“తెలుగు తల్లి కి బ్రిటిష్ క్రౌన్”

cp_brown.jpg

తెలుగు నేల నుండి త్రవ్వి తీసిన  కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ “క్రౌన్” లో పెట్టుకున్నారని చింతిస్తున్నారా? వద్దు. అంతకన్నా ఎన్నో రెట్లు విలువైన ఓ రత్నాన్ని మన తెలుగు తల్లికి కిరీటం గా వదిగి పొమ్మని, అదే అంగ్లేయులు మనకి బహుమతి గా పంపించారు. ఆ రత్నమే “బ్రౌన్”
      
   కోహినూరు మనకి దొరికితే మహా అయితే అమ్ముకుని కోటీశ్వరులమైపోతామేమో. కాని ఆయన తెలుగు భాషకు చేసిన సేవల ముందు  అది గోకరకాణి కి కూడ పనికి రాదు.

   ఏ దేవుడు పంపాడో గాని, తెలుగు భాషకి ఆయన చేసిన సేవ అద్వితీయం. దాన్ని నేర్చుకోవటమే కాక, అందులో పూర్తిగా లీనమయి పోయి మనవాళ్ళు అంతగా పట్టించుకోని అనేక తాళపత్ర గ్రంధాలను, వేమన పద్యాలను కోకొల్లలు గా సేకరించి తెలుగు భాషకు అస్థిత్వాన్ని ఏర్పరిచాడు. లేకుంటే మనకి “ఉప్పు కప్పురంబు…” కూడా మిగిలి ఉండేది కాదు.
  
   ఆయన చేపట్టిన బృహత్తర కార్యక్రమాల్లో అత్యుత్తమమైనది తెలుగు నిఘంటువు(తెలుగు – ఇంగ్లీషు)   ని తయారు చేయటం. దాన్ని ఒకసారి తిరగేసామంటే చాలు, సి.పి.బ్రౌన్ తో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. ఈ బ్రుహద్గ్రంధాన్ని తయారు చేయటానికి ఆయన ఎంత తపించి వుంటాడో కదా! వైష్ణవుల శైవుల మధ్య జరిగిన కలహాల్లో ఎన్నో అమూల్యమైన గ్రంధాలు పంచభూతాల్లో కలిసిపోయాయని వాపోయిన బ్రౌన్ ఈ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువులో ప్రతి పుటనీ ఒక కావ్యం గా మలిచాడు. కళ్ళు మూసుకుని ఏ పుటనైనా తీసి అందులోకి తరచి చూస్తే చాలు, అందులో నుండి అంతులేని తెలుగు సంపదని మూట కట్టుకోవచ్చు.   

   కొన్ని పదాలని మనం రోజూ ఉపయోగిస్తూనే ఉంటాం, కాని అందులో ఉన్న నిగూఢార్ధాన్ని గురించి సాధారణంగా ఆలోచించం. ఉదాహరణకి “అల్లుడు” అంటే “one who weave” అనగా “రెండు కుటుంబాలని కలిపినవాడని” అర్ధం అట. “చెయ్యి” అనే పదం “చేయు” నుండి పుట్టిందట. అలాగే “కుడిచెయ్యి” అనేది “కూడు తినే చెయ్యి” నుండి పుట్టిందంట.

    పక్షి విశేషము, క్రీడా విశేషము అని అర్ధం చెప్పి వదిలేయక, వీలయినన్ని ఉదాహరణల్ని ఇచ్చి ఆ పద భావాన్ని అన్ని కోణాల నుండి స్పృశించటం అపూర్వం. ఉదా|| “తెల్ల” (white) అనే పదాన్ని వివరించటానికి అరపుట తీసుకున్నాడు. అలాగే “చాలు” అనే పదానికి కూడా. ఈ వివరణల్లోనే తాండవం చేస్తుంది తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంప్రదాయం.

   మనం “కలుక్కుమంది” అని వ్రాస్తాం. కాని ఇందులో “కళుక్కుమంది” అని వుంది. మనం ఇంతవరకు వినని, ఉపయోగించని తెలుగు పదాలు కొల్లలు గా కనిపిస్తాయి. వీటన్నింటినీ చదువుతూ ఉంటె..ఇవే కదా మన ముత్తాత తాతల పెదాలపై తారట్లాడిన పదాలు అని అనిపించక మానదు.  
   “కసమస” అంటే తొట్రుపాటు, “కస్తి” అంటే దుఖం అంట.
కవలు అనే పదానికి అర్ధం చెబుతూ..
 గీ|| “పాటమొనరించుతరి దోడపడు గురునకు
        గవలుపోకుండబుత్రోడో కలువకంటి.” అని ఉదా|| ఇచ్చాడు. ఇందులో ఎన్ని పదాలు వాడుకలో ఉన్నాయి?
 
    ఇక వివరణల్లో ఈయన పొందుపరిచిన పద్యాలు అసంఖ్యాకంగా కనిపిస్తాయి. ”

క|| పుడమిన పప్రధయగునెడ
       బడతికిదేహంబు విడువబాడియకాదే,
    నుడికంటె జాపుమేలను
       నుడువు పురాతనముకాక నూతనపదమే.”

    కొత్తగా బిడ్డపుడితే, పేర్ల కోసం ఇంటర్నెట్ లోనో, మేనకాగాంధి పొందుపరచిన పిల్లల పేర్ల పుస్తకం లోనో వెతకనఖర్లేదు. బ్రౌన్ నిఘంటువుని బయటకు తీసి (ఉంటే) దుమ్ము దులిపి పుటలు తిప్పి చూడండి. ప్రతి పుటలోనూ అందమైన, ఇంపైన పేర్లు ఎన్నో కనిపిస్తాయి. (నేను కనీసం వేయి పేర్లన్నా ఇందులోనుండి సేకరించాను, ఇంకా ఎన్నో వేల పేర్లు ఉన్నాయి.).

   పార్వతీ దేవికి “శక్తి, అంబిక, అగజాత, దుర్వ, దేవి, దాక్షాయణి, భువనేశ్వరి, భవాని, భార్గవి, సతి, గిరికన్య, గిరిజ, గౌరి, కాత్యాయని, కాళి, మేనక, మాత ….” ఇన్ని పేర్లున్నాయి. ఇవన్నీ అక్కడక్కడా కనిపించినవి మాత్రమే!

   పంచబాణుడు (మన్మధుడు)కి వున్న ఐదు బణాలు.
1.అరవిందము  – Lotus – ద్రావిణి.
2.అశోకము     – Jenesia Asoka- శోషిణి.
3.చూతము     – Mango Blossom- బంధిని.
4.వనమల్లిక     – Jasmin Arabian- మోహిని.
5.నీలోత్పలము -Blue Lotus- ఉన్మాదిని.
(వీటితో కొడితే ఎవరు మాత్రం పడిపోరు?)

   ఇలా వ్రాసుకుంటూ పోతే ఎన్నో…. తాపత్రయం, పంచమాతులు, షడ్గుణములు, షట్కర్మలు, షడ్విద్యలు, సప్తసముద్రాలు, పంచ లోహాలు, 9 రకాల బ్రహ్మలు, 14 మంది మనువులు, షడ్రుచులు…అన్నింటిని సోదాహరణంగా ఇందులో వివరించాడు.

   చరిత్రకు సంబంధించి కూడా ఎంతో విలువైన సమాచారం ఇందులో దొరుకుతుంది. ఆనాటి “గాంధార” దేశమే ఈనాటి “కందహార్” అట.

  ఆంగ్లేయుడై ఉండి తనది కాని మన తెలుగు భాష కి ఇంత సేవ చేసిన సి.పి.బ్రౌన్ గురించి గౌ|| శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు తన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఈవిధంగా వ్రాసారు “….ఖుతుబ్షాలు, అసఫ్జాలు అందరినీ ఒక్క ప్రక్క పెట్టి బ్రౌను దొర నొక్కదిక్కు పెట్టి తూచిన బ్రౌను దిక్కే త్రాసు ముల్లు సూపును. అతడు తాటాకు గ్రంధాలు సేకరించియుంచెను. వేమన పద్యాలను మెచ్చుకొని వాటిని ఇంగ్లీషులోని కనువదించెను. తెలుగు నిఘంటువులు రెండు రచించెను. అందొకటి వ్యావహారిక పదకోశము. నాటికిని ఇవి చాలా యుపయోగపడుచున్నవి….”     
  ఈ పుస్తకం మీద పి.హెచ్.డి చేయవచ్చో లేదో నాకు తెలీదు కాని, అది చేయటానికి కావల్సిన సరుకు మాత్రం ఇందులో పుష్కలంగా వుంది.తెలుగు పిచ్చి ఉన్నా లేకున్నా, మన భాషా సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించాలనుకునే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండి తీరవలసిన పుస్తకం ఇది. అంతులేని తెలుగు భాషా సంపత్తి నిగూఢమై ఉన్న దీన్ని నిఘంటువు కన్నా కావ్యం అనటమే భావ్యం.
 
ఇంతకీ “గోకరకాణి” అంటే ఎంతో తెలుసా? (సమాధానం కావాలంటే నిఘంటువు తిరగేయండి.బ్రౌన్ నిఘంటువు లేనివారికోసం మాత్రమే వ్రాస్తున్నాను fraction of 1/4096  ) 
 

Advertisements
  • vinu
  • August 29th, 2007

  beautiful

 1. నిజమే…చూడగా కోహినూరు అనునది ఓట్టి రాయి మాత్రమే…కానీ బ్రౌను మనకు బధ్రపరచి అందించిన పుస్తకాల విలువ……………కట్టగలమా!!!!!!!!!!!

  • Chandu
  • May 10th, 2008

  బహు చక్కగా చెప్పారు, కోహినూరు కన్నా ఎంతొ విలువైన సంపదను మన తెకుగు వారికీ అందించిన బ్రౌను నిజంగా క్రౌనే…
  ఇప్పటి వరకు ఆ నిఘంటువు గురించి వినటమే గాని చదవటం కుదరలేదు, చదివే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను

 2. chandu గారు! థ్యాంక్యు.. బ్రౌన్ నిఘంటువు ప్రతి ఒక్క తెలుగువాడూ దగ్గర ఉంచుకోవలసిన సంపద. ఇది (తెలుగు – ఇంగ్లీష్) కేవలం Rs.100 – 150 మధ్యలో ఉంటుంది. వీలైతే తప్పక కొనుక్కోండి, అన్ని పుస్తకాల షాపులలో దొరుకుతుంది.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: