారు. నేను ఉన్నయ్యన్నీ ఇచ్చాను. ఎట్టకేలకు ఓ స్టవ్ కూడా అంటగట్టి కనక్షనిచ్చారు. ఇంటికొచ్చిన తరువాత గ్యాస్ బుక్ లో నా డీటెయిల్స్   చూస్తూంటే నా పేరు చూసి ఏడుపొచ్చింది. అందులో గిరీష్ చంద్ర అని కంప్యూటరు అక్షరాల్లో శుద్ధ గుజరాతీలో ప్రింటయి ఉంది. నేను వాళ్ళకిచ్చిన ప్రూఫుల్లో ఏ ఒక్కదాంట్లో గూడా “ఇష్” లేదు కదా. కడుపు మండిపోయింది.  ఎప్పుడు గ్యాసు ఎలిగిచ్చినా ఆ పేరు ముల్లులా గుచ్చసాగింది. ఓరోజు వీలుచూసుకుని ఓ స్నేహితుడ్ని తీసుకుని ఆ గ్యాస్ ఏజెన్సీకెళ్ళాను. కౌంటర్ లో ఓ చురకత్తి లాంటి అమ్మాయి కూర్చుని ఉంది. జీన్స్, టీషర్ట్ లో ఉంది. నేను కంప్లైంట్ చేశాను. “నా పేరు తప్పు పడింది దాన్ని మార్చండి” అని. ఆ అమ్మాయి ఆ పుస్తకాన్ని తీసుకుని,
కంప్యూటర్ లో డిటెయిల్స్ ఓపెన్ చేసింది. అమ్మయ్య ఇంకేముంది మార్చేస్తుందిలే అని అనుకుంటుండగా. “మీ పేరేంది?” అని అడిగింది. నేను ఎప్పటిలాగే “గి.రి.చం.ద్” అని విడివిడిగా చెప్పాను ముందు జాగ్రత్తగా. ఆమె నా మొహం లోకి చూసి “ఇందులో తప్పేముంది ’గిరీష్ చంద్ర’ అనే ఉంది.” అనేసింది కూల్ గా. నేను నవ్వి, “మేడమ్ నా పేరు గిరీష్ చంద్ర కాదు గిరి చంద్. అందులో ఇష్ లేదు మరియు చంద్ర కాదు ’చంద్’ .” అన్నాను. అప్పుడామె అన్న మాటలకి నా తల తిరిగి పోయింది. “సార్! ఇందులో తప్పేముంది. మీ పేరు ఇంగ్లీష్ లో గిరి చంద్, గుజరాతీలో గిరీష్ చంద్ర.  మేమేమన్నా ఇంగ్లీష్ లో వ్రాసేమా?ఇంగ్లీష్ లో గిరి చంద్ గుజరాతీలో గిరీష్ చంద్ర అవుతుంది. అంతే” అని ఫైల్ క్లోజ్ చేసి పుస్తకం నా చేతిలో పెట్టింది. నేను ఉక్రోషంతో అక్కడ “పేర్లని కూడా ట్రాన్స్ లేట్ చేసేస్తారా?” అని ఎంత అరచినా లాభం లేక పోయింది. వాళ్ళకి నచ్చజెప్పలేక అవమానంతో బాధపడుతున్న నన్ను   “ఒక్క ఇష్ పెట్టేరు మధ్యలో అంతే కదా, టెన్షనెందుకు?” అని నా స్నేహితుడు
నన్ను బయటకి తీసుకొచ్చేశాడు. ఆ తరువాత ఎప్పుడు ఇంటికి గ్యాస్ వచ్చినా,
బిల్ లో నా పేరు చూడాలంటే మనసొప్పేది కాదు. సరే ఏం చేస్తాం మన ఖర్మ అనుకుని దాన్నలా వదిలేశాను.

            ఈ మధ్యే ఇల్లు మారాల్సి వచ్చింది. ఒక్కడూ తెలిసిన వాడు లేడు. కనీసం ఇక్కడన్నా నా పేరుని ఒక్కరన్నా సరిగ్గా పిలసే ఒట్టు. పనోళ్ళు, పిల్లలు, వాళ్ళ తల్లులు తండ్రులు అందరూ అదే పేరు “గిరీష్ గిరీష్”. రోజూ పొద్దున్నే “గిరీష్ భాయ్! కేమ్ ఛో?” అని
పలకరిస్తారు పళ్ళు తోముకుంటా. “మజామా!!” అని బదులివ్వాల్సి వస్తూంది నాకు పళ్ళు నూరుకుంటా.  ఆఫీసుకు బయలుదేరేటప్పుడు మరీ దారుణం. ఇంటి పక్కనే ఓ పెద్దామె సంవత్సరం వయసు కూడా లేని తన మనవరాల్ని “అదుగో గిరీషంకులు ఆఫీసుకెళ్తున్నాడు టాటా చెప్పు.” అని టాటా చెప్పిస్తది. నేను కూడా మనసులో ఎంత బాధున్నా నవ్వతా టాటా చెప్పి వెళ్ళటం అలవాటు చేసుకున్నాను. చిన్నప్పుడు నేను ఏడస్తుంటే శబ్ధం వచ్చేది కాదు,
ఇప్పుడు నా ఏడుపుకి కళ్ళనీళ్ళు రావటం లేదు. ఇష్..

పి.ఎస్ :- ఈ మాటల్న్నీ రాత్రి రాసేనా! పొద్దున్నే న్యూస్ పేపర్ అతను వచ్చి బిల్లివ్వడానికి పేరడిగాడు. నేను గిరి చంద్ అని చెప్పాను. అతను గిరీష్ చంద్రా! అనేసి టకటకా బిల్ రాసి నా చేతిలో పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఆ బిల్లునే చూస్తూ నవ్వతా కూర్చుండిపోయాను కాసేపు. ఇష్…

Permalink 5 Comments

గొంగళి పురుగు…పారిజాతం.

March 16, 2009 at 2:07 PM (మనసులో మాట)

butterfly_-8276      మహా శివరాత్రి బద్దకంగా కళ్ళు తెరిచాను, నా మేని పై పూర్తి గా విప్పారిన పారిజాత పువ్వు . పైన  దాని చుట్టూ తిరుగుతూ మకరందం కోసం ఎగబడుతున్న రంగు రంగుల సీతాకోక చిలుకల సందడితో మరింత అహ్లాదకరముగా ఉంది. దాన్ని చూడగానే ఠక్కున పార్వతిదేవి గుర్తుకొచ్చింది. కానీ అప్పుడెప్పుడో కృష్ణుడు ఇచ్చిన ప్రచారపు దెబ్బ ఇప్పటికీ నన్నువదలలేదు. పూసిన ప్రతీసారీ ఇంద్రుడి రెకమండేషన్ అనో, బ్రహ్మ రెకమండేషన్ అనో నా ముచ్చట తీరకముందే కోసుకుని వెళ్ళిపోతారు. కాని ఈ సారి ఎవరికీ ఇవ్వదలుచుకోలేదు. తప్పకుండా ఆ పార్వతీ దేవికే పంపాలి, పైగా శివరాత్రి, సంతోషిస్తుంది. మనసులో అనుకున్నదే తడువుగా ఎదురుగా ప్రత్యక్షమయిపోయాడు ఆ దేవదేవుడు. ఆశ్చర్యంగా తన ముఖం నిండా చిరు చెమటలు పట్టి ఉన్నాయి, అందరికి చెమటలు పట్టించే మహాశివుడికి చెమటలు ఎవరు పట్టించి ఉంటారా అని ఆలోచిస్తూ, స్వామీ ఏమిటి ఆ చిరుచెమటలు అంటూ అరా తీసాను. ఆ ఏమిలేదు పారిజాతం, పార్వతి దేవి రాజకీయాల మీద పరిశోధన చేస్తూ , రౌడీయిజానికి , రాజకీయానికి సంబందం ఏమిటి దేవా! అని అడిగింది, మనకా రాజకీయాలు తెలియకపోయే, అందుకని మన దగ్గరే ఉన్న రాజకీయ ధురంధురుడు పీవీ గారిని అడిగితే తెలుస్తుందని ఇక్కడకు వస్తే ఆయన నవ్వి మూతి ముందుకు పెట్టుకుని నిన్ను కలవమన్నాడు, అయినా నువ్వేమి చెబుతావో నాకర్ధం కాలా, అంటూ నా వీపు మీద వున్నఓ గొంగళి పురుగు వంక కొద్దిగా అసహ్యంగా చూసి ఓ అడుగు వెనక్కి వేశాడు. అది చూసి స్వామీ! గొంగళి పురుగు అంటే మీకులాగే నాకూ అసహ్యమే, పేరుకి పెద్ద పారిజాతాన్నే అయినా, ఉండేది స్వర్గలోకం లో అయినా కొమ్మలు ,పూలూ, ఆకులు తప్ప చేతులులేని దాన్ని, దాన్నిఏలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతూవుంటా…కాని సరైన మార్గమే దొరుకదు. అది నా ఆకులను మెల్లమెల్లగా కొరికి తినేస్తువుంటే నేను ఏమి చేయలేక ఓ రోజు ఈవినింగ్ వాక్ కు వచ్చిన మన పీవీ గారికి నా సమస్య చెబితే ఆయన నవ్వి, కాలం తన పని తను చేసుకొని పోతుంది అని మీరు చెప్పినట్లే మూతి ముందుకి పెట్టుకుని జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు. కాని తరువాత కొన్నిరోజులకు నా కర్ధమైంది, నాడు ఆ మౌన మేధావి చెప్పింది నిజమే అని, నేను ఈ రోజు ఆనందంగా చూస్తున్నసీతాకోకచిలుకలే దానికి సాక్ష్యం. నాడు నన్ను బాధ పెట్టిన ఆ గొంగళి పురుగులే నేటి సీతాకోక చిలుకలని …..ఇంకా ఏదో చెప్పేలోపలే రౌడీ యిజానికి , రాజకీయానికి సంబంధం అర్ధమయిందోచ్…..థాంక్స్ పీవీ అంటూ ఒక్కసారిగా మాయమయ్యాడు ఆ దేవదేవుడు నే చెప్పేది పూర్తిగా వినకుండానే…

Permalink 2 Comments

Next page »