శ్రీక్రిష్ణ 498 BC

రుక్మిణీ దేవి వడిలో పడుకుని, ఆమె అందించే ద్రాక్ష పళ్ళను ఆరగిస్తూ అరమోడ్పు కన్నులతో సేద దీర్చుకుంటూన్న శ్రీక్రిష్ణ భగవానుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అంతవరకు చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా ఉండిన పతి మోము కలవరపడి కళావిహీనమవటం తో కంగారుగా అడిగింది రుక్మిణి “ఏమైంది స్వామీ!! అని.

“ఏమీ లేదు…ఏమీ లేదు దేవీ!” అంటూ తలవిదిలించాడు. అంతవరకు తీయగా ఉన్న నోరు చేదుగా అనిపించింది.

“ఏమిటో చెప్పండి? … ఎవరైనా మీ భక్తులు ఆపదలో ఉన్నారా?” ఆరా తీసింది. “కాదు…కాదు..పాండవులకే ఏదో సమస్య వచ్చినట్టుగా ఉంది.”

“..ఊ.. వాళ్ళకెప్పుడూ సమస్యలే. ఏదో ఒక వంక పెట్టి మిమ్మల్ని పిలవటం…సంసారం పాడూ లేకుండా మీరు తిరగటంతోనే  ఇన్నాళ్ళూ సరిపోయింది. మళ్ళీ ఇప్పుడో కొత్త సమస్యా?” చిరుకోపంతో కసిరింది.

పతి మొహం వివర్ణమవటంతో అనునయంగా అడిగింది. “ఏమిటో వాళ్ళ సమస్య? కాస్త దివ్యదృష్టితో చూడచ్చు కదా స్వామీ!”

“అదే దేవీ! నాకంతుపట్టటం లేదు..దివ్యదృష్టికి కూడా అందటం లేదు..బహుశా నేను వినకూడనిదో, చూడకూడనిదో అయిఉంటుంది. అదే నాకు భయంగా ఉంది.”

ఆ రాత్రంతా కలత నిద్రతో గడిపాడు శ్రీక్రిష్ణుడు. ఉదయాన్నే పరిచారకుడొచ్చి “స్వామీ! ఎవరో ఐదుగురు వ్యక్తులు, దేశదిమ్మరులు లాగా ఉన్నారు. మీ దర్శనం కోసం బయట వేచి ఉన్నారు.” అని చెప్పాడు. వాళ్ళెవరై ఉంటారో ఊహించాడు శ్రీక్రిష్ణుడు. “వాళ్ళని అతిధి గృహంలో కూర్చోబెట్టు, నేను వస్తున్నాను.”

పాలిపోయిన మొహాలతో, కళ్ళన్నీ పీక్కుపోయి, శవాల్లా వేలబడిపోయి కూర్చుని ఉన్న పాండవుల్ని చూసి శ్రీక్రిష్ణుడి హృదయం ద్రవించి పోయింది.

“ఏమైంది ధర్మనందనా? ఏనాడూ మిమ్మల్నింత దైన్య స్థితిలో చూసింది లేదు.”

ధర్మరాజేం మాట్లాడలేదు. అంగరఖా నుండి కొన్ని తాళపత్రాలు తీసి శ్రీక్రిష్ణుడికిచ్చాడు. వాటిని అందుకుంటూనే అదిరి పడ్డాడు శ్రీక్రిష్ణుడు.కనుబొమలు ముడి పడ్డాయి, మొహం పాలిపోయింది. “అయితే ఇదన్నమాట సంగతి..” అంటూ దీర్ఘంగా నిట్టూర్చి పాండవులవైపు తేరపార చూశాడు. సింహాల్లా ఘర్జించి శత్రువులను అత్యంత ధైర్య సాహసాలతో మట్టి కరిపించిన వీరులు ఈనాడు దైన్యంగా కూర్చుని ఉండటం చూసి శ్రీక్రిష్ణుడి మనసు ఆర్ధ్రంతో నిండిపోయింది.

“ఎంత ఘోరం…ఎంత ఘోరం…మా చెల్లి ద్రౌపది మీ మీద గుహహింస క్రింద రాజాస్థానంలో ఫిర్యాదు చేసిందా!!…ఆశ్చర్యంగా ఉంది.”

“అవును శ్రీక్రిష్ణా! మేము తనను ధనం కోసం వేధించుచున్నామనీ, రోజూ తంతున్నామనీ..మామీద, మా తల్లి కుంతీదేవి మీద మరియు లేని మా సోదరి మీదా ఫిర్యాదు చేసింది. మాకేం చేయాలో పాలుబోవటం లేదు.”

“అవును ఇందులో చదివాను. గుహహింస క్రింద మీ అందరి మీద ఆరోపణలు చేసింది.”

“కుంతీదేవి మాకందరికీ ద్రౌపది మీద రోజూ చాడీలు చెప్పి మా అందరి చేత కొట్టిస్తూ ఉంటుందట. నేనేమో కూర్చోనివ్వకుండా, నించోనివ్వకుండా ధర్మాధర్మాలు చెబుతూ ఆంక్షలు పెట్టి బాధించానట.” అని చెప్పాడు ధర్మరాజు.

“నేనేమో..నా వాడి అయిన శరములతో గ్రుచ్చి గ్రుచ్చి హింసించానట బావా!” వాపోయాడు అర్జునుడు.

“నేను ద్రౌపదిని క్రింద పడవేసి గదతో మోది తీవ్రంగా కొట్టేవాడినట.” భీముడు చెప్పుకున్నాడు.

“మేమేమో..మేమేమో..ఊరకూరకనే…పాలు కావాలి, పెరుగు కావాలి అని ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా ఊడిగం చేయిస్తామట.” కన్నీళ్ళతో చెప్పారు నకులసహదేవులు.

“అయినా బావా! ఇలాంటి పనులు మీవంటి వారు చేయుట తగునా?” శ్రీకృష్ణుడన్నాడు.

“క్రిష్ణా!! చివరికి నీవు కూడా అంటివా?”

“నేనేమిటి?…మరొకరేమిటి? సమస్థ జనులూ, బంధుమిత్రులూ అందరూ ఇదేమాట అంటారు. ఈ గుహహింస చట్టం మహత్యం అలాంటిది. పూర్వం కొండ గుహల్లో ఉండే ఆదిమానవులు తమ రాతి గదలతో ఆడవాళ్ళని బాది బాధించేవాళ్ళు. వాళ్ళని కట్టడి చేయటానికి పెట్టిన ఈ చట్టం ఈ యుగంలో మీ కొంప ముంచింది.”

“అంటే..ఆమె ఏ ఆరోపణలు చేసిననూ నిజమగునా బావా?”

“నిజాలో? అబద్దాలో? ఇప్పటికి మటుకు ఆమె చెప్పినవే నిజాలు.నిజానిజాలు తేలేలోపే అంతా అయిపోతుంది బావా! పరువూ డబ్బూ అన్నీ పోయి బికారుల్లా మిగిలిన తరువాత నిజమైతేనేమి? అబద్దమైతేనేమి? అసలు ముందుగానే ఈ పరిస్థితి రాకుండా చూసుకోవలిసింది. నిట్టూర్చాడు శ్రీక్రిష్ణ భగవానుడు.

“ఎవరూహించారు స్వామీ!…నిన్న మొన్నటి వరకు తీయగా కబుర్లు చెప్పిన ద్రౌపది, నేడు ఆదిశక్తి అవతారంగా మారి అబద్దపు ఫిర్యాదు ఇచ్చింది. మామీద పెడితే పెట్టింది, మా తల్లి కుంతీదేవి మీద కూడా పెట్టాలా? ఆమె ఈ వయసులో ఏం పాపం చేసింది? మాకసలు సోదరే లేదు, అయినా ఆమె మీద పెట్టేరు.”

“బాధ పడకండి బావా! ఫిర్యాదు బలంగా ఉండటానికి న్యాయవాదులు ఇలా పెట్టిస్తారు. మిమ్మల్నేదో కటకటాల పాలు చేయటానికి మాత్రం చేసి ఉండదు క్రిష్ణ. మీరంటే ఆమెకు అపారమైన ప్రేమ. ఎవరో ఆమెకు తప్పుడు సలహా ఇచ్చి ఉంటారు..ఆ..నారదులవారు ఏమైనా కలిసారా ఈ మధ్య?” ”

ఏమో క్రిష్ణా! మాకంత తీరికెక్కడిది? ఎప్పుడూ రాజ్యపాలనలో, యుద్ద తంత్రాలలో, మేధావుల మంతనాలలో మునిగిపోయి ఉంటాము.”

“అదే మీ కొంప ముంచింది. సరే..ఈపాటికి సైనికులు మీకోసం వెతుకుతూ ఉండాలే?”

“అందుకే కదా మారు వేషాల్లో మీ దయకోసం వచ్చింది.”

“మరి కుంతీమాతనేమి చేసారు?” “ఆమెను విదురల వారి దగ్గరకు పంపించేశాం.”

“కొంపముంచారు..ఆమెనక్కడికి ఎందుకు పంపించారు?”

“అదేమిటి క్రిష్ణా? ఆమెకి అక్కడే సురక్షితం కదా!”

“ఇది గుహహింస ఫిర్యాదు. ఇందులో ఆమెను జాగ్రత్తగా ఉంచాలి. ఆమెను సైనికులు పట్టుకుంటే చాలదా? మీరెక్కడున్నా బయటికి రావటానికి. కలుగులో పొగబెడితే ఎలుకలు బయటకు రావా?”

“ద్రౌపది అలా చేయిస్తుందంటావా బావా?”

“మీ పిచ్చి నమ్మకం తగలబడ..ఫిర్యాదు ఇచ్చిన తరువాత ఒకరు చేయిస్తేనేమి? చేయించకుంటేనేమి? పనులు వాటంతట అవే జరిగిపోతాయి. మీరు కూడా ద్వారకలో ఉండటం అంత క్షేమకరం కాదు. వేగులు ఇప్పటికే ద్వారకలో తిరుగుతూ ఉన్నట్టు సమాచారం. మీరు కొంతకాలం పాటు అజ్ఞాతంలో ఉండాల్సి ఉంది.”

“విరాటరాజు దగ్గర ఉండేమా?” ఆశగా అడిగాడు భీముడు.

“ఈ తొందరపాటే వద్దు. ద్రౌపదికి మీ లోటుపాట్లన్నీ తెలుసు.”  అని  “అర్జునా!” అని పిలిచాడు.

“ఏం బావా?”

“నీకు పాతాళ లోకంలోనో..నాగలోకంలోనో మరో ఇల్లు ఉంది కదా?”

“ఆ..ఉందిలే బావా.”

“సరే నువ్వక్కడికి వెళ్ళు.”

“భీమా!”

“చెప్పు బావా!”

“నువ్వు కొంతకాలం హిడింబి దగ్గర ఉండు.

నాకిలాంటి ఏర్పాటు లేకపోయినే..అనో ఏమో..ధర్మజుడు చింతిస్తూ ఉండగా శ్రీక్రిష్ణుడడిగాడు “ఏమిటి ధర్మనందనా!నీలోనీవే మాట్లాడుకుంటూన్నావు?”

“ఆ..అదే..మరి..మన నకులసహదేవుల సంగతీ?”

“నకులసహదేవులు సుకుమారులు. వారిని మారువేషంలో ద్వారకలోనే ఉంచేస్తాను. వెన్నమీగడలు జుర్రుకుంటూ కాలం గడుపుతారు.”

నకులసహదేవుల కళ్ళు మెరిసాయి.

“మరి పెద్దన్నగారో?”

శ్రీక్రిష్ణుడు దీర్ఘంగా నిట్టూర్చి ధర్మరాజు వైపు చూసి, “ధర్మనందనా!..నీకొక చక్కటి విడిదినేర్పాటు చేస్తాను…నా బాల్య మిత్రుడు కుచేలుడని ఉన్నాడు. నిన్ను కొంతకాలం అక్కడే ఉంచాలనుకుంటున్నాను.”

కుచేలుడి పేరు విన్న వెంటనే ఉలిక్కిపడ్డాడు ధర్మరాజు.

“ఏమి ధర్మజా! ఏమైనా ధర్మ సందేహమా?”

“అహ..అది కాదు క్రిష్ణా!..ఆ కుచేలుడింట అటుకులు తింటూ ఉండగలనా అని?”

“ఉండగలగాలి బావా!..అటుకులు తింటూనో చితుకులు ఏరుకుంటూనో ఉండగలగాలి. తప్పదు. ఈ ఫిర్యాదు చేయించే గమ్మత్తు అలాంటిది. ఇందులోనుండి బయటపడేలోపు ఏ పనైనా చెయ్యగలగాలి. అలాగని పడతారో లేదో చెప్పలేం. లేకుంటే సైనికులకో లేక రాజస్థానంలోనో లొంగిపోవలసి వస్తుంది. కాబట్టి అంతవరకూ జాగ్రత్తగా ఉండండి.”

“మేమేం హత్యలు చేశామా? లేక దోపిడీలు చేశామా?”

“అవే చేసి ఉండుంటే అంత ఆదుర్ధా పడాల్సింది ఏమీ లేదు బావా. ఈ చట్టం దెబ్బ అలాంటిది. తాళి కట్టిన మరుక్షణమే మగవాళ్ళ మెడకి చుట్టుకుంటుందీ చట్టం. ఎప్పుడైనా బిగుసుకుపోవచ్చు. తస్మాత్ జాగ్రత్త సుమా! అని చెప్పేవాడుండడు. ఉరుము లేని పిడుగులా వచ్చి మీద పడుతుంది. అయినా బావా! ఇన్ని ధర్మసూక్ష్మాలు తెలిసిన వాడివి ఈ చట్టం గురించి తెలుసుకోలేదేమయ్యా?”

“అదే క్రిష్ణా! దౌర్భాగ్యం. కొన్ని వందల ధర్మ శాస్త్రాలు వల్లె వేశాను. దీన్నీ చదివాను.. కానీ ఇదేదో ఆడవాళ్ళకి సంబంధించిందిలే అని నిర్లక్ష్యం వహించాను, ఇప్పుడు చింతిస్తున్నాను.”

“సరే…ధర్మరాజా! ఇప్పుడు డబ్బులు చాలా కావలిసి వస్తుంది. రకరకాల ఖర్చులుంటాయి. ఎంత తీసిపెట్టేవేమిటి?”

“అవును శ్రీక్రిష్ణా! చాలా ఖర్చే అనిపిస్తూ ఉంది. అసంఖ్యాక మణులూ, కాంచనాభరణాలూ అన్నీ అమ్మేస్తే న్యాయవాదులకీ మరియు దారి ఖర్చులకీ సరిపోయాయి. ఇంద్రప్రస్థాన్ని బేరం పెట్టి వచ్చాను. ఏం చేస్తాం! బ్రహ్మ లిఖితం.”

“మరొక్కమాట..మీరు అజ్ఞాతంలో ఉన్నప్పుడు లేనిపోని మెప్పుల కోసం ధైర్యసాహసాలు ప్రదర్శించి ఎవ్వరి దృష్టినీ ఆకర్షించకండి. ఎవరికీ మీ గురించి తెలుపకండి..లేనిపోని తలనెప్పులు వస్తాయి.”

ఇంతలో పేడ వాసన గుప్పుమంది. “అన్నయ్య బలరాములవారు వస్తున్నట్లుంది..జాగ్రత్తగా మాట్లాడండి.”

“విన్నావా క్రిష్ణా! విన్నావా?”అంటూ ఆదుర్ధాగా ప్రవేశించారు బలరాములవారు.

“ఏమిటన్నయ్యా! ఎందుకు ఆదుర్ధా?”

“ఎందుకా? చూశావా ఆ పాండవుల దుర్మార్గం? ద్రౌపదిని అష్టకష్టాలు పెడుతున్నారట. ధనదాహంతో రోజూ కొట్టి హింసిస్తున్నారట. వీళ్ళకు తోడు కుంతీదేవి కూడా నట…నా వళ్ళు మండిపోతున్నది. అక్కడ హస్థినాపురంలో ప్రముఖులందరూ తల్లడిల్లి పోతున్నారు. భీష్ముడు పాండవుల మొహం ఇంక చూడలేను అని అంపశయ్యకి ముహూర్తం చూసుకుంటున్నాడట. ధ్రుతరాష్ట్రుడు ఆత్మహత్యాయత్నం చేసాడట. గాంధారి మరో కట్టు ఎక్కువ కట్టుకున్నదట, ద్రుపదుడు కృంగి కృశించి నేడో రేపో అన్నట్టు ఉన్నాడట. ద్రౌపది అన్నపానీయాలు మానేసి శోక సముద్రంలో మునిగిపోయి ఉందట. ధృష్టద్యుమ్నుడు యుద్ధసన్నహాలు చేస్తున్నాడట.”

“ద్రోణుడేం చేస్తున్నాడట?” అర్జునుడడిగాడు.

“ద్రోణుడా? నీ పిండాకూడు చేస్తున్నాడు. ఆ దౌర్భాగ్యుడికి నా విద్యనంతా ధారబోస్తినే…చివరకు భార్యను బాణాలతో గుచ్చి బాధించడానికా? అని అర్జునుడ్ని తిట్టిపోస్తూ ఏకలవ్యుడ్ని వెతుక్కుంటూ అడివికి వెళ్ళిపోయాడట….ఇంతకీ మీరెవరు?”

“నమస్కారం బలరామదేవా!!” అని పలికారు ఐదుగురూ.

“అన్నయ్యా! వీళ్ళు ఉద్యోగావకాశాలు వెదుక్కుంటూ మన దేశం వచ్చిన పరదేశీయులు.”

“ఉద్యోగావకాశాలా? మన దేశీయులకే దిక్కు లేదు. అయినా…గోకులంలో ఏం ఉద్యోగావకాశాలుంటాయి? గోపాలురు తప్ప.”

“అదే..అదే..ఆ ఉద్యోగానికే ఆ ఇద్దరు నవయువకులని ఎంపిక చేశాను. ఇక మీ ఇష్టం.”

“వాళ్ళా? చూడబోతే సుకుమారుల్లా ఉన్నారే?…అయితేనేం శ్రీక్రిష్ణుడి ఎంపిక కాబట్టి తీసుకుంటున్నాను. గోపాలురనగానే నా తమ్ముడిలాగ నెత్తిన పింఛం తగిలించుకుని, పిల్లనగ్రోవి ఊదుకుంటూ చెట్టు నీడన కూర్చోవటం అనుకునేరు. తెల్లవారకముందే లేసి పేడకళ్ళన్నీ ఎత్తి, కొంత పేడ పిడకలకి వేరుగా తీసిపెట్టి, గొడ్ల చావిడి శుభ్రం చేసి, గోవులకి గడ్డి వేసి, దూడలకి పాలు తాపి, తరువాత పాలు పితికి ఎక్కడెక్కడ ఇచ్చి రావాలో అక్కడ ఇచ్చి, గొడ్లని అడివిలోకి తోలుకుని పొయ్యి సాయంత్రం దాకా తిప్పి తిప్పి మేపాల. ఒకే రకం గడ్డి కాకుండా రకరకాల గడ్డి మేపాల. అప్పుడే పాలూ శ్రేష్టంగా ఉంటాయి పశువులూ ఆరోగ్యంగా ఉంటాయి. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత ఏం చేయాలో సాయంత్రం చెబుతాను. నేనెళ్ళి అన్నం తిని పది నిమిషాల్లో వస్తా. నాతోపాటు రావటానికి తయారుగా ఉండండి.” అని పలికి నాగలిని భుజాన వేసుకుని వెళ్ళి పోయారు బలరాములవారు.

పాలిపోయిన ముఖాల్తో ఉన్న నకులసహదేవుల్ని చూసి జాలేసింది శ్రీకిష్ణుడికి. “అన్నయ్య మాట అలాగే ఉంటుంది, కాని అంత పని ఉండదులే భయపడకండి. ఒక వేళ ఉన్నా కూడా త్వరలోనే అలవాటయిపోతుంది…మరొకమాట, హస్థినలోగానీ మరెక్కడైనా గానీ వాళ్ళలా అన్నారు..వీళ్ళిలా అన్నారు అని భయపడవద్దు. ఈ ఫిర్యాదులో ఇలానే అంటారు. ఒకవేళ మీరక్కడికి వెళ్ళినప్పుడు ఎవరేమన్నా మాటలతో మిమ్మల్ని బాధించినా భరించండి. అందరికీ నవ్వుతూనే సమాధానమివ్వండి. మీ స్పందన ప్రతిస్పందనలని బట్టి కూడా నిజానిజాలను అంచనా వేస్తారు.”

“ఎవరు అంచనా వేస్తారు?” పాండవులడిగారు.

“ఎవరో ఒకరు. అవన్నీ అర్ధం లేని ప్రశ్నలు. మీమీ శత్రువులు మిత్రువులు అందరితో సత్సంబంధాలు కలిగి ఉండండి. దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండండి. నా సహాయ సహకారాలు ఎలాగూ ఉంటాయి. ఇక మీరు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. సారధుల్ని పంపిస్తాను, మీమీ గమ్యస్థానాలకు చేరుస్తారు…..ఇంకా ఏమైనా సందేహాలున్నాయా?”

ధర్మరాజు లేచి శ్రీక్రిష్ణుడి దగ్గరకు వచ్చి “క్రిష్ణా! ఆ కుచేలుడి సంగతి మరొక్కసారి ఆలోచించు…దంతసిరి తగ్గింది.”

“బావా! ఈ విషయంలో నన్ను నమ్ము. మీ క్షేమం ముఖ్యం గాని తిండి కాదు. దంతసిరి తగ్గితే అటుకులు పాలల్లో నానబెట్టుకుని తినచ్చు. కుచేలుడూ అతని భార్యా ఎంతో మర్యాదస్థులు. అటుకులు చేయటంలో వారికి వారే సాటి. అందులో నీవు కూడా నిష్ణాతుడివి కావటానికి ప్రయత్నించు. చెప్పలేం..భవిష్యత్తులో ఏది ఎప్పుడు ఉపయోగపడుతుందో? అదీగాక వారికి అనేకమంది సంతానం. వారి ధర్మసందేహాలు తీర్చడంలో నీకూ బోలెడు కాలక్షేపం అవుతుంది.” అని సర్దిచెప్పి ధర్మరాజు చేతికి కొన్ని పురాతన తాళపత్ర గ్రంధాలు ఇచ్చి “ధర్మజా! ఇవి గుహహింసకి సంబంధించినవి జాగ్రత్తగా పఠించి నాకు తిరిగి ఇవ్వు.”

“క్రిష్ణా! ఇవి త్రేతాయుగపు నాటి గ్రంధాల్లా ఉన్నాయి..ఈ చట్టం అప్పుడూ ఉండేదా?” ఆశ్చర్యంగా అడిగాడు. “అవును. అక్షరంపొల్లుబోకుండా అన్నీ అప్పటివే.. సరే ఇక వెళ్ళిరండి.” అని త్రోవ చూపించి వారివారి గమ్యస్థానాలకు పంపివేశాడు శ్రీక్రిష్ణుడు.

******

ధృతరాష్టృడి కొలువు.

“ద్రౌపది ఫిర్యాదు ఇచ్చిన తరువాత పాండవులు ఎలా వెళ్ళారు?” ధ్రుతరాష్టృడడిగాడు విదురుడిని.

విదురుడిలా జవాబిచ్చాడు.

“ద్రౌపది తమ మీద ఫిర్యాదు చేసింది కదా! ఎవరూ తనని గుర్తు పట్టకుండా ధర్మరాజు మొహం దాచుకుని వెళ్ళాడు. ఈ న్యాయస్థానం కాకపోతే పై న్యాయస్థానానికి, అక్కడా కాకపోతే ఇంకా పై న్యాయస్థానానికి వెళ్తాననే అర్ధం వచ్చేటట్లు చేతులు దూరదూరంగా ఊపుకుంటూ వెళ్ళాడు భీముడు. ఇంతకంటే ఎక్కువ వాయిదాలకి మిమ్మల్ని తిప్పుతాను అన్న ఉద్దేశ్యంతో పార్ధుడు ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు. మా మీద అబద్దపు ఫిర్యాదు అనే బురద చల్లారు, మీ మీద అసలైన దుమ్ము చల్లుతాను అనే అర్ధంతో వళ్ళంతా దుమ్ము పూసుకుని నకులుడెళ్ళాడు. ఏదో ఒక రోజు మీరు సిగ్గు పడాల్సి వస్తుంది అన్నట్లు తల దించుకుని సహదేవుడెళ్ళాడు. మీలాగే మేమూ తప్పుడు ఫిర్యాదులు ఇవ్వగలమని కోపంతో అనేక చట్టాలను వల్లించుకుంటూ ధౌమ్యుడెళ్ళాడు.”

దృతరాష్టృడు దీర్ఘంగా నిట్టూర్పు విడిచి శోకంతో ఆవులాగా రోదించాడు.

ఒక పక్కగా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు కూర్చుని తీవ్రంగా అలోచిస్తూ ఉన్నారు.

“నువ్వేం దిగులు పడకు దుర్యోధనా! ఈ శకుని మామని నమ్ము. ద్రుపదుడ్ని జూదానికి పిలుద్దాం. మాయాజూదంలో ద్రౌపదిని గెలిచి పాండవులకిద్దాం.”

“ఈ అలోచన ప్రశస్థంగా ఉంది మామా! కానీ ద్రుపదుడు జూదానికి వస్తాడంటావా? వచ్చినా కూతుర్ని పణంగా పెడతాడంటావా?” అనుమానం వ్యక్తం చేశాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు కలుగజేసుకుని “ద్రౌపదిని పెట్టకుంటే నేమి సోదరా? ఫిర్యాదు ఉపసంహరణని పణంగా పెట్టిద్దాం.”

“ఏమిటి కర్ణా! పాండవుల్ని ఎలాగయినా కాపాడాలని మేము మార్గాలు వెతుకుతూ ఉంటే నువ్వు మాత్రం తీవ్రంగా అలోచిస్తూ కూర్చుని ఉన్నావు.”

“ఈ పాచికలకి గీచికలకి ద్రుపదుడు పడతాడని నేననుకోవటంలేదు మిత్రమా! మనమే పాంచాలపురికి వెళ్ళి ద్రుపదుడి తోటి ద్రౌపది తోటి మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దితే బాగుంటుందనుకుంటున్నాను.”

“భీష్మద్రోణవిదురులు వెళ్ళి భంగపడి వచ్చారు కద కర్ణా!”

“వాళ్ళు ముసలి వాళ్ళు. వెళ్ళి ఏం మాట్లాడి ఉంటారు? పోనీలేమ్మా! సర్ధుకోమ్మా! అని చెప్పి ఉంటారు. వాళ్ళింకా నెత్తికెక్కి కూర్చున్నారు.”

“లెస్స పలికితివి మిత్రమా! రేపే మన నలుగురం ద్రుపదుడి దగ్గరికి వెళదాం.

” *****

శ్రీక్రిష్ణుడు అత్యవసరంగా పిలిపించటంతో అదిధి గృహంలో కూర్చుని ఉన్నారు పాండవులు.

భీమార్జునులు గుసగుస లాడుకుంటున్నారు. “ఏమీ? అన్నగారి దవడలు పీక్కుపోయి ఉన్నాయి?” నొచ్చుకున్నాడు భీముడు.

“అటుకుల దెబ్బ..పాలు పిల్లలకే చాలటంలేదని పచ్చి అటుకులే రోజూ పెట్టి ఉంటాడు కుచేలుడు. అయినా అన్నగారి నేమి చూశావు? మన నకులసహదేవుల్ని చూడు డొక్కలన్నీ ఎండుకుపోయి పేడ కంపు కొడుతూ ఎలా ఉన్నారో!” అన్నాడు అర్జునుడు.

“అక్కడేమో పాలుండవు, ఇక్కడేమో పాలేపాలు.” అని కిసుక్కున నవ్వాడు భీముడు.

ధర్మరాజు గుర్రుగా చూడటంతో “ష్..అన్నగారు వింటున్నారు.” భీముడ్ని గిల్లాడు అర్జునుడు.

“ఏం శ్రీక్రిష్ణా! మమ్మల్ని ఉన్న ఫళాన పిలిపించావు. మళ్ళీ ఏదైనా ఉపద్రవం వచ్చి పడిందా?”

“ఏం చెప్పమంటావు బావా! పెద్ద యుద్దమే జరిగేటట్లుగా ఉంది.”

“యుద్దమా? ఎవరెవరికి మహాత్మా? త్వరగా చెప్పు.”

“మొన్న మీ సోదరులు దుర్యోధన దుశ్శాసనులూ, కర్ణుడూ మరియు మామ శకునీ సంప్రదింపులకని వెళ్ళి ద్రుపదుడి తో తగవు పెట్టుకుని వచ్చారు. దుర్యోధనుడైతే ఒక దశలో తొడ చరిచి “మిమ్మల్నందరినీ చంపయినా సరే పాంచాలిని పాండవులకప్పగిస్తా”నని శపధం చేశాడంట. దుశ్శాసనుడైతే అప్పుడే “ద్రౌపదిని ఈడ్చుకెళ్దాం సోదరా!” అన్నాడట. కర్ణుడు వారించటంతో ఆగిపోయాడట. కర్ణుడు కూడా ఆవేశంతో ఊగిపోయి ధనస్సుని పిసికేస్తూ యుద్దానికి సిద్దం కండి.” అని చెప్పి వచ్చాడంట.”

“ఆశ్చర్యంగా ఉంది శ్రీక్రిష్ణా! దుర్యోధనాదులు మా బాగు కోసం ఇంత చేస్తున్నారా. నిజంగా ఈ చట్టం ఎంతో మహత్తు గలది. పాంచాలి దూరమైనా దూరమైన బంధుమిత్రులు దగ్గరవుతున్నారు. ధన్యోస్మి…అయితే క్రిష్ణా! ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు?”

“అదే అర్ధం కావటం లేదు బావా! నేనసలీ భూమ్మీదకెందుకు వచ్చానా? అని వేదనగా ఉంది.”

“బావా! నా దగ్గర అనలాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రముంది ఇంకా అనేక రణభీకర అస్త్రాలు ఎన్నో ఉన్నాయి. కాని ఈ గుహహింస ఫిర్యాదు నుండి బయట పడేసే అస్త్రం ఏదీ లేదా?” అడిగాడు అర్జునుడు.

“ఎందుకు లేదు!”

“ఏమిటది?”

“ధర్మధార!”

“అంటే లొంగిపోవటమా? ఎక్కడ? సైనికులదగ్గరా”

“కాదు.”

“రాజాస్థానంలోనా?”

“కాదు అర్జునా!”

“మరెక్కడ?”

“ద్రౌపది దగ్గర!!”

“అదేం మాట క్రిష్ణా! మేమేం చేశామని లొంగిపోవటం?”

“మరి అదే సమస్య..” అని శ్రీక్రిష్ణుడు అంటూండగా వార్తాహరుడొచ్చి “క్షమించాలి మహరాజా! ఎవరో విప్రుడు మిమ్మల్ని తక్షణమే కలవాలని మొండికేస్తున్నాడు.”

“ఎలా ఉన్నాడు?”

“ముసలివాడు. బక్కగా ఉన్నాడు..ఊరకే నలుదిక్కులా చూస్తున్నాడు.”

“బ్రహ్మదేవుడు వచ్చాడన్నమాట” అని అనుకుని

“అతనిని నా అంతరంగ మందిరానికి తీసుకువెళ్ళి శీతల పానీయం ఇవ్వు.” అని చెప్పి పాండవులకు మళ్ళీ కలుస్తానని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు కోపంతో బుసలు కొడుతున్నాడు.

“ఏమిటి బ్రహ్మదేవా! అగ్గిమీద గుగ్గిలం అవుతున్నావు? నా మీద ఏమైనా కోపమా?”

“కాదు..కాదు స్వామీ! ఆ భూదేవి మీదే.” అని పళ్ళు పటపట కొరికాడు.

“ఏం జరిగింది?”

“ఏం జరిగిందా?…నిన్న పరలోకానికొచ్చి అందరిముందూ నన్ను నానా మాటలూ అని వెళ్ళింది…అంతకుముందు భూభారం తగ్గిస్తామని మీరూ నేనూ ఆమెకు హామీ ఇచ్చామట. నాపాటికి నేను మనుషుల్ని సృష్టించుకుంటూ పోతున్నానట. ఇచ్చిన మాట నిలబెట్టుకునేదేమన్నా ఉందా?లేదా? అని నలుగురి ముందు నిలదీసింది స్వామీ!”

“అది నిలబెట్టుకోవటానికే కదా నేను భూమ్మీదకొచ్చింది. మరి ఆ మాట చెప్పలేకపోయావా?”

“అదీ అయింది. ఆ మాటతో కస్సుమంది. ద్రౌపది పాండవుల్ని గుహహింసలో ఇరికించింది. ఇప్పుడు కౌరవులు పాండవుల తరపున ద్రుపదుడితో యుద్దం చేయబోతున్నారు. ఆ యుద్దంలో ఎంతమంది చస్తారు? మహా అయితే వందలూ వేలు. మహాభారతసంగ్రామం జరుగుతుందీ, నాభారం తగ్గుతుందీ అని చెప్పేరు కదా? అదెప్పుడు జరుగుతుంది? నాభారం ఎప్పుడు తగ్గుతుంది? మీ మాటెప్పుడు నిలబడుతుంది?…ఒకవేళ ఇలాగే గాని జరిగిందంటే ద్రౌపది పెట్టినట్టే మిమ్మల్ని కూడా గుహహింసలో ఇరికిస్తాను. పరలోకానికీ భూలోకానికీ తిరగలేక చస్తారు. అని నన్ను బెదిరించింది స్వామీ! ఆ ఫిర్యాదు పతిదేవుళ్ళ మీద పెట్టుకోవాలమ్మా..ఎవరిమీదంటే వాళ్ళమీద పెట్టకూడదు అని చెప్పినా వినకుండా చిందులు తొక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె వెళ్ళి ఆ ఫిర్యాదు మనిద్దరిమీదా ఇస్తుందేమోనని భయంగా ఉంది స్వామీ! అందుకే పరుగు పరుగున వచ్చేసేను. మీదే భారం. ఊరకే వాయిదాలకి భూలోకానికి తిరగలేను స్వామీ. నాకు చేతినిండా పని మీరే అప్పగించారు కదా. అసలు ద్రౌపది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయటం వెనక ఎవరిదైనా రాక్షసహస్తం ఉందేమో చూడు స్వామీ!” అని వేడుకున్నాడు.

“భయపడకు బ్రహ్మదేవా! మన మీద భూదేవి ఈ ఫిర్యాదు ఇవ్వటానికి లేదు. అది కేవలం పతిదేవుడు మరియు అతని రక్తసంబంధీకుల మీదే పెట్టచ్చనుకుంటాను.”

“మీరు కూడా ’అనుకుంటాను’ అంటున్నారే!!”

“ఈ చట్టం సూక్ష్మాసూక్ష్మాలు తెలుసుకోవటం నీ తరం కూడా కాదు బ్రహ్మా. సరే నీవెళ్ళు. పాంచాల దేశానికి వెళ్ళి మహాభారతసంగ్రామానికి నాంది పలికి వస్తాను. ఇక చక్రం తిప్పక తప్పదు.” అని బ్రహ్మదేవుడ్ని సాగనంపాడు.

“ఏం తిప్పుతాడో? ఏమో?” అని గొణుక్కుంటూ కదిలాడు బ్రహ్మ. తిరిగి పాండవుల దగ్గరకొచ్చాడు శ్రీక్రిష్ణుడు. “కృష్ణా! నువ్వే మాకు దారి చూపించాలి.” ధర్మరాజు వేడుకున్నాడు.

“ఏ దారి? ఎలాంటి దారి?”

“ఆఖరు ప్రయత్నంగా మా తరపున రాయబారిగా నువ్వెళ్ళాలి బావా!” అభ్యర్ధించాడు అర్జునుడు.

“ఎక్కడికి? పాంచాలరాజు దగ్గరకా? పెద్దలను గౌరవించటం తెలీని వాళ్ళ దగ్గరకు వెళ్ళాలా? వెళ్ళ్తే ఏం జరుగుతుంది? కురువృద్ధులనే..వీళ్ళేం పెద్దమనుష్యులు? అని హేళన చేశారే…మర్చిపోయారా? దుర్యోధనాదులు వెళితే కయ్యానికి కాలు దువ్వేరే…వాళ్ళ దగ్గరకా? అర్జునా! నన్ను వెళ్ళమంటున్నారు. వెళ్ళి నన్నూ అవమానపడి రమ్మంటారా? చాలు చాలు..ఇప్పటికే మిమ్మల్ని దాచానని ఆడిపోసుకుంటున్నారు.”

“కాదు కృష్ణా! … ద్రౌపదికి నీవంటే సోదర ప్రేమ. నీమాట వింటుంది. అదీగాక ద్రుపదుడు తదితరులకు నీవంటే భయంతో కూడిన గౌరవం. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. మాకోసం మరియు కుంతీమాత కోసం.” అని ప్రాధేయపడ్డాడు ధర్మజుడు.

“సంకటంలో పడేశారు బావా!..అటు చూస్తే గౌరవమర్యాదలూ ఇటు చూస్తే మీరు. సరే కానివ్వండి..ఇంతకీ నేనక్కడికి తీసుకు వెళ్ళవలసిన ప్రతిపాదన ఏమిటి?”

కాసేపు నిశ్శబ్ధం తరువాత ధర్మరాజు ఇలా అన్నాడు. “ద్రౌపదిని మేము మన:స్పూర్తిగా అహ్వానిసిస్తూ ఉన్నాము. రాజుకిచ్చిన ఫిర్యాదు ఉపసంహరించుకుని ఎప్పటిలాగే బాధ్యతగా సంసారం చేసుకుని పుట్టినింటికీ మెట్టినింటికీ గౌరవం తీసుకు రమ్మని చెప్పు క్రిష్ణా!”

“ఇంకేం గౌరవం మిగిలిందిలే బావా! అయినా వాళ్ళందుకు ఒప్పుకుంటారనుకుంటున్నారా?”

“ఒప్పుకోకపోవచ్చు ..సంవత్సరానికి కనీసం ఐదురోజులన్నా మాతో గడపమని చెప్పు క్రిష్ణా! ఈ యుద్దం వల్ల అందరికీ అపార నష్టం తప్పితే ఎలాంటి ఉపయోగమూ లేదని ద్రుపదుడికి మా మాటగా చెప్పు.”

శ్రీకృష్ణుడు కార్యార్దియై బయలుదేరాడు.

******

ధృతరాష్ట్రుడి కొలువు.

అందరూ రకరకాలు గా మాట్లాడుకుంటున్నారు. “ఐదు రోజులు కాదు గదా..ఐదు క్షణాల పాటు కూడా ద్రౌపదిని పాండవుల దగ్గర ఉంచనని శ్రీకృష్ణుడికి జవాబిచ్చాడట ద్రుపదుడు.” “ఇదంతా ద్రోణుడి కుట్ర అన్నాడంట ధుష్టద్యుమ్నుడు.”

ఇలా అందరూ గుసగుసలాడుకుంటున్న సమయంలో విదురుడు లేచి మాట్లాడాడు. “శ్రీకృష్ణుడి మాటలతో పాంచాలపతి మెత్తబడినట్లుగా తెలిసింది. కృష్ణుడు ద్రౌపదితో ఒక గోళాకార గృహంలో ఏకాంతంగా మాట్లాడినట్లూ..చివరలో ద్రౌపది అలాగే అన్నట్టు అంగీకారయోగ్యంగా తలూపినట్టు చారుల ద్వారా తెలిసింది. అయితే..ద్రుపదుడు అసంఖ్యాక తాళపత్రాలు, పాళీలు కొంటున్నాడని వేగుల సమాచారం. దీని అంతరార్ధం మాత్రం నాకు అంతుబట్టడం లేదు.”

“ఉపపాండవులకి అక్షరాభ్యాసం చేయిస్తున్నాడేమో?” అన్నాడు దుశ్శాసనుడు పళ్ళికిలిస్తూ.

“ఇది చతుర్లాడడానికి సమయం కాదు దుశ్శాసనా!…ఇందులో ఏదో గూఢార్ధం ఉండే ఉంటుందని నాకు అనిపిస్తూఉంది.” అన్నాడు శకుని పాచికలు కదుపుతూ.

ఇంతలో ఒక సైనికుడు లోపలికి ప్రవేశించి నమస్కరించి, “మహారాజా! పాంచాల దేశం నుంచి ఒక అక్షౌహిణి సైన్యం బయలుదేరి హస్థినకు వస్తున్నట్లు సమాచారం.”

సభలో నిశ్శబ్ధ వాతావరణం ఏర్పడింది. దుర్యోధనకర్ణాదులు కోపంతో మండిపడ్డారు. భీష్ముడు ఉగ్రరూపు దాల్చాడు. కర్ణుడ్ని సేనాపతిగా చేసుకుని దుర్యోధనుడ్ని తగు సేనతో వెళ్ళి ద్రుపదసేనను చిత్తుచేసిరమ్మని చెప్పాడు భీష్ముడు.

ఇంతలో ద్రోణుడు లేచి “ఆగండి..తొందరపడకండి. అపారమైన కౌరవసేనలనెదిరించేంత ధైర్యవంతుడు కాదు నా స్నేహితుడు. అదే సమయంలో ఒక అక్షౌహిణిని మాత్రమే యుద్ధానికి పంపించేంత తెలివి తక్కువవాడు కూడా కాదు…ఏది ఏమైనా మన సేనలను అప్రమత్తం చేయండి. గూఢచారులను వేగిర పరచండి.” అన్నాడు.

ఇంతలో మరో ఇద్దరు సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు. ” మహారాజా! ద్రుపదసేన నగర పొలిమేరలు వరకు వచ్చింది…అయితే వారు యుద్దానికి వచ్చినట్లు లేరు.”

“నీకెలా తెలుసు?” ప్రశ్నించాడు భీష్ముడు. “అన్ని రధాలమీదా, వాహనాల మీదా తెల్ల జండాలు ఉన్నాయి. అదీగాక సైనికులందరి చేతుల్లోనూ ఆయుధాలకు బదులు ఏవో మూటలు ఉన్నాయి మహరాజా!..శలవు.”

“ఏమిటి విదురా! ఇదంతా? అక్షౌహిణి ఏమిటీ? తెల్లజండాలేమిటీ? ఆ మూటలేమిటీ? అసలేమి జరుగుతూంది?” చిరాగ్గా అడిగాడు ధృతరాష్ట్రుడు.

“ఏమీలేదు. రాజీకి వచ్చినట్లున్నారు. సరైన సమాచారం వచ్చేవరకు ఓపిక పట్టు. మరి ఆ మూటలేమిటో నాకూ అర్ధం కావటం లేదు.”

వార్తాహరుడు వచ్చి చెప్పేడు. “ప్రభూ! ద్రుపద సేన నగరపొలిమేరలలో బసచేసింది. మీకిమ్మని సందేశం పంపించారు.”

“చదవు” ఆదేశించాడు ధృతరాష్ట్రుడు.

“కురువృద్ఢులకు నమస్కారం! మీ అందరి మీదా ఉన్న గౌరవంతో మీరు కోరుకున్నట్లే నా కుమార్తెను తిరిగి పాండవుల దగ్గరకు పంపించటానికి సిద్ధంగా ఉన్నాను. కాని ద్రౌపది మరియు ఉపపాండవుల క్షేమం దృష్ట్యా న్యాయనిపుణులను, క్షురకులను, విద్యావైద్యాధికారులనూ, ఆర్ధిక నిపుణులనూ, రక్షణనిపుణులనూ, భూసిస్థు, యుద్ధరంగ నిపుణులనూ, స్త్రీశిశు సంక్షేమ అధికారులనూ ఇతర అనేకమంది మేధావులనూ సంప్రదించి తీవ్రంగా అలోచించి లక్షాతొంభై నియమనిబంధనలను రూపొందించడం జరిగింది. వాటన్నింటినీ మూటల్లో కట్టి పంపుతున్నాము. మీరందరూ మరియు పాండవులూ అవి చదివి అర్ధంచేసుకుని వాటన్నింటినీ అమోదిస్తూ వాటిపై హస్తాక్షరం చేయవలసిందిగా మనవి. ఆ నియమాల్లో ఏ ఒక్క అక్షరాన్ని మార్చినా ద్రౌపదిని పంపేది లేదు. ఇట్లు పాంచాలరాజు ద్రుపదుడు.”

సభంతా హాహాకారాలతో నిండిపోయింది.

” హస్తాక్షరం చెయ్యకపోతే ఏంచేస్తాడట??.. పితామహా! ఇక ఉపేక్షించి లాభం లేదు, ఆ పాంచాలదేశంపై దండెత్తి ద్రుపదుడి మదమణిచి పాంచాలిని పట్టి తేవల్సిందే.” నిప్పులు చెరిగాడు దుర్యోధనుడు.

********

శ్రీక్రిష్ణుడి నివాసం. అరమోడ్పు కన్నులతో ఉయ్యాలమీద విశ్రాంతి తీసుకుంటున్నాడు శ్రీక్రిష్ణుడు. “నారాయణ…నారాయణ” అనుకుంటూ నారదుడు ప్రవేశించి నమస్కరించాడు.

“రా..నారదా!” అని ఆదరంగా ఆహ్వానించి తగు ఆసనం చూపింఛాడు శ్రీక్రిష్ణుడు.

“స్వామీ! ఉన్న ఫళాన వెళ్ళి మిమ్మల్ని కలవమని బ్రహ్మ దేవుడు ఆదేశించాడు. ఏమైంది స్వామీ!…ద్రౌపది గుహహింస గురించేనా?!…కౌరవులు ద్రుపదుడిపై యుద్దానికి సన్నహాలు చేస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితులు ఎలా తలెత్తాయి మహాత్మా! ఒక చిన్న చట్టం ఇంతపని చేయిస్తుందా! ఆశ్చర్యంగాఉంది.”

“ఏం చెప్పమంటావు నారదా? ఈ చట్టం కలిపిస్తున్న చిక్కులు అన్నీఇన్నీ కావు. అన్యాయమైపోతున్న జీవితాలకు ఆసరాగా ఉంటుందన్న భావంతో ఏర్పాటు చేయబడి, ఎంతో దుర్వినియోగానికి గురవుతూ మన కుటుంబ వ్యవస్థకి ఈ రోజు ఎన్నో అవస్థలు తెచ్చిపెడుతూ ఉందీ చట్టం మునీంద్రా! న్యాయవాదులు, న్యాయమూర్తులు, సైనికుడు, మహరాజు ఎవరైతేనేం? పెళ్ళయిన మగవాడయితే చాలు, అతన్నీ అతని కుటుంబాన్నీ సులభంగా వీధిన పడవేసి, ఈ చట్టం బూచిని చూపి డబ్బు చేసుకుంటున్న ప్రబుద్దులు ఎందరో.”

“మరి ఈ చట్టాన్ని తొలగించవచ్చు కదా దేవా!”

“ఎలా నారదా! కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. కోడలి స్థానం అలాంటిది మరి, అదే కోడలు  అత్తగామారితే ఈ చట్టం తో పాటు సమాజమూ  మళ్ళి చిన్నచూపుచూస్తుంది, ఈ చట్టం ఆడవారికి కాదు,  కేవలం కోడలి స్థానానికే రక్షణ కల్పిస్తుంది.  ఈ ఫిర్యాదులో  వారు ఎలాంటివారైనాసరే కోడళ్ళు మంచివారు,   ఆడపడచులు,అత్తలు,మామలు,మరుదులు,బావలు చెడ్డవారు, ఇదే ఆడపడుచు తన భర్తపై ఫిర్యాదుచేస్తే మళ్ళీ అక్కడ సానుభూతి తనకే , అంటే ఇక్కడ దోషి, అక్కడ నిర్దోషి, తన బుద్దితో దీనికి సంభందంలేదు” . రేపు ఇదే ద్రౌపది మీద ధుష్టద్యుమ్నుడి భార్య గుహహింస క్రింద ఇరికిస్తే అక్కడ అందరూ ఆమెను సానుభూతితో చూస్తారు ద్రౌపదిని దోషిలాగా చూస్తారు. ఇదో మంత్రతంత్రాలతో కూడిన వింత చట్టం నారదా.”

“ఇంక ఎలా స్వామీ! తప్పుడు ఫిర్యాదులు ఇచ్చినట్టు తేలితే, ఇచ్చిన వాళ్ళను శిక్షిస్తే నీతి తక్కువ కేసులు కొంచెం తగ్గుతాయేమో? లేకుంటే ఇది మన వివాహ వ్యవస్థని ఖచ్చితంగా దెబ్బ తీస్తుంది… చిత్రంగా ఉంది స్వామీ! ఆడమనిషి కోడలుగా ఉన్నప్పుడు అత్తమీద పెత్తనాన్ని కోరుకుంటుంది, అదే కోడలు తరువాతి కాలంలో అత్తగా మారినప్పుడు తన కోడలిపై పెత్తనాన్ని కోరుకుంటుంది. నారాయణా! ఇక భవిష్యత్తులో ఒప్పందపు పెళ్ళిళ్ళే శరణ్యమవుతాయేమో!…అవును స్వామీ! ఒప్పందం అంటే గుర్తుకొచ్చింది, ద్రౌపదిని తిరిగి పంపించటానికి ద్రుపదుడు అసంఖ్యాక నిబంధనలు పెట్టేడట నిజమేనా? మీరు చదివారా?”

“అన్నీ చదవాలంటే..శతజన్మలు కావాలి నారదా. ఏవో రెండుమూడు చూశానంతే. పాండవులు ఏ రోజు ఎలాంటి వస్త్రాలు కట్టుకోవాలి నుండీ కుంతీదేవి కనీసం రెండు వేల సంవత్సరాల పాటు పాండవుల దగ్గరకు రాకూడదని ఏవేవో నిబంధనలు నారదా!…భీష్మపితామహుడు మాత్రం “నిబంధనలలో ఏమున్నది? అన్నది ముఖ్యం కాదు..దంపతులు కల్సి బతకటానికి అసలు నిబంధనలే ఉండకూడదు.” అన్నాడట మహాశయుడు.”

ఇంతలో వంటగది నుండి అదేపనిగా గిన్నెలు పడవేస్తున్న శబ్ధం వస్తూ ఉండటంతో శ్రీక్రిష్ణుడు కనుబొమలు ముడివేసి అనుమానంగా అడిగాడు “మునీంద్రా! ఇక్కడికి వచ్చేముందు రుక్మిణీదేవిని గాని కలిసిరాలేదు కదా?”

“అయ్యో! కలవకపోవటం ఏమిటి స్వామీ! నేరుగా ఆ తల్లి దర్శనం చేసుకునే ఇక్కడకు వచ్చాను దేవా!…అయినా మాతకి అన్నీ అనుమానాలే స్వామీ! ఈ చట్టం గురించి ఎన్నో ఆరాలు తీసింది. సత్యభామ గురించీ…ఇంకా మీ లీలల గురించీ అడిగింది స్వామీ! కానీ నాకేమీ తెలియదు తల్లీ నన్ను వదిలివేయమని ప్రాధేయపడి వచ్చాను.”

“ఆహొ..అయితే చిచ్చు రగిల్చే వచ్చావన్నమాట.”

“నారాయణ..నారాయణ..అలాంటిదేం లేదు స్వామీ!..ఏదో లోకకళ్యాణార్ధం ఆలోకం ఈలోకం తిరిగేవాడ్ని నాకెందుకా పాపం స్వామీ!” అన్నాడు చెంపలేసుకుంటూ.

“లోకకళ్యాణం కోసం మా కళ్యాణబంధాన్ని కాలరాస్తావుటయ్యా మునీంద్రా? ఇదన్యాయం కదా. సరే..లోకకళ్యాణం కోసం నేనొక పని చెప్తాను చేసిపెట్టు. అందుకే బ్రహ్మదేవుడు నిన్ను పంపించాడు.”

“ఏమిటి స్వామీ! కురుక్షేత్రంలో రణరంగానికి అన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు నన్నెళ్ళి ద్రుపదసేనకీ కౌరవసేనకీ మధ్యలో నిలబడమంటారా? ఆవు ఆవు తన్నుకుంటూంటే మధ్యలో నన్ను దూడను చేస్తారా?” కంగారుగా అడిగాడు.

“లేదు నారదా! ఇప్పటికే ద్రౌపది,భవిష్యత్తులో తను అత్త గారైతే తనకు ఈ చట్టం చుట్టం కాదని, తనకు వచ్చే కోడలి గారికే సమాజం వంతు పాడుతుందని  పూర్తిగా అర్ధమై తన అత్త కుంతీదేవి దగ్గరకు వెళ్ళిపోయింది.కానీ అహం దెబ్బతిన్న కౌరవసేనలు పాంచాలపురంపై దండెత్తడానికి సిద్దమవుతున్నాయి. ద్రుపదసేనకు మద్దతివ్వటానికి ధృష్టద్యుమ్యుడ్ని పాండవుల దగ్గరకి పంపించాను. వాళ్ళు బావమరిది మాట కాదనరు, మద్దతిస్త్తారు. నువ్వు వెళ్ళి కౌరవులకి ఈ విషయం గురించి ఉప్పందించిరా చాలు. తరువాత అసలు సంగ్రామం తప్పదు.”

“ఇవన్నీ ఎలా చేసారు స్వామీ! ? దేవరహస్యమా?” ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.

“దేవరహస్యమేమీ కాదు నారదా! అంతా గుహహింస దెబ్బ. ఆ చట్టమే కొన్ని పనులు చేసింది మరికొన్ని పనులు చేయించింది.” అన్నాడు చమటలు తుడుచుకుంటూ.

దూరంగా ఎక్కడినుంచో మహాభారతసంగ్రామ ఆరంభ సూచకంగా శంఖారావం వినిపిస్తూ ఉంది.

భూదేవి వళ్ళు పులకరించింది. 

Advertisements
  • Anonymous
  • May 25th, 2010

  Ornayano ! chala pedda postu. bavundi.

  • mayukh
  • June 6th, 2010

  excellent,

  • Anonymous
  • December 29th, 2011

  What an idea sirji!! amazing.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: