Archive for the ‘ అనగనగా ….. ’ Category

పూలవాన పెళ్ళిపిలుపు

మన పూలవాన రవికిరణ్ తెలుగులో (పిలిచి) చేసిన తన సోదరుని వివాహ ఆహ్వానపత్రిక ఈ వీడియోలో వీక్షిద్దాం  …….

చార్వాకుడు

 ఈమధ్య బ్లాగులోకములో “చార్వాకుడు” గురించి  జరిగిన చర్చకు స్పందించి మాకు తెలిసిన ఈ కొద్దిపాటి సంగ్రహాన్ని కూడా దానికి తోడుగా   అందిస్తున్నాము…   

రమగారూ! చార్వాకుల గురించి ఈ కంప్యూటర్ కాలంలో అడిగారు కాబట్టి సరిపోయింది. అదే పురాణకాలంలో అడిగి వుండి వుంటే…..అనుమానం లేదు గొడవలు జరిగిపోయి ఉండేవి.

అత్యంత బాధాకరంగా అంతమైన చార్వాకుని కథ గురించి తెలుసుకునే ముందు  ఈ చార్వాకుల శాఖ గురించి తెలుసుకోవటం ముఖ్యం.

చార్వాక, లోకాయత, బార్హస్పతి అని అనేక పేర్లు గలవు ఈ శాఖకు.

‘లోకేషు అయతాః లోకాయత’

‘లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా ఒక మూల పురుషుడు లేడు. ఇది సామాన్య ప్రజల్లో పుట్టిన ‘అనుమాన’, ‘తర్క’ ల ప్రభావమే. మనం భగవంతుడికి ప్రసాదం రోజూ పెడుతూనే వున్నాం కాని ఆయన ఎప్పుడన్నా దాన్ని తిన్నాడా? ఇలాంటి తర్కాలను లేవదీసి, చివరకు ఆనాటి అధ్యత్మికవాదులచే తిరస్కరింపబడ్డారు ఈ లోకాయతులు.

14వ శతాబ్ధికి చెందిన మాధవాచార్య తన ‘సర్వదర్శక సంగ్రహం’ లో ఇలా వివరించాడు. “సంపదనూ, కోరికలనూ…మానవ లక్ష్యాలుగా భావించి, సంతోషాన్ని ధ్యేయంగా పెట్టుకున్న విధానాన్ని, సూత్రాలను అనుసరించుతూ, భవిష్యత్ ప్రపంచ వాస్తవికతను నిరాకరించే మానవ సమూహాన్ని చార్వాక సిద్దాంతాన్ని అనుసరించే వారిగా గుర్తించవచ్చు. వారి సిద్దాంతానికి మరోపేరు ‘లోకాయుత’. వస్తు రీత్యా సరైన పేరు.”
దేవుడు లేడు, ఆత్మలేదు, మరణానంతరం మిగిలేదేమీ లేదు అని నమ్మి ఇంద్రియసౌఖ్యాలకి ప్రాధాన్యత నిచ్చిన వీరిని చరిత్ర భౌతికవాదులుగా పేర్కొనింది.

ఆనాటి సమాజంలో రాజకీయంగా, ఆర్ధికంగా బలవంతులైన వైదిక సంప్రదాయ వాదులచే  అణగద్రొక్కబడిన లోకయతుల ప్రాచీన గ్రంధాలన్నీ క్రీ.పూర్వమే ధ్వంసం చేయబడ్డాయని అంటారు. చివరకు వీరి ఆచారాలు, సంప్రదాయాలను, వీరి ప్రత్యర్దుల గ్రంధాల నుండి,(వ్యంగ్య) వ్యాఖ్యల  నుండి తీసుకోవలసి వచ్చింది. క్రీ.పూ.300 కి చెందిన కాత్యాయనుడు వైయాకరిణి లోకాయతపై ‘భాగురి వ్యాఖ్యానం’ ఉదహరించాడు. అంటే ఆ కాలం లోనే లోకాయత గ్రంధమూ, దానిపై వ్యాఖ్యానమూ వున్నాయన్నమాట.
‘బ్రహ్మ సూత్రాల’ భాష్యంతో శంకరాచార్య వీరిని ‘ప్రకృతిజనాః’(మూర్ఖజనులు) అంటే లోకాయతులనే చెప్పాడు. ‘షడ్ దర్శన సముచ్చయ’ రచయిత హరిభద్రుడు, లోకాయతులను వివేచన లేని గుంపుగా, ఆలోచన లేని సముదాయంగా వర్ణించాడు.
ఆ కాలంలో దీని వ్యతిరేకతలోనే దీని ప్రభావం, శక్తి, ముఖ్యత గోచరిస్తాయి.
సామాన్య బ్రాహ్మణుడినుండి, పాలకుల వరకు లోకాయత శాస్త్రాన్ని అభ్యసించే వారని అనేక ఆధారాలున్నాయి. బ్రాహ్మణుడైన జాబాలి, శ్రీరాముడికి మత విరోధ భావాలు బోధించాడు. బౌద్ధులు పిడి సూత్రాలలో, బ్రాహ్మణులు అభ్యసించే అనేక శాస్త్రాలలో లోకాయత ఒకటని పేర్కొన్నారు. ‘వినయపిటిక’ ప్రకారం, బుద్దుడు ఆపి వుండకపోతే కొందరు బౌద్ధ సన్యాసులు కూడా లోకాయతను పఠించడానికి సిద్దపడ్డారట. బుద్దఘోషుడు లోకాయతను “వితండవాద శాత్త” అని పిలిచాడు. (పాళీభాషలో శాత్త అంటే సంస్కృతంలో ‘శాస్త్రం’.).మహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుతో తన చిన్ననాటి విషయాలు ముచ్చటిస్తూ ద్రౌపది ఇలా అంది. తన చిన్ననాడు, తమతో వుండటానికి ఒక బ్రాహ్మణుడ్ని తన తండ్రి ఆహ్వానించాడనీ, ఆ బ్రాహ్మణుడే తన తండ్రికి, తన సోదరులకు బార్హస్పత్య భావాలను బోధించాడనీ, తనూ వాటిని ఆసక్తితో వినేదాన్ననీ చెప్పింది. ద్రౌపది చెప్పిన విషయాలు విని ధర్మరాజు ఆమెను మత వ్యతిరేక భావాల ప్రభావంలో పడిపోయిందని నిందించాడు. కౌటిల్యుడు తన ‘అర్ధశాస్త్రం’ లో సాఖ్య, యోగశాస్త్రాలతో పాటు, లోకాయతను కూడా ఉదహరించి, దానిని ‘తర్కశాస్త్రం’ అన్నాడు. బాణుని  ‘హర్షచరిత్ర’లో విచ్చేసిన ఋషుల జాబితాలో ‘లోకాయత’ పేరు కూడా వుంది.

14వ శతాబ్ధపు జైన వ్యాఖ్యాత అయిన గుణరత్నుడు లోకాయతుల గురించి ఇలా చెప్పాడు. జీవితం బుద్బుదప్రాయం అని తలచి, మానవుడు చైతన్యసహితమైన శరీరం తప్ప ఇంక ఏమీలేదు అన్న అభిప్రాయంతో మద్యపానం, మాంసభక్షణ, అదుపు లేని లైంగిక క్రియలలో పాల్గొనేవారు. కామానికతీతమైన దేన్నీ వారు గుర్తించరు. వారిని చార్వాకులనీ, లోకాయతులనీ అంటారు. పానం చేయుట, నములుట(భుజించుట) వారి నీతి. నములుతారు కనుక వారిని చార్వికులంటారు. (చర్వ్:నములుట). అంటే వివేచన లేకుండా భుజిస్తారట. వీరి సిద్దాంతం బృహస్పతి ప్రతిపాదించాడు కనుక వారిని బార్హస్పత్యులని కూడా అంటారు.
వాస్తవ జగత్తును మినహా , అన్నింటినీ తిరస్కరించినందువల్లే ఈ తత్వశాస్త్రాన్ని ‘లోకాయత’ అంటారని పంచానన తర్కరత్న ఉవాచ. మొత్తానికి అనాటి వైదికసాంప్రదాయాలనూ, మూఢ నమ్మకాలనూ  ఎండగట్టి తిరస్కరించినందువలనే, ఈ లోకాయతులు అణచివేయబడ్డారన్నది సుస్పష్టం.

‘మహా భారతం’ లో శాంతిపర్వంలో వున్న ప్రసిద్దమైన చార్వాక వధ.

కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలకొలదీ బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యధిష్టురుని ఆశీర్వదించడానికి ప్రోగయ్యారు. వారిలో చార్వాకుడు కూడా వున్నాడు . మిగతా బ్రాహ్మణుల అనుమతి తీసుకోకుండానే, ముందుకు వెళ్ళి ధర్మరాజు నుద్దేశించి ఇలా అన్నాడు.
“ఈ బ్రాహ్మణ సమూహం, నీ రక్త బంధువులను వధించిన నిన్ను శపిస్తోంది. నీ మనుషులనే, నీ పెద్దలనే సమ్హరించి నీవు సాధించిందేమిటి? నీవు చనిపోయి తీరాలి (నశించాలి)”
హఠాత్తుగా జరిగిన చార్వాకుని మాటలకు, అక్కడ సమావేశమైన బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. యధిష్టిరుడు నైతికంగా గాయపడి మరణించాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికి మిగతా బ్రాహ్మణులు తెలివి తెచ్చుకుని, చార్వాకుడు తమ ప్రతినిధి కాదనీ, బ్రాహ్మణ వేషంలో వున్న రాక్షసుడనీ, రాజ విరోధి దుర్యోధనుని మిత్రుడనీ చెప్పారు. అలాగే తమకు రాజు చేసిన ఘనకార్యాల పట్ల మెచ్చుకోలు మాత్రమే కలదని హామీ ఇచ్చారు. నిరసన తెలిపిన చార్వాకుని నిలువునా దహించి వధించి వేసారు.

‘మహాభారతం’ ప్రకారం పవిత్రులైన బ్రాహ్మణుల చేతిలో దగ్ధమైపోయిన “చార్వాకుడు అంతకు పూర్వం ఒక రాక్షసుడు. కఠోరమైన తపస్సులు చేసి విపరీతమైన శక్తులు సంపాదించాడు. ఆ తరువాత దేవతలను బాధించి అణచివేయటం ప్రారంభించాడు.” అని ముద్రవేశారు . ఇది మామూలే, ఆ రోజుల్లో బ్రాహ్మణ సంప్రదాయాలను వ్యతిరేకించేవారిని రాక్షసులు, అసురులుగా ముద్రవేయటం పరిపాటి.

చార్వాకుడు  యధిష్టిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం.  ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే.
సామాన్యుని అభిప్రాయాన్ని మతాతీతంగా, సాహసవంతంగా వెల్లడించి ఆవిధంగా సాంప్రదాయవాదుల చేతిలో బలైపోయాడు చార్వాకుడు.

—‘చార్వాకుల’ గురించి అనేక చరిత్రకారులు పరిశోధనలు జరిపారు. వీరిలో ముఖ్యులు యస్.యన్.దాస్ గుప్తా, రాధాకృష్ణన్, తుచ్చి, గార్బే, రిస్ డేవిడ్స్, జార్జ్ ధాంసన్, హెచ్.పి.శాస్త్రి, ఇ.బి.కావెల్. పై వ్యాసంలో అధికవివరాలు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చే ముద్రింపబడిన “లోకాయత –అసుర ధృక్పధం” నుండి చాలా వరకు మక్కికి మక్కి తీసుకున్నాను. దీని మూల గ్రంధకర్త శ్రీ దేవీప్రసాద్ చటోపాధ్యాయ, తెనుగించినవారు శ్రీ హరి పురుషోత్తమరావు.10 రూ. కూడా లేని ఈ చిన్ని పుస్తకంలో చాలా విజ్ఙానముంది.

 కొసమెరుపు:ఈ చార్వాకుడి కథ చదివి ప్రభావితులమై, నువ్వుశెట్టి బ్రదర్స్ లో ఒకరి బాబుకి ‘చార్విక్’ అని పేరుపెట్టుకున్నాము. నామకరణం చేసిన పంతులు మాత్రం ఈ పేరువిని ఆశ్చర్యపోయాడు.

వల్లగాని పటేల్

map.jpgsardhar.jpg1947, ఆగస్ట్ 15 తరువాతనుంచి భారతదేశ పటం గీయమంటే, ఎవరైనాసరే ఎలగోలా గీసిపడేసెయ్యగలరు. కాని మన దేశ పటానికి ఈ సుందర రూపాన్ని తెచ్చిన వ్యక్తిని గురించి ఈ తరాలవారికి తెలిసింది చాలా తక్కువే . “వల్లగాని పటేల్” గా మన తెలుగు వాళ్ళు ముద్దుగా పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేజారిన ముత్యాలను ప్రోగు చేసి మాల కట్టి దేవుడి మెడలో వేసినట్లుగా, ముక్కలు ముక్కలైపోయి అస్థవ్యస్థంగా ఉండిన మన దేశానికి ఒక రూపునిచ్చి భరతమాత పాదాలకు ఎలా సమర్పించాడో కొంచెం చూద్దాం.

సమస్య :- భారతదేశం అంతటా వ్యాపించి వున్న 565 చిన్నచిన్న రాజ్యాలను దేశం లో విలీనం చేయటం.
సమయం :- కేవలం 10 వారాలు
శత్రువులు :- మహ్మద్ అలీ జిన్నా, అనేక సంస్థానాధీశులు, కొంతమంది బ్రిటిష్ ఉన్నతాధికారులు.
అడ్డంకి :- సంస్థానాలు భారత్ లో కలవాలా? పాకిస్థాన్లో కలవాలా? లేక స్వతంత్ర్యదేశంగా ఉండిపోవాలా అన్న స్వేచ్చని బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఇచ్చింది.
సర్ధార్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేసారో తెలుసుకునేముందు, బార్డోలి సత్యాగ్రహంలో ఆయన పాత్రగురించి కొంచం తెలుసుకుందాం.
బార్డోలి సత్యాగ్రహం(1928).

 దీన్ని పెద్దలు రామాయణంలో కిష్కిందకాండతో పోల్చారు. రాముడితో హనుమంతుడి కలయిక జరిగింది ఇందులోనే. ఆ కలయికే సీత జాడ తెలుసుకోవటానికీ, రావణ సంహరానికీ దారి తీసింది. గాంధీజిని తన అనుమతిలేకుండా బార్డోలి(గుజరాత్ లో ఓ ప్రాంతం.)లో అడుగు పెట్టద్దని కోరి, ఆయన సిద్దాంతాలకు కట్టుబడి ఉంటూనే తనదైన శైలిలో 88000 మందిని  ధీరులుగా మలచి బార్డోలి సత్యాగ్రహాన్ని అహింసాయుతంగా జరిపిని ధీరోత్తముడు ఈ ఉక్కుమనిషి. ఈ సత్యాగ్రహమే భావి భారత స్వాతంత్ర్య సమరానికి దిశానిర్ధేశం చేసింది. మరియు సర్ధార్ పటేల్ లోని సైద్ధాంతిక, ధీరత్వ, నాయకత్వ లక్షణాలను భారతదేశం గుర్తించింది.

1929 డిసెంబర్ నెలలో కాంగ్రెస్ అధ్యక్ష్య పదవికి ఎవరిని ఎన్నుకోవాలి? అని సమావేశం జరిగింది. ఆ రోజుల్లో ఈ పదవినలంకరించిన వారిని “రాష్ట్రపతి” అని సంబోధించేవారు. గాంధీజిని 10 మంది, సర్ధార్ని 5 మంది, నెహ్రూని ముగ్గురు బలపరిచారు. గాంధీజి ఆ పదవిని నిరాకరించారు. అప్పుడు సర్ధార్ వంతువచ్చింది. ఆయన ఒకే ముక్కలో “కెప్టెన్ వెళ్ళకూడదని నిర్ణయించుకున్న తరువాత, అక్కడికి వెళ్ళటానికి సైనికుడికి ఎంత ధైర్యం వుండాలి?” అని వినమ్రంగా తప్పుకున్నాడు. ఆయన సామర్ధ్యానికి అసలైన పరీక్ష తరువాత జరిగింది. అదే Integration of Princely States of India.

1953లో యుగోస్లావియా ప్రెసిడెంట్ అయిన మార్షల్ టిటో భారత్ ని సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక విలేఖరి అడిగాడు. మీకు భారత దేశంలో అమోఘం అనిపించిన విషయం ఏమిటి? అని. ఆయన ఇలా సమాధానమిచారు. “ఒక్క రక్తపు బిందువు కూడా చిందకుండా భారతదేశ విలీనం ఎలా జరిగిందా? అని ఇప్పటికీ నాకర్ధం కావడంలేదు.”

సర్ధార్ లేకుండా వుండి వుంటే ఈ విజయానికి దూరమై మన దేశపు చిత్రపటం ఎంతో అందవిహీనంగా వుండేది. అనితరసాధ్యమైన ఆ పనిని తన్ భుజస్కంధాలపై వేసుకుని విజయవంతంగా ఎలా పూర్తిచేసాడో చూద్దాం.

1948 జూన్ కల్లా భారత్ ని భారతీయుల చేతిలో పెట్టిరమ్మని లార్డ్ మౌంట్ బాటన్ ని 1947 మార్చ్ లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకు పంపించింది. జూన్ 4 తేదిన ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి, ఆగస్ట్ 15, 1947 న నాయకత్వాన్ని బదిలీ చేస్తామని ప్రకటించారు. అంటే 565 పైచిలుకు ముక్కలుగానున్న వుపఖండాన్ని రెండు ముక్కలుగా (భారత్, పాక్) కుదించటానికి ఇక కేవలం 10 వారాల సమయం మాత్రమే వుంది.

అవతలిప్రక్క ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా ఇదివరకే పాకిస్థాన్, బంగ్లాదేశ్ అనే రెండు భాగాలు పొందినా ఇంకా తృప్తి లేకుండా వున్నాడు. భారతదేశం ముక్కలు ముక్కలుగా అవ్వాలన్నదే అతని ధ్యేయంగా వుంది.అన్నింటికన్నా పెద్ద సంస్థానమైన హైదరాబాద్ నవాబు నిజాం, జిన్నా మద్దతుదారుడు. ఆయన ఆగస్ట్ 15 ‘1947 నుండి తనను తాను స్వతంత్ర్య పాలకుడిగా ప్రకటించుకున్నాడు. Chamber of Indian Princes కి నాయకుడైన భోపాల్ నవాబ్ కూడా జిన్నా అనునూయుడే. ఈయన నిజాం కన్నా మరొక అడుగు ముందుకేసి కొన్ని హిందు సంస్థానాలుకూడా పాక్ లో కలవాలని ప్రతిపాదించాడు. మరొక సమస్య ఏమంటే అప్పటి వైస్రాయ్ యొక్క రాజకీయ సలహాదారుడైన Sir Conrad Corfield పాక్ పట్ల మెతకవైఖరితో వుండేవాడు. ఈ సంక్లిష్ట పరిస్థితులలో ఏం చేయాలో అర్ధంకాక భారత నాయకులు ఆందోళనలో వున్నారు.

విలీనం అనేది మూడు ప్రధాన విషయాలను దృష్టిలో వుంచుకుని జరగాలని మౌంట్ బాటన్ ప్రతిపాదించాడు. అవి 1.రక్షణ 2. విదేశీ వ్యవహారాలు, 3. సమాచారం. కాని సర్ధార్ ఇలాంటి పరిమితులకు వప్పుకోలేదు. ఆ సమయంలో వారిద్దరిమధ్య జరిగిన ఆసక్తికర సంభాషణని చూద్దాం. ఈ సంభాషణే ఈనాడు మనం చూస్తున్న సంపూర్ణ భారతదేశ ఏర్పాటుకు దారి తీసింది. లేదంటే మన దేశపటాన్ని గీయటం ఇప్పుడున్నంత సులభమైవుండేది కాదు.

సర్ధార్ : మీ బుట్టలో “అన్ని” ఆపిల్స్ నింపి అమ్మితేనే కొంటాను. లేదంటే లేదు.
మౌ.బా: నాకొక డజను వదలగలవా?
సర్ధార్ : అవి చాలా ఎక్కువ. రెండు తీసుకోవటానికి వప్పుకుంటాను.
మౌ.బా: మరీ తక్కువ.

Collins & Lapierre ఇలా వ్రాసారు. “కొన్ని నిమిషాల పాటు ఆఖరి వైస్రాయ్ మరియు భారత భవిష్య మంత్రి, తివాచీ వ్యాపారుల్లా ఆ సంస్థానాల కోసం బేరమాడుకున్నారు. చివరకు వాళ్ళిద్దరూ ఒక అంకె దగ్గర ఆగిపొయ్యారు. అది ఆరు. వూహించండి. ఇదు వందల అరవై అయిదు సంస్థానాలు మైనస్ ఆరు. ఇదంతా ఆగస్ట్ 15 కి కేవలం కొన్ని వారాల ముందు. శిల నుండి  మలచబడినట్లు దృఢంగా వుండే వ్యక్తిత్వం కలవాడైన సర్ధార్ కాకుండా, వేరెవరైనా మౌంట్ బాటెన్ ముందు కూర్చుని వుండి వుంటే ఈ అద్భుత భారత దేశం మన ముందు వుండి వుండేదా?

పటేల్ అధ్వర్యంలో జరుగుతున్న విలీనంలో ఎంతోమంది సంస్థానాధీశులు హస్తాక్షరాలు చేసేసారు. ఇది జిన్నాకు కడుపుమండించింది. ఆయన భారత దేశంలో విలీనం కావటం ఇష్టంలేని సంస్థానాలను ఆకర్షించటం ప్రారంభించాడు. ముఖ్యంగా ముస్లింలు పరిపాలించే హైదరాబాద్, జునాగఢ్, భోపాల్ మరియు పాక్ కి దగ్గరగా వుండే జోధ్ పూర్, జైసల్మార్ వంటి సంస్థానాలు. అంతటితో ఆగక ఇండోర్, ట్రావన్ కోర్ వంటి వాటిని స్వతంత్ర్య దేశాలుగా నిలబడటానికి పావులు కదిపాడు.

విస్థరణలో, జనాభాలో కొన్ని యూరోపియన్ దేశాలకన్నా పెద్దవైన అనేక సంస్థానాధీశుల్ని వప్పించటానికి సర్ధార్ చేయని ప్రయత్నంలేదు. ఒకప్పుడు తనపై హత్యాయత్నం జరిపించటంలో ప్రధాన పాత్ర వహించిన నవ్ సాగర్ మహరాజైన జం సాహెబ్ కొందరు సంస్థానాధీశులతో కల్సి ఏదో గూడుపుఠాణీ చేయనున్నాడని తెల్సుకున్న సర్ధార్, ఆ రాజు తమ్ముడ్ని కల్సి మహారాణి మాత్రమే ఆయన్ని వప్పించగలదని తెలుసుకుని వారిని విందుకు ఆహ్వానించాడు. తన వాదనతో వారిని సమ్మోహితుల్ని చేసి చివరకు వప్పించాడు. ఆ మహరాజే సంస్థానాల విలీనంలో సర్ధార్ కి తరువాత ఎంతో సహాయ సహకారాలందించాడు. దేశం కోసం వ్యక్తిగత కక్షలు పక్కనపెట్టి తన మహనీయత్వాన్ని చాటుకున్నారు సర్ధార్.

సర్ధార్ చతురతకి అద్దం పట్టే మరో ఆసక్తికర సంఘఠన భోపాల్ నవాబు మరియు ఇండోర్ మహరాజుల విషయంలో జరిగింది. వీళ్ళిద్దరికీ ఇండియాలో విలీనం అవటం ఇష్టంలేదు. ఇద్దరూ ఒక రహస్య వప్పందానికి వచ్చారు, అదేమంటే ఏ నిర్ణయం తీసుకున్న సరే ఇద్దరూ కలిసే తీసుకోవాలని. సర్ధార్ అనేక ప్రయత్నాలు చేసిన మీదట భోపాల్ నవాబు సంతకం పెట్టటానికి అయిష్టంగానే వప్పుకున్నాడు, కాని ఒక షరతు పెట్టాడు. తన నిర్ణయాన్ని ఆగస్ట్ 15 తేదీనే ప్రకటించాలని. ఇక ఇండోర్ మహరాజుని ఎలా పట్టేసాడో చూద్దాం.

సరిహద్దులోనే వున్న భోపాల్ నవాబు సంతకం పెట్టేశాడని తెలియని ఇండోర్ మహరాజు విలీనం విషయమై రైల్లో ఒకనాడు ఢిల్లి కి వెళ్ళాడు. ఆ క్షణంలో సంతకం పెట్టకూడదన్న దృఢ సంకల్పంతో వున్న మహరాజు, సర్ధార్కి తన రాక గురించి తెలిపి, మాట్లాడాలనుకుంటే రైల్వే స్టేషన్ కి వచ్చి మాట్లాడమన్నాడు. సర్ధార్ వెళ్ళ లేదు. గాంధీజి అనుచరురాలైన మహరాణి రాజకుమారిని పంపించాడు. అక్కడ రాజకుమారి ప్రత్యక్షం అవటం సమస్యను పరిష్కరిస్తుందని సర్ధార్ కి తెలుసు. ఆమెను చూడగానే ఆశ్చర్యపోయిన మహరాజుకు   ఆమెతో కలిసి సర్ధార్ దగ్గరకు వెళ్ళక తప్పింది కాదు. కాని భోపాల్ నవాబుతో చేసుకున్న రహస్య వప్పందం ప్రభావం ఆయన మీద ఇంకా వుండటంతో నవాబుతో చర్చించకుండా సంతకం పెట్టనని భీష్మించాడు. నవాబు ఎప్పుడో సంతకం పెట్టేశాడని చెప్పినా నమ్మలేదు. చివరకు కాగితాలు చూపిస్తే, విభ్రాంతితో సంతకం పెట్టేశాడు.

The ulcer in the abdomen of India గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ని దండోపాయంతో విలీనం చేసి, దేశానికి ఒక రూపు తెచ్చాడు. ఇక ఆయన దూరదృష్టి ఎలాంటిదో చూద్దాం. “కలాత్” ఖాన్ మరియు భావల్పూర్ నవాబులు సర్ధార్ని కల్సి, తాము భారత్ లో విలీనమవుతామని విన్నవించుకున్నారు. కాని సర్ధార్ ఒప్పుకోలేదు. కలాత్ లో వుండేదంతా ముస్లిములు, అదీగాక భౌగోళికంగా అది పాక్ అంతర్భాగం. ఇక భావల్పూర్, సరిహద్దులో వున్నా కూడా అందంతా ముస్లిములే కనుక వాళ్ళను పాక్ లోనే కలవమని నచ్చచెప్పాడు. (ఈ బుద్ధి జిన్నాకు లేకపోయింది.)

కాశ్మీర్ని ఆక్రమించుకుంటున్న పాకిస్థాన్ సైన్యాన్ని వెనక్కి తరిమివేయటానికి పూనుకున్న సర్ధార్ ని, కాశ్మీర్ సమస్యని తనకొదిలేయమని నెహ్రూ కోరటంతో అది ఈనాటికీ UNOలో నలుగుతూ Brain Tumer of India గా తయారయింది. ఇదే సమస్య జునాగఢ్ (గుజరాత్)కి కూడా ఎదురైతే దాన్ని UNO వరకు పోనివ్వకుండా సర్ధార్ అడ్డుకున్నాడు. లేదంటే అది కూడా మరో కాశ్మీర్ అయివుండేది.

1950 లో మౌంట్ బాటన్ ఇలా అన్నారు. “ఇండియా ఒక సంపూర్ణదేశంగా మారటానికి కనీసం 15 ఏళ్ళు పడుతుందని అనుకున్నాము. కాని సర్ధార్ కేవలం 10 నుండి 12 నెలలలోపే అపూర్వమైన విజయాన్ని సాధించాడు.”

ఈ రోజే హైదెరాబాద్ సంస్థానం మన దేశంలో విలీనమైన రోజు.(Sep17)

కొసమెరుపు:

1949లో హైదరాబాద్ నిజాం పాలనను అంతమొందించడానికి భారత ప్రభుత్వం “పోలీసు చర్య” అమలు జరిపింది. తర్వాత దానికి అయిన ఖర్చు ఏ పద్దు కింద చేర్చాలో ప్రభుత్వానికి అర్ధం కాక తికమక పడింది. అది పోలీసు చర్య కనుక భారత రక్షణశాఖ ఆ ఖర్చుని భరించడానికి నిరాకరించింది. పోలీసు బలగాన్ని వినియోగించలేదని, అంతా మిలిటరీ వారే పాల్గొన్నారని, కాబట్టి ఆ ఖర్చుతో తమకి సంబంధం లేదని హోంశాఖ తిరస్కరించింది. ఫైగా అది క్రమశిక్షణ చర్య కనుక ఆ ఖర్చుని విద్యాశాఖకి బదలాయించమని సలహా ఇచ్చింది. కేంద్ర విద్యా శాఖ అందుకు నిరాకరించి, “హైదరాబాద్ పై పోలీసు చర్య దేశానికి పట్టుకున్న వ్యాధి నిర్మూలన పధకంలో భాగం కనుక ఆ ఖర్చుని ఆరోగ్యశాఖ పరంగా వ్రాయించ” మన్న సూచనను పాటించి ఆ ఖర్చుని ఆరోగ్యశాఖ భరించింది.
(ఈ నిజాన్ని ‘జాతీయ హాస్యం’ పేరిట పాత అంధ్రజ్యోతి పత్రికలో వేస్తే చదివాను.)

(పై వ్యాసంలో అధిక వివరాలను ఈక్రింది పుస్తకాలనుండి గ్రహించాను. -”The Peerless Sardhar” by Gunvant Singh.
– గాంధీజి “సత్యసోధన”

గణిత బ్రహ్మ డా.లక్కోజు సంజీవరాయశర్మ తో …”నేను”

sars.jpg

నేను ఈ మధ్య గణిత బ్రహ్మ డా.లక్కోజు సంజీవరాయశర్మ గురించి నా తెలుగు రాతలు!లో ఓ మంచి వ్యాసం చదివాను.చాలా వివరాలు అందించారు.నిజంగా వారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే.ప్రతి కృష్ణాష్టమి రోజు వీరు నాకు విధిగా గుర్తుకొస్తారు . అది తెలియాలంటే  నేను వారితో 1993 లో చేసిన రైలు ప్రయాణం గురించి వివరిస్తే ఈ   కృష్ణా అష్టమి రోజున ఆ మహానుభావుడిని స్మరించుకున్నట్లూ ఉంటుందీ,ఆ నా మరచిపోలేని అనుభవం మీ అందరితో  పంచుకున్నట్లూ ఉంటుందనే సదుద్దేశంతో ఈ టపా.
     “దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని వీరిని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేదావి ఇల్లు కదలలేకపోయారు”.  అన్న  “నా తెలుగు రాతలు” వారి వాక్యాలతోనే నా ఈ టపా మొదలుపెట్టాలనిపిస్తోంది.ఎందుకంటే నిజానికి వారు ఆ రోజు తన మనవడిని తోడుగా తీసుకుని హైదరాబాదు వచ్చారు .అక్కడ తానా నిర్వాహకులు వీసా రాలేదని చేతులెత్తేయడంతో తన సొంత ఖర్చులతో తిరుగు ప్రయాణమయ్యారు శ్రీ కాళహస్తికి.ఆదీ విజయవాడ వరకు ఓ ట్రైను లో అక్కడనుండి ఓ పాసింజరు రైలులో.

ఇక విషయానికొస్తే 
ఆ రోజు నాకు వీక్లీ హాఫ్ కావటం మూలాన కావలి లో ఉన్నాను. అదే రోజు రాత్రి కావలినుంచి నెక్స్ట్ డే డూటీకి గూడూరు పోవాలి కాబట్టి  కాకినాడ-తిరుపతి  పాస్సింజరు సుమారు అర్దరాత్రి టైము లో కావలిలో ఎక్కాను.యధావిధిగా బాగా రష్ గా ఉంది.కూర్చోవటానికికూడా సీటు లేదు.అలా నిలబడే బిట్రగుంట దాకా ప్రయాణం సాగింది.బిట్రగుంటలో ఎవరో మహానుభావుడు  దిగి పోవటంతో పై బెర్తు ని ఆక్రమించి చిన్నగా సర్దుకున్నాను.అలా మరో పదినిమిషాలు ప్రయాణించిన పిదప అలా లోపల కూర్చున్నవారి మీదకి యధాలాపంగా  దృష్టి సారిస్తే అక్కడ మొదటి ఎంట్రన్సు దగ్గరే కిటికీ పక్కనే ఉన్న రెండు సీట్లలో ఒకదానిలో నల్ల కళ్ళజోడు పెట్టుకుని క్రింద ఓ గుడ్డసంచీతో పక్కనే కిటికీ కి ఆనించివున్న చేతికర్రతో ఆ అపరగణిత  బ్రహ్మ ఓ సాధారణ ప్రయాణికుడిగా పాసింజరులో నిద్రలేకుండా,ఓ సింగిలు సీటులో తనకు జరిగిన సన్మానలూ,సత్కార్యాలూ అన్నీ మర్చిపోయి నిద్ర పోలేక   తూగుతూ..ఉన్నారు .ముందు మామూలుగా తల తిప్పేసుకున్న నాకు వీరిని ఎక్కడో చూసినట్లుందే అనుకుంటూ బాగా పరికించి చూసాను.ఆంతకు ముందెప్పుడూ వీరిని నేను డైరెక్టుగా  ఎక్కడా చూడలేదు.పత్రికలలో తప్ప.కొద్ది నెలల క్రితమే ఆంద్ర జ్యోతిలో వీరి గురించి వ్రాసిన పరిశోధనావ్యాసం లో ఫొటో గుర్తు కి రావడంతో వీరు ఎవరో అర్ధమైయింది. వీరు వారేనని అని నాకు నేను నిర్ధారించుకున్న తరువాత నిజంగా భావోద్యోగానికి లోనయ్యాను. నిదానంగా దిగి వారి దగ్గరకి నడిచాను ఉత్కంఠంగా…చిన్నగా తూగుతున్నారు. ఎదురు సీటులో తన మనవడు మేలుకొనే వున్నాడు. మళ్ళీ ఓ సారి మనవడి ద్వార ఆయన శర్మా గారేనని నిర్ధారించుకున్నాను.మాట్లాడవచ్చా? అని అడిగాను ఏమి మట్లాడాలో తెలియకపోయినా. అవకాశం  వదులుకోదలుచుకోలేదు మరి. ఒక్క సారి నావంక చూచి తన తాతయ్యని  లేపి తన సీటు నాకిచ్చి తను కొద్ది సేపు పక్కనే నిలబడ్డాడు.రెండు సార్లు చెప్పిన తరువాత చేతులతో తడుముకుంటూనే  కూర్చోమన్నారు . మనసుపూర్తిగా రెండుచేతులూ  జోడించి నమస్కారంపెట్టి జంకుతూనే కూర్చున్నాను ఎదురుగా. మామూలుగా  నాగురించి చెప్పిన తరువాత అడిగాను ఎక్కడనుండి వస్తున్నారని.చెప్పారు వీసా సమస్య గురించీ,తానా టీము వారు చివరి నిమిషములో తనని రైల్వే స్టేషనులో వదిలేసిపోవడమూ ,తిరుగు ప్రయణానికి రిజర్వేషను లేక ఇలా రైళ్ళు పట్టుకోని  రావటమూ తో పాటూ తన బాధలూ, తనకు జరిగిన సత్కార్యాలూ, నెహ్రూ గారు ఇచ్చిన బంగారు పతకం గురించి ,దాన్ని కూడా చివరకు  దొంగలు ఎత్తుకొని పోవటం   గురించి అన్నీ చెప్పి, చివరకి   అడిగారు నాగురించి నీకు ఎలా తెలుసూ అని..చెప్పాను  ఆంధ్రజ్యోతి లో చదివాను అని. సంతోషించి  ఉత్సాహంగా ఏదన్నా లెక్క వేయ్, అన్నారు . అప్పటిదాకా నాకు పట్టిన తిమ్మిరి కాస్తా వదిలేసింది ఆమాటవినగానే.ముందే అజ్ఞానులం. దానికి తోడు సరస్వతీ దేవిదగ్గర పరీక్షలూ..ఏమి చేయాలో అర్ధం కాక   మొహమాటపడిపోయాను.వదల్లేదు ఏదోకటి అడగమన్నారు ..అలా మొహమాటపడుతూనే ఆలోచించసాగాను ఏమి అడుగుదామా అని.చివరకు ఏప్పుడో మాస్కొ బుక్కు Fun with maths and physics  లో లెక్క సమయానికి గుర్తుకొచ్చింది. పోయిన ప్రాణం తిరిగివచ్చినట్లుగా అడిగాను ఆ లెక్కని .”నాకు ఓ ఏడుగురు స్నేహితులున్నారు.వారిలో మొదటి స్నేహితుడు ప్రతి రోజూ నా దగ్గరకు వస్తాడు. రెండో వాడు ప్రతీ రెండురోజులకు ఓసారి వస్తాడు.మూడో వాడు ప్రతీ మూడురోజులకోసారి వస్తాడు………ఈ విధంగానే నాలుగోవాడు నాలుగు రోజులకూ,ఐదవ వాడు ప్రతీ ఐదు రోజులకూ ……….ఆరో వాడూ,ఏడోవాడు ప్రతీ ఆరు ,ఏడూ  రోజులకూ ఓ సారి నా దగ్గరకు వస్తారు.ఈ విధంగా వస్తూ ఉంటే వారందరూ కలసి ఎన్ని రోజులకు నాదగ్గరికి వస్తారు?” అడిగి ఊపిరి పీల్చుకున్నాను అమ్మయ్యా బాగానే అడిగానని! అలా కొద్ది సెకనులు వేళ్ళమీదే లెక్కేసి సరి జవాబు చెప్పి ఏముందీ LCM కట్టడమేగదా..అంటూ నవ్వారు …ఫుట్టు గుడ్డి  .అయినా.మేధావి. ఆ సరస్వతీ దేవికి వందనాలు.
నేనొక లెక్క వేస్తాను చెబుతావా? మరో బాంబు  పేల్చారు .ట్రైను వెగంగా పోతుందీ, దూకలేనుగా…..సరే అన్నాను. లెక్క సరిగా గుర్తు లేదు…కాని ఆయన అడిగింది కొన్ని తమలపాకులూ, వక్కలూ అణాలకు, సంభందించినవి..ఇక నేను ఏమి జవాబు చెప్పివుంటానో బహిరంగ రహస్యమే.నా పరాజయాన్ని పట్టించుకోకుండా నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు, వారం తిధి చెబుతా అన్నారు .చెప్పాను Sep04 అని. మామూలే, వేళ్ళతో  లెక్కలు అదీ కొద్ది సెకనులే. వెంటనే చెప్పారు .ఆ రోజు గురువారం తెల్లరితే కృష్ణా అష్టమి అని. Human Computer గా పేరున్న శకుంతలాదేవిచే తనకంటే మేధావని కొనియాడబడిన ఆ ఆపర గణిత మేధావి తో కొద్ది దూరం కల్సి ప్రయాణం చేయడం ,ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తితో  మాటలాడటం,హనుమంతుని ముందు కుప్పిగెంతులేయటం,తన నోటినుంచి నా పుట్టిన రోజు తిధి ,వారాలు వినడం నిజంగా నేను  మరచిపోలేను.

మీ అందరితో ఈ విధంగా  నా అనందాన్ని పంచుకోవటం   ఇంకా ఆనందముగావుంది.   

ఇతర వివరముల కొరకు:

http://andhraguyz.com/Andhra_Pradesh/p2_articleid/864