గుష్ రాత్ లో “ఇష్” కథ

girichand 

 చిన్నప్పుడు నేను ఏడుస్తుంటే శబ్దం వచ్చేది కాదంట. కన్ను ముక్కు తీరు బాగున్నా మూగోడు పుట్టేడనుకుని బాధపడ్డారంట. కొన్ని నెలల తరువాత ఎప్పుడో గుక్క పెట్టి ఏడస్తా ఉంటే కాస్త నా గొంతు బయట పడిందంట. ఇంత కష్టపడి తెచ్చుకున్న నా మాటని ఈనాడు పట్టించుకునేవాడే లేడు ఈ గుజరాత్ లో. నా పేరు ’గిరి చంద్’ అని ఎందుకు పెట్టేరో ఇప్పుడెందుకు గాని, గిరి చంద్ అంటే అర్ధమేందిరా? అంటే మాత్రం పైన ఫోటో చూపిస్తా అందరికీ. గంభీరమైన పర్వతం (గిరి), దాని శిఖరం పక్కనే అందమైన చంద మామ (చంద్). ఈ రెండు కలిపితే నేను అని గొప్పలు పోయే వాడిని. అంతిష్టం నాకు నా పేరంటే. అయితే… గుజరాత్ లో అడుగు పెట్టినప్పటి నుండి నా పేరుతో నాకు నరకం చూపిస్తా ఉండారు ఇక్కడోళ్ళు. ఎవరికి నా పేరు గిరి చంద్ అని చెప్పినా “ఆ..గిరీష్ చంద్రా” అని గిరికి ఇష్, చంద్ కి ’ర’ వత్తు చేర్చేవాళ్ళు.  కాదు “గిరి చంద్” అని నొక్కి చెప్పినా, “సరేలే” అని చెప్పి మళ్ళీ గిరీష్ అనే పిలిచేవాళ్ళు. నా గోడు ఎవరూ  పెద్దగా పట్టించుకునేటోళ్ళు కాదు. ఇక్కడ మొగాళ్ళ పేర్లలో ఎక్కువగా ఇష్ శబ్ధం ఉంటుంది. శివభక్తులు ఎక్కువే. పరేష్, ఆశిష్, కల్పేష్ .. ఇలా. తరువాత తరువాత హిందీలో కాస్త పట్టు దొరికిన తరువాత వాళ్ళతో వాదించటం మొదలు పెట్టేను. “నా పేరులో ఇష్ లేదు. కేవలం గిరిచంద్ ..గిరి చంద్ .. గిరిచంద్…మానిక్ చంద్ లాగా.” అని ఎంత గింజుకున్నా వాళ్ళు “సరేలే గిరీష్” అని భుజం తట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ ప్రస్థానం ఎప్పుడూ ఆగలేదు.  ఏ దుకాణానికెళ్ళినా,
బిల్లు రాసేటప్పుడు  “గిరి చంద్” అని నేను చెప్పటం, వాళ్ళు “గిరీష్ చంద్ర” అని రాయటం. నేనొక్కోసారి దాన్ని కొట్టిపిచ్చేసి వేరే పేపర్లో నా పేరు రాసి చూపించి మార్పించే సరికి తల ప్రాణం తోకకొచ్చేది. ఎందుకంటే నా పేరునలా మార్చి నాకే ఇవ్వటం నాకు బాధ కలిగించేది. నా హక్కునెవరో లాగేసుకున్నట్లనిపించేది.

            ఓసారి ఇండియన్ గాస్ కనక్షన్ కి అప్లై చేశాను. దానికి వాళ్ళు  ఐడెంటిటీ ప్రూఫు, రెసిడెన్షియల్ ప్రూఫు,బర్త్ సర్టిఫికేటూ, డెత్ సర్టిఫికేటూ వాళ్ళ పిండాకూడూ అన్నీ అడిగారు. నేను ఉన్నయ్యన్నీ ఇచ్చాను. ఎట్టకేలకు ఓ స్టవ్ కూడా అంటగట్టి కనక్షనిచ్చారు. ఇంటికొచ్చిన తరువాత గ్యాస్ బుక్ లో నా డీటెయిల్స్   చూస్తూంటే నా పేరు చూసి ఏడుపొచ్చింది. అందులో గిరీష్ చంద్ర అని కంప్యూటరు అక్షరాల్లో శుద్ధ గుజరాతీలో ప్రింటయి ఉంది. నేను వాళ్ళకిచ్చిన ప్రూఫుల్లో ఏ ఒక్కదాంట్లో గూడా “ఇష్” లేదు కదా. కడుపు మండిపోయింది.  ఎప్పుడు గ్యాసు ఎలిగిచ్చినా ఆ పేరు ముల్లులా గుచ్చసాగింది. ఓరోజు వీలుచూసుకుని ఓ స్నేహితుడ్ని తీసుకుని ఆ గ్యాస్ ఏజెన్సీకెళ్ళాను. కౌంటర్ లో ఓ చురకత్తి లాంటి అమ్మాయి కూర్చుని ఉంది. జీన్స్, టీషర్ట్ లో ఉంది. నేను కంప్లైంట్ చేశాను. “నా పేరు తప్పు పడింది దాన్ని మార్చండి” అని. ఆ అమ్మాయి ఆ పుస్తకాన్ని తీసుకుని,
కంప్యూటర్ లో డిటెయిల్స్ ఓపెన్ చేసింది. అమ్మయ్య ఇంకేముంది మార్చేస్తుందిలే అని అనుకుంటుండగా. “మీ పేరేంది?” అని అడిగింది. నేను ఎప్పటిలాగే “గి.రి.చం.ద్” అని విడివిడిగా చెప్పాను ముందు జాగ్రత్తగా. ఆమె నా మొహం లోకి చూసి “ఇందులో తప్పేముంది ’గిరీష్ చంద్ర’ అనే ఉంది.” అనేసింది కూల్ గా. నేను నవ్వి, “మేడమ్ నా పేరు గిరీష్ చంద్ర కాదు గిరి చంద్. అందులో ఇష్ లేదు మరియు చంద్ర కాదు ’చంద్’ .” అన్నాను. అప్పుడామె అన్న మాటలకి నా తల తిరిగి పోయింది. “సార్! ఇందులో తప్పేముంది. మీ పేరు ఇంగ్లీష్ లో గిరి చంద్, గుజరాతీలో గిరీష్ చంద్ర.  మేమేమన్నా ఇంగ్లీష్ లో వ్రాసేమా?ఇంగ్లీష్ లో గిరి చంద్ గుజరాతీలో గిరీష్ చంద్ర అవుతుంది. అంతే” అని ఫైల్ క్లోజ్ చేసి పుస్తకం నా చేతిలో పెట్టింది. నేను ఉక్రోషంతో అక్కడ “పేర్లని కూడా ట్రాన్స్ లేట్ చేసేస్తారా?” అని ఎంత అరచినా లాభం లేక పోయింది. వాళ్ళకి నచ్చజెప్పలేక అవమానంతో బాధపడుతున్న నన్ను   “ఒక్క ఇష్ పెట్టేరు మధ్యలో అంతే కదా, టెన్షనెందుకు?” అని నా స్నేహితుడు
నన్ను బయటకి తీసుకొచ్చేశాడు. ఆ తరువాత ఎప్పుడు ఇంటికి గ్యాస్ వచ్చినా,
బిల్ లో నా పేరు చూడాలంటే మనసొప్పేది కాదు. సరే ఏం చేస్తాం మన ఖర్మ అనుకుని దాన్నలా వదిలేశాను.

            ఈ మధ్యే ఇల్లు మారాల్సి వచ్చింది. ఒక్కడూ తెలిసిన వాడు లేడు. కనీసం ఇక్కడన్నా నా పేరుని ఒక్కరన్నా సరిగ్గా పిలసే ఒట్టు. పనోళ్ళు, పిల్లలు, వాళ్ళ తల్లులు తండ్రులు అందరూ అదే పేరు “గిరీష్ గిరీష్”. రోజూ పొద్దున్నే “గిరీష్ భాయ్! కేమ్ ఛో?” అని
పలకరిస్తారు పళ్ళు తోముకుంటా. “మజామా!!” అని బదులివ్వాల్సి వస్తూంది నాకు పళ్ళు నూరుకుంటా.  ఆఫీసుకు బయలుదేరేటప్పుడు మరీ దారుణం. ఇంటి పక్కనే ఓ పెద్దామె సంవత్సరం వయసు కూడా లేని తన మనవరాల్ని “అదుగో గిరీషంకులు ఆఫీసుకెళ్తున్నాడు టాటా చెప్పు.” అని టాటా చెప్పిస్తది. నేను కూడా మనసులో ఎంత బాధున్నా నవ్వతా టాటా చెప్పి వెళ్ళటం అలవాటు చేసుకున్నాను. చిన్నప్పుడు నేను ఏడస్తుంటే శబ్ధం వచ్చేది కాదు,
ఇప్పుడు నా ఏడుపుకి కళ్ళనీళ్ళు రావటం లేదు. ఇష్..

పి.ఎస్ :- ఈ మాటల్న్నీ రాత్రి రాసేనా! పొద్దున్నే న్యూస్ పేపర్ అతను వచ్చి బిల్లివ్వడానికి పేరడిగాడు. నేను గిరి చంద్ అని చెప్పాను. అతను గిరీష్ చంద్రా! అనేసి టకటకా బిల్ రాసి నా చేతిలో పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఆ బిల్లునే చూస్తూ నవ్వతా కూర్చుండిపోయాను కాసేపు. ఇష్…

Advertisements
 1. అయ్యో అయ్యో గిరీషా ఎంత పని జరుగుతుందీ

 2. సారూ ఛే..!!

  ఉత్తరాంధ్రాలో నా పేరుతో ప్రహసనం ఇలాగే వుంటుంది. సత్యప్రసాద్ అనే పేరు ఇక్కడ చాలా మందికి కొత్త. ఎక్కువ శాతం సత్యప్రకాష్‌జీ అంటారు.. ఏ కాల్ సెంటర్ అమ్మాయైనా ఫోన్ చేసి “సత్యప్రకాష్‌జీ సే బాత్ కర్ రహీ హూ?” అని అడిగితే “సారీ రాంగ్ నెంబర్” అని పెట్టేస్తుంటాను. నా పేరు సరిగా పలికే దాకా అంతే చేస్తాను (ఒకోసారి ఏడెనిమిది సార్లు)

  గుజరతీయులకి ఇంకో అలవాటుంది. తండ్రిపేరు మధ్యలో వ్రాస్తారు – “మనీష్‌భాయ్ కన్నూభాయ్ పటేల్” అని. అలాగే నా పేరు “సత్యప్రకాష్‌భాయ్ రాంమోహన్‌భాయ్ అరిపిరాల” అయ్యింది చివరికి. ఎవరైనా ఆ పేరుతో పిలిచినా, ఎవరినో అనుకుని పలికేవాణ్ణి కాదు.

  • Gireesh K.
  • April 3rd, 2009

  నా పేరు అచ్చ తెలుగులోకూడా “గిరీష్” అండీ! 🙂

  • phani
  • April 5th, 2009

  పేరు బాథ చెప్పిన తర్వాత నా బాధ పంచుకొవాలని పించింది.
  నా పేరు ఫణి
  Gulf లొ వుంటున్నాను
  చిన్నప్పటి నుంచి నా పేరు unique అని నా ఫీలింగ్
  కాని ఇక్కడ
  నన్ను
  ఖర్మ….
  Panni
  phunny
  sunny
  ఇంకా ఘొరంగా
  Funny అని కూడా పిలుస్తున్నారు
  నా పెరు సరిగ్గా పిలిపించు కొవలసిన బాధ్యత నాదే కదా అని
  హిందీ లొ వ్రాసి చూపిస్తే
  నవ్వి మళ్ళీ అదే కూత
  పగ వాడికి కూడా రాకూడని కష్టాలలొ ఇదే మొట్ట మొదటిది అని ఘంటా పదంగా చెప్పే (ఇప్పుడు చెప్పేను) స్తితికి వెళ్ళేను

 3. # చావా కిరణ్ గారు ఈ పేరు మార్పుని సరదాగా తీసుకోక తప్పేట్లు లేదు!! 😦
  # ప్రకాష్ జీ కేమ్ ఛో? 😉
  # గిరీష్ గారు అయితే గుజరాత్ వచ్చేయండి. 🙂
  # ఫణి గారు మీ పరిస్థితి నాకన్నా ఘోరంగా ఉంది సర్.

  అందరికీ ధన్యవాదాలు.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: