గణిత బ్రహ్మ డా.లక్కోజు సంజీవరాయశర్మ తో …”నేను”

sars.jpg

నేను ఈ మధ్య గణిత బ్రహ్మ డా.లక్కోజు సంజీవరాయశర్మ గురించి నా తెలుగు రాతలు!లో ఓ మంచి వ్యాసం చదివాను.చాలా వివరాలు అందించారు.నిజంగా వారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే.ప్రతి కృష్ణాష్టమి రోజు వీరు నాకు విధిగా గుర్తుకొస్తారు . అది తెలియాలంటే  నేను వారితో 1993 లో చేసిన రైలు ప్రయాణం గురించి వివరిస్తే ఈ   కృష్ణా అష్టమి రోజున ఆ మహానుభావుడిని స్మరించుకున్నట్లూ ఉంటుందీ,ఆ నా మరచిపోలేని అనుభవం మీ అందరితో  పంచుకున్నట్లూ ఉంటుందనే సదుద్దేశంతో ఈ టపా.
     “దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని వీరిని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేదావి ఇల్లు కదలలేకపోయారు”.  అన్న  “నా తెలుగు రాతలు” వారి వాక్యాలతోనే నా ఈ టపా మొదలుపెట్టాలనిపిస్తోంది.ఎందుకంటే నిజానికి వారు ఆ రోజు తన మనవడిని తోడుగా తీసుకుని హైదరాబాదు వచ్చారు .అక్కడ తానా నిర్వాహకులు వీసా రాలేదని చేతులెత్తేయడంతో తన సొంత ఖర్చులతో తిరుగు ప్రయాణమయ్యారు శ్రీ కాళహస్తికి.ఆదీ విజయవాడ వరకు ఓ ట్రైను లో అక్కడనుండి ఓ పాసింజరు రైలులో.

ఇక విషయానికొస్తే 
ఆ రోజు నాకు వీక్లీ హాఫ్ కావటం మూలాన కావలి లో ఉన్నాను. అదే రోజు రాత్రి కావలినుంచి నెక్స్ట్ డే డూటీకి గూడూరు పోవాలి కాబట్టి  కాకినాడ-తిరుపతి  పాస్సింజరు సుమారు అర్దరాత్రి టైము లో కావలిలో ఎక్కాను.యధావిధిగా బాగా రష్ గా ఉంది.కూర్చోవటానికికూడా సీటు లేదు.అలా నిలబడే బిట్రగుంట దాకా ప్రయాణం సాగింది.బిట్రగుంటలో ఎవరో మహానుభావుడు  దిగి పోవటంతో పై బెర్తు ని ఆక్రమించి చిన్నగా సర్దుకున్నాను.అలా మరో పదినిమిషాలు ప్రయాణించిన పిదప అలా లోపల కూర్చున్నవారి మీదకి యధాలాపంగా  దృష్టి సారిస్తే అక్కడ మొదటి ఎంట్రన్సు దగ్గరే కిటికీ పక్కనే ఉన్న రెండు సీట్లలో ఒకదానిలో నల్ల కళ్ళజోడు పెట్టుకుని క్రింద ఓ గుడ్డసంచీతో పక్కనే కిటికీ కి ఆనించివున్న చేతికర్రతో ఆ అపరగణిత  బ్రహ్మ ఓ సాధారణ ప్రయాణికుడిగా పాసింజరులో నిద్రలేకుండా,ఓ సింగిలు సీటులో తనకు జరిగిన సన్మానలూ,సత్కార్యాలూ అన్నీ మర్చిపోయి నిద్ర పోలేక   తూగుతూ..ఉన్నారు .ముందు మామూలుగా తల తిప్పేసుకున్న నాకు వీరిని ఎక్కడో చూసినట్లుందే అనుకుంటూ బాగా పరికించి చూసాను.ఆంతకు ముందెప్పుడూ వీరిని నేను డైరెక్టుగా  ఎక్కడా చూడలేదు.పత్రికలలో తప్ప.కొద్ది నెలల క్రితమే ఆంద్ర జ్యోతిలో వీరి గురించి వ్రాసిన పరిశోధనావ్యాసం లో ఫొటో గుర్తు కి రావడంతో వీరు ఎవరో అర్ధమైయింది. వీరు వారేనని అని నాకు నేను నిర్ధారించుకున్న తరువాత నిజంగా భావోద్యోగానికి లోనయ్యాను. నిదానంగా దిగి వారి దగ్గరకి నడిచాను ఉత్కంఠంగా…చిన్నగా తూగుతున్నారు. ఎదురు సీటులో తన మనవడు మేలుకొనే వున్నాడు. మళ్ళీ ఓ సారి మనవడి ద్వార ఆయన శర్మా గారేనని నిర్ధారించుకున్నాను.మాట్లాడవచ్చా? అని అడిగాను ఏమి మట్లాడాలో తెలియకపోయినా. అవకాశం  వదులుకోదలుచుకోలేదు మరి. ఒక్క సారి నావంక చూచి తన తాతయ్యని  లేపి తన సీటు నాకిచ్చి తను కొద్ది సేపు పక్కనే నిలబడ్డాడు.రెండు సార్లు చెప్పిన తరువాత చేతులతో తడుముకుంటూనే  కూర్చోమన్నారు . మనసుపూర్తిగా రెండుచేతులూ  జోడించి నమస్కారంపెట్టి జంకుతూనే కూర్చున్నాను ఎదురుగా. మామూలుగా  నాగురించి చెప్పిన తరువాత అడిగాను ఎక్కడనుండి వస్తున్నారని.చెప్పారు వీసా సమస్య గురించీ,తానా టీము వారు చివరి నిమిషములో తనని రైల్వే స్టేషనులో వదిలేసిపోవడమూ ,తిరుగు ప్రయణానికి రిజర్వేషను లేక ఇలా రైళ్ళు పట్టుకోని  రావటమూ తో పాటూ తన బాధలూ, తనకు జరిగిన సత్కార్యాలూ, నెహ్రూ గారు ఇచ్చిన బంగారు పతకం గురించి ,దాన్ని కూడా చివరకు  దొంగలు ఎత్తుకొని పోవటం   గురించి అన్నీ చెప్పి, చివరకి   అడిగారు నాగురించి నీకు ఎలా తెలుసూ అని..చెప్పాను  ఆంధ్రజ్యోతి లో చదివాను అని. సంతోషించి  ఉత్సాహంగా ఏదన్నా లెక్క వేయ్, అన్నారు . అప్పటిదాకా నాకు పట్టిన తిమ్మిరి కాస్తా వదిలేసింది ఆమాటవినగానే.ముందే అజ్ఞానులం. దానికి తోడు సరస్వతీ దేవిదగ్గర పరీక్షలూ..ఏమి చేయాలో అర్ధం కాక   మొహమాటపడిపోయాను.వదల్లేదు ఏదోకటి అడగమన్నారు ..అలా మొహమాటపడుతూనే ఆలోచించసాగాను ఏమి అడుగుదామా అని.చివరకు ఏప్పుడో మాస్కొ బుక్కు Fun with maths and physics  లో లెక్క సమయానికి గుర్తుకొచ్చింది. పోయిన ప్రాణం తిరిగివచ్చినట్లుగా అడిగాను ఆ లెక్కని .”నాకు ఓ ఏడుగురు స్నేహితులున్నారు.వారిలో మొదటి స్నేహితుడు ప్రతి రోజూ నా దగ్గరకు వస్తాడు. రెండో వాడు ప్రతీ రెండురోజులకు ఓసారి వస్తాడు.మూడో వాడు ప్రతీ మూడురోజులకోసారి వస్తాడు………ఈ విధంగానే నాలుగోవాడు నాలుగు రోజులకూ,ఐదవ వాడు ప్రతీ ఐదు రోజులకూ ……….ఆరో వాడూ,ఏడోవాడు ప్రతీ ఆరు ,ఏడూ  రోజులకూ ఓ సారి నా దగ్గరకు వస్తారు.ఈ విధంగా వస్తూ ఉంటే వారందరూ కలసి ఎన్ని రోజులకు నాదగ్గరికి వస్తారు?” అడిగి ఊపిరి పీల్చుకున్నాను అమ్మయ్యా బాగానే అడిగానని! అలా కొద్ది సెకనులు వేళ్ళమీదే లెక్కేసి సరి జవాబు చెప్పి ఏముందీ LCM కట్టడమేగదా..అంటూ నవ్వారు …ఫుట్టు గుడ్డి  .అయినా.మేధావి. ఆ సరస్వతీ దేవికి వందనాలు.
నేనొక లెక్క వేస్తాను చెబుతావా? మరో బాంబు  పేల్చారు .ట్రైను వెగంగా పోతుందీ, దూకలేనుగా…..సరే అన్నాను. లెక్క సరిగా గుర్తు లేదు…కాని ఆయన అడిగింది కొన్ని తమలపాకులూ, వక్కలూ అణాలకు, సంభందించినవి..ఇక నేను ఏమి జవాబు చెప్పివుంటానో బహిరంగ రహస్యమే.నా పరాజయాన్ని పట్టించుకోకుండా నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు, వారం తిధి చెబుతా అన్నారు .చెప్పాను Sep04 అని. మామూలే, వేళ్ళతో  లెక్కలు అదీ కొద్ది సెకనులే. వెంటనే చెప్పారు .ఆ రోజు గురువారం తెల్లరితే కృష్ణా అష్టమి అని. Human Computer గా పేరున్న శకుంతలాదేవిచే తనకంటే మేధావని కొనియాడబడిన ఆ ఆపర గణిత మేధావి తో కొద్ది దూరం కల్సి ప్రయాణం చేయడం ,ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తితో  మాటలాడటం,హనుమంతుని ముందు కుప్పిగెంతులేయటం,తన నోటినుంచి నా పుట్టిన రోజు తిధి ,వారాలు వినడం నిజంగా నేను  మరచిపోలేను.

మీ అందరితో ఈ విధంగా  నా అనందాన్ని పంచుకోవటం   ఇంకా ఆనందముగావుంది.   

ఇతర వివరముల కొరకు:

http://andhraguyz.com/Andhra_Pradesh/p2_articleid/864

                                                                                                                                                                                                                                    

Advertisements
 1. ఇంత మంచి విషయాన్ని మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు!

 2. ఎంత అదృష్తవంతులండీ!అలాంటి మహానుభావునితో కొద్ది గంటలైనా గడపగలిగిన మీరూ ధన్యులే;మీ అనుభవాన్ని పంచుకున్న మేమూ ధన్యులమే.

  భాను

 3. చాలా బావుందండీ, మీ అనుభవం.. ముందుముందు ఇంకా ఇలాంటివి మాతో పంచుకుంటారని ఆశిస్తూ..

 4. ఇంత మంచి విషయాన్ని మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు!

  మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

  • Phani
  • September 5th, 2007

  అనుభవం బాగుంది. కానీ అంత గొప్పవ్యక్తిని ‘చెప్పాడు’ అని ఏకవచనంలో సంబోధించటం బాగాలేదు.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • September 5th, 2007

  క్షమించాలి.ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు..సరి చేయడమైనది .తెలియచేసినందుకు కృతజ్ఞతలు.

  • కొత్త రవికిరణ్
  • September 5th, 2007

  ఈ దేశంలో మేధావిగా పుట్టిన వాడు కొమ్ములు మొలిచినా మొలవకపోయినా, రెక్కలు మొలవడానికి కృషి చేయాలి. ఎవణ్ణో ఒకణ్ణి పట్టుకుని ఎగిరిపోవాలి, విద్య సార్ధకమయ్యే చోటికి, కనీసం నోట్లోకి అయిదు వేళ్ళూ పోయే చోటికి.

  అంతటి మేధావి చిరునామా, ఇతర వివరాలు తీసుకోలేదా మిత్రమా.. ఇనాళ్ళూ నాతో కూడా ఎప్పుడూ ఈ అనుభవం పంచుకోలేదేం..?

  కొత్త రవికిరణ్

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • September 5th, 2007

  విజిటింగ్ కార్డు కూడా తీసుకున్నాను బాసూ…..సంధర్భము రాలేదు.అందువల్లే చెప్పి వుండకపోవచ్చు.

 5. A wnderful experience made beautiful by your narration.

  I liked Mr. Ravikiran’s comment too ..

 6. మీ అంత అదృష్టం మాకు లేక పోయింది. ప్చ్.
  కానీ ఇప్పుడూ బతికివున్న మహామహులు ఎందరో వుండే వుంటారు. కనీసం ఇది గుణపాఠంగా నైనా ఏ వూరికి వెళ్ళినా అక్కడి దర్షనీయ స్థలాలను మాత్రమే చూసిరాకుండా దర్షనీయ వ్యక్తులనూ చూసివస్తే బాగుంటుంది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • September 7th, 2007

  ఆ మహానుభావుడి గురించి మహోన్నతంగా స్పందించిన బ్లాగులోకానికి కృతజ్ఞతలతో……కాని నిజంగా నా దురదృష్టమేమిటంటే netలో ఎంత వెదికినా ఆ మేధావి ఫొటో లభించకపోవటం.

 7. అంతటి మహానుభావుడిని అవమానించిన వాళ్లకి పుట్టగతులు లేకుండా పోవాలని శపిస్తున్నాను. వాళ్ళ వంశంలోనే గణితం అన్నది శూన్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన చిరునామా తెలిపితే వారు ఆర్థికి సహాయం స్వీకరిస్తారేమొ తెలుసుకుని, ఎంతో కొంత సహాయం చేయాలని ఉంది. చిరునామా ఇస్తారా దయచేసి! మీకు వేల వేల థాంక్సులు!

 8. క్షమించాలి, మీరు ఇచ్చిన లింక్ ఇందాక పని చేయలేదు. వారు మరణించారని తెలుసుకున్నాను ఇప్పుడే!

 9. బాగుందని ఎలా అనగలను. మీరిచ్చిన లింకు చదివి వస్తున్నాను. మనసు బరువెక్కింది.
  అంతే. అంతకు మించేమీ లేదు.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: