మనసు దోచుకున్న తెలుగు కీచకుడు

(కీచక వేషధారి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు మరియు విరాటరాజు పాత్రధారి)

వసంత కాలం ఆరంభమైందంటే చాలు, కళలు పురివిప్పి నాట్యం చేస్తాయి అహ్మదాబాద్ లో. దక్షిణ భారతదేశం లో పుట్టి జగమంతా వ్యాప్తి చెందిన భరతనాట్యానికి గుజరాత్ లో జీవం పోసింది గురు శ్రీమతి ఇలాక్షి బెన్ ఠాకోర్. “నృత్యభారతి” సంస్థని 1960 లో స్థాపించి భరతనాట్యానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి కొన్ని వందలమంది నృత్యకారుల్ని తయారుచేసింది . కళ కే అంకితమైన ఈ సంస్థను ఇప్పుడు పాత కొత్తల మేలి కలయికలతో, అనేక కొత్త నృత్యరీతులు కనుగొని సరికొత్త కోణాలను ఆవిష్కరించిన ఆమె కుమారుడు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ మరియు నృత్యకారుడు శ్రీ చందన్ ఠాకూర్ సమర్ధవంతంగా నడిపిస్తున్నారు.

(గురు శ్రీ చందన్ ఠాకోర్)

ప్రతి సంవత్సరం వసంత కాలారంభంలో మూడు రోజులపాటు కనులవిందుగా జరిగే ఈ నృత్య కార్యక్రమాలకు మన దేశంలోని ఇతర నృత్యకారుల్ని సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా ఈ సారి చెన్నై నుండి చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అధినేత శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ మరియు ఆమె శిష్యురాళ్ళు, ఒరిస్సా , నృత్యాయన్ నుండి శ్రీ దుర్గా చరణ్ రణబీర్ మరియు వారి విద్యార్ధులు…..ఇక ఆడిటోరియం ని దద్దరిల్లజేసి, అందరి చేత ఔరా! అనిపించుకున్న శ్రీ బాల త్రిపుర సుందర కూచిపూడి నాట్య కళాక్షేత్రం, విజయవాడ నుండి గురు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ మరియు వారి తోటి నృత్యకారులు. మీడియా కూడా వీరిగురించి అద్భుతంగా వ్రాసింది. అహ్మదాబాద్ లో ఇలాంటి కార్యక్రమాలు రాత్రి భోజన సమయం దాటిన తరువాత మొదలవుతాయి. ఠాగూర్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమం లో మొదటి రోజు 20-2-08 శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ గారి శిష్యురాళ్ళు అసలు క్లాసికల్ డాన్స్ అంటే ఏమిటో అందరికీ రుచి చూపించారు. ముఖ్యంగా శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ గారు గంగానది థీమ్ మీద కొరియోగ్రఫీ చేసిన “ప్రవాహాంజలి” చెప్పుకోదగ్గది. గంగానది ఒక్కోదగ్గర ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మరోదగ్గర రౌద్ర రూపం కలిగి ఉంటుంది..ఇలా ఎన్నో రూపాలు. కాని గంగ “The river of wisdom , neither forgetting the roots nor the destination.” ఈ భావంతో సాగిన భరతనాట్యం ఆద్యంతమూ అద్భుతంగా జరిగింది.”అబ్బా భలే చేసారు వీళ్ళు.”, “ఎంతైనా భరతనాట్యం చూడాలంటే సౌత్ ఇండియన్స్ చేస్తేనే చూడాలి.” అనే కామెంట్స్ వినిపించాయి రాత్రి 11 గంటలప్పుడు కార్యక్రమం ముగిసిన తరువాత. “రేపు రాత్రి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారి ట్రూప్ చే కూచిపూడి నృత్యరూపకం.” అని అనౌన్స్ చేసారు ముగింపులో .

(అద్బుత భంగిమలో ఉన్న ఈ నర్తకి వయస్సు 14 సంవత్సరాలు!!)

ఇక ఆ పక్క రోజు ఏం జరిగిందో చెప్పటానికి మాటలు చాలవు. రాత్రి 9 గంటలకు శంఖారావం తో మొదలుపెట్టి “కీచక వధ” కూచిపూడి నృత్యరూపకం, రెండు గంటలు నడుస్తుంది అని అనౌన్స్ చేసినప్పుడు. ఎరక్కపోయి వచ్చామురా! అన్నట్టు గుసగుస లాడుకున్నారు ఆడియన్స్. కూచిపూడి అంటే ఏదో భరతనాట్యం టైప్ లోనే ఏ పళ్ళెంలోనో..దీపాలు పట్టుకునో డాన్స్ ఉంటుందనే అనుకున్నారు చాలామంది. విరాట రాజు కొలువు కి భీముడు(నిజంగా భీముడు లాగే ఉన్నారాయన ఎవరోగాని) వచ్చి తన గురించి పరిచయం చేసుకునే సమయంలో ఆయన చేసిన నృత్యం చూసి ప్రేక్షకులు నోళ్ళు తెరిచారు. ధర్మరాజు, నృత్యమంటే ఇలా ఉండాలి అన్నట్లు గా చేసిన అర్జున పాత్రధారి, ద్రౌపది, గాంధారి, విరాటరాజు, సంగీత కళాకారులు…ఇలా అందరూ న్యాయం చేసి కూచిపూడి పేరు నిలబెట్టారు. ఇక కీచకుడి గురించి ఎంత పొగిడినా తక్కువే…ఆ హావభావాలు, అలవోకగా చేసే నృత్యం, బాడీ లాంగ్వేజ్, అభినయం. దానికి తోడు వీరందరికీ ఎవరి తత్వానికి తగ్గట్లుగా వారికి గాత్రం అందించిన గాయకుడు. నటనలో, నాట్యం లో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, కాని దాదాపు వేయి మంది ప్రేక్షకులు మూడు గంటలు ఊపిరి బిగపట్టుకుని చూసారంటే మాత్రం దానికి కారణం కీచక వేషధారి గౌరవనీయులు శర్మ గారే. సభలో పాండవులని మొదటి సారి చూసినప్పుడు వీరు తమ హావభావాలతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు. అద్భుతమైన టాలెంటు తో వీరు చేసిన నృత్యవిన్యాసాలు అందరినీ ఆశ్చర్యానందాలతో ముంచెత్తాయి. నృత్యరూపకం పూర్తయినవెంటనే ప్రేక్షకులందరూ లేచి నిలుచుని హాలుని చప్పట్లతో మారుమ్రోగించారు. ఇలా నుంచుని గౌరవించటం నేనిక్కడ చూడటం ఇదే మొదటిసారి. తరువాత శ్రీ శర్మ గారు ” I am poor … in english…” అని మొదలుపెట్టి “I would like to tell you about my feelings..but.. due to language problem..I am unable to express..my thoughts.” అని వినమ్రంగా అనటంతో సభ మళ్ళీ హర్షాతిరేకంతో నిండి పోయింది. స్టేజ్ ని గడ గడ లాడించిన కీచకుడితడేనా అనిపించేంత సాధారణం గా మారిపోయింది శ్రీ శర్మ గారి శరీర భాష. వీరు వెంటనే అహ్మదాబాదు విడిచి వెళ్ళిపోయినా…మూడవరోజు రాత్రి జరిగింది వీరికి అసలు సత్కారం. ఆ రోజు రాత్రి కార్యక్రమాలను మొదలుపెడుతూ యాంకర్ ఇలా అంది “ఈ స్టేజ్ ఇప్పుడు ఖాళీగా ఉన్నా…ఇంకా కీచకుడు తిరుగుతున్నట్లుగానే ఉంది కదా మీ అందరికీ?” అంతే ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది మరోసారి.

గురువు గారు! మీకు పాదాభివందనాలు.

 1. మీరు నాట్యకళా పోషకులు గూడానన్న మాట. భేష్!
  పుట్టినరోజు శుభాకాంక్షలు!

  • చిలకపాటి శివరామ ప్రసాద్
  • March 12th, 2008

  గిరిచంద్ గారూ

  ఇంతటి ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా అదీ మీ పుట్టిన రోజున వివరించటం, మన తెలుగు వారికి అహ్మదాబాద్ లొ జరిగిన గుర్తింపు మేము చూడటం ఎంతో సంతోషాన్ని కలుగచేసింది.

  ఒక రోజు ఆలస్యంగానైనా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియమేసుకుంటున్నాను

  మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలని, ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారొగ్య ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, కీర్తి ప్రతిష్టలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ. . .

  చిలకపాటి శివరామ ప్రసాద్

 2. చాలా ఉత్తేజ పరచే సంగతిని అంతే ఉత్తేజకరంగా రాసారు. “మూడవరోజు రాత్రి జరిగింది వీరికి అసలు సత్కారం…” – ఆనంద బాష్పాలు తెప్పించింది. మామూలుగా మనాళ్ళ గొప్పదనం మనకు నచ్చుతుంది. బయటివాళ్ళు దాన్ని గుర్తించినపుడు మరీను.

  నువ్వుశెట్టి సోదరులారా, గుజరాతీయులు నాకెందుకు నచ్చుతారంటే ఇప్పుడిదిగో ఇందుక్కూడా! నెనరులు.

 3. కళ్లక్కట్టినట్టు రాశారు. నివేదిక చదువుతూంటేనే యిలా వుంటే చూస్తే ఇంకెంత గొప్పగా వుంటుందో కదా అనిపించింది. ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు.

  • tiyyanitenugu
  • March 14th, 2008

  అయ్యా…కీచకుల వారి పేరు పసుమర్తి వేంకటేశ్వర శర్మ అయ్యుంటుంది..

  తమరు దాన్ని ఖూనీ చేసి ‘పశుమర్తి ‘ అన్నారు….

  గమనించగలందులకు ప్రార్ధన…

  యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

 4. యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ గారు క్షమించండి. నాకు దొరికిన ఇంగ్లీష్ బ్రోచర్ నుండి తెనుగించాను. ఆ మహానుభావుడి పేరుని ఖూనీ చేయాలన్న ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదు. ఇప్పుడు మారుద్దామంటే మీరు కూడా పసుమర్తి అయ్యుంటుంది ..అని అన్నారే కాని, పసుమర్తే అని చెప్పలేదు. ఎవరైనా సరిగ్గా చెబితే మారుస్తాను.

 5. కొత్తపాళీ గారు ధన్యవాదాలు. నాట్యకళ అంటే, ముఖ్యంగా సంప్రదాయ నృత్యమంటే పడి చచ్చే వాళ్ళలో నేనూ ఒకడిని.

  రానారె గారు, నేననుభవించినదానిలో కేవలం కొంత శాతం మాత్రమే వ్రాయగలిగాను నిజంగా. దీనిగురించి నాకెలా వ్రాయాలో తెలీలేదు.

  చదువరి గారు! నిజంగానే కళ్ళు చెమర్చాయి ఆ మూడో రోజు…నేను తెలుగు వాడిని కావటం వల్లనో లేక ప్రేక్షకులు రెస్పాండ్ అయిన తీరుకో తెలీదు. నేను వ్రాయలేక పోయినది మీరు వ్రాసారు. ధన్యవాదాలు.

  చిలకపాటి శివరామ ప్రసాద్, ధన్యవాదాలు. తెలుగు వారి విజయవిహారం కళ్ళారా చూడటం, దాన్నిమీకు అందజేయటం నాకూ చాలా ఆనందంగా ఉంది.

  • tiyyanitenugu
  • March 14th, 2008

  నువ్వుశెట్టి సోదరులకు ప్రణామములు..

  అంతచిన్నదానికి క్షమాపణలెందుకండి..

  ఆ మాటకోస్తే మీరే నన్ను క్షమించాలి..పంతులుకుండే బి.పి.ఎక్కువైనదేమో..తొందరపడి ఖూనీ అన్న పదం వాడాను..

  ఇహపోతే మా అమ్మ వాళ్ళ యింటి పేరు(పెళ్ళికాకమునుపు)..పసుమర్తి.

  వైశ్యుల్లో కూడా నాకు తెలిసిన పసుమర్తి వాళ్ళు చాలామంది వున్నారు..ఖమ్మంలో..

  కనుక తమరు చక్కగా ‘పసుమర్తి ‘అని మార్చొచ్చు.

  చక్కటి వ్యాసాన్ని అందించినందుకు.. ఆలస్యంగానైనా అభినందనలు.

  అన్నట్టు .. http://yvs-yvs.blogspot.com లో నేను రాసిన చిన్న గీతాన్ని ప్రచురించాను.

  మీ అభిప్రాయాన్ని కోరుతున్నాను…

  -హితైషి
  యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

 6. గిరిచంద్ గారు మాకు సినిమా చూపించారు
  అహ్మదాబాద్ కు టికెట్ ఖర్చు తగ్గించారు
  చాలా కృతఙ్ఞతలు

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: