Archive for the ‘ అనగనగా ….. ’ Category

“తెలుగు తల్లి కి బ్రిటిష్ క్రౌన్”

cp_brown.jpg

తెలుగు నేల నుండి త్రవ్వి తీసిన  కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ “క్రౌన్” లో పెట్టుకున్నారని చింతిస్తున్నారా? వద్దు. అంతకన్నా ఎన్నో రెట్లు విలువైన ఓ రత్నాన్ని మన తెలుగు తల్లికి కిరీటం గా వదిగి పొమ్మని, అదే అంగ్లేయులు మనకి బహుమతి గా పంపించారు. ఆ రత్నమే “బ్రౌన్”
      
   కోహినూరు మనకి దొరికితే మహా అయితే అమ్ముకుని కోటీశ్వరులమైపోతామేమో. కాని ఆయన తెలుగు భాషకు చేసిన సేవల ముందు  అది గోకరకాణి కి కూడ పనికి రాదు.

   ఏ దేవుడు పంపాడో గాని, తెలుగు భాషకి ఆయన చేసిన సేవ అద్వితీయం. దాన్ని నేర్చుకోవటమే కాక, అందులో పూర్తిగా లీనమయి పోయి మనవాళ్ళు అంతగా పట్టించుకోని అనేక తాళపత్ర గ్రంధాలను, వేమన పద్యాలను కోకొల్లలు గా సేకరించి తెలుగు భాషకు అస్థిత్వాన్ని ఏర్పరిచాడు. లేకుంటే మనకి “ఉప్పు కప్పురంబు…” కూడా మిగిలి ఉండేది కాదు.
  
   ఆయన చేపట్టిన బృహత్తర కార్యక్రమాల్లో అత్యుత్తమమైనది తెలుగు నిఘంటువు(తెలుగు – ఇంగ్లీషు)   ని తయారు చేయటం. దాన్ని ఒకసారి తిరగేసామంటే చాలు, సి.పి.బ్రౌన్ తో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. ఈ బ్రుహద్గ్రంధాన్ని తయారు చేయటానికి ఆయన ఎంత తపించి వుంటాడో కదా! వైష్ణవుల శైవుల మధ్య జరిగిన కలహాల్లో ఎన్నో అమూల్యమైన గ్రంధాలు పంచభూతాల్లో కలిసిపోయాయని వాపోయిన బ్రౌన్ ఈ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువులో ప్రతి పుటనీ ఒక కావ్యం గా మలిచాడు. కళ్ళు మూసుకుని ఏ పుటనైనా తీసి అందులోకి తరచి చూస్తే చాలు, అందులో నుండి అంతులేని తెలుగు సంపదని మూట కట్టుకోవచ్చు.   

   కొన్ని పదాలని మనం రోజూ ఉపయోగిస్తూనే ఉంటాం, కాని అందులో ఉన్న నిగూఢార్ధాన్ని గురించి సాధారణంగా ఆలోచించం. ఉదాహరణకి “అల్లుడు” అంటే “one who weave” అనగా “రెండు కుటుంబాలని కలిపినవాడని” అర్ధం అట. “చెయ్యి” అనే పదం “చేయు” నుండి పుట్టిందట. అలాగే “కుడిచెయ్యి” అనేది “కూడు తినే చెయ్యి” నుండి పుట్టిందంట.

    పక్షి విశేషము, క్రీడా విశేషము అని అర్ధం చెప్పి వదిలేయక, వీలయినన్ని ఉదాహరణల్ని ఇచ్చి ఆ పద భావాన్ని అన్ని కోణాల నుండి స్పృశించటం అపూర్వం. ఉదా|| “తెల్ల” (white) అనే పదాన్ని వివరించటానికి అరపుట తీసుకున్నాడు. అలాగే “చాలు” అనే పదానికి కూడా. ఈ వివరణల్లోనే తాండవం చేస్తుంది తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంప్రదాయం.

   మనం “కలుక్కుమంది” అని వ్రాస్తాం. కాని ఇందులో “కళుక్కుమంది” అని వుంది. మనం ఇంతవరకు వినని, ఉపయోగించని తెలుగు పదాలు కొల్లలు గా కనిపిస్తాయి. వీటన్నింటినీ చదువుతూ ఉంటె..ఇవే కదా మన ముత్తాత తాతల పెదాలపై తారట్లాడిన పదాలు అని అనిపించక మానదు.  
   “కసమస” అంటే తొట్రుపాటు, “కస్తి” అంటే దుఖం అంట.
కవలు అనే పదానికి అర్ధం చెబుతూ..
 గీ|| “పాటమొనరించుతరి దోడపడు గురునకు
        గవలుపోకుండబుత్రోడో కలువకంటి.” అని ఉదా|| ఇచ్చాడు. ఇందులో ఎన్ని పదాలు వాడుకలో ఉన్నాయి?
 
    ఇక వివరణల్లో ఈయన పొందుపరిచిన పద్యాలు అసంఖ్యాకంగా కనిపిస్తాయి. ”

క|| పుడమిన పప్రధయగునెడ
       బడతికిదేహంబు విడువబాడియకాదే,
    నుడికంటె జాపుమేలను
       నుడువు పురాతనముకాక నూతనపదమే.”

    కొత్తగా బిడ్డపుడితే, పేర్ల కోసం ఇంటర్నెట్ లోనో, మేనకాగాంధి పొందుపరచిన పిల్లల పేర్ల పుస్తకం లోనో వెతకనఖర్లేదు. బ్రౌన్ నిఘంటువుని బయటకు తీసి (ఉంటే) దుమ్ము దులిపి పుటలు తిప్పి చూడండి. ప్రతి పుటలోనూ అందమైన, ఇంపైన పేర్లు ఎన్నో కనిపిస్తాయి. (నేను కనీసం వేయి పేర్లన్నా ఇందులోనుండి సేకరించాను, ఇంకా ఎన్నో వేల పేర్లు ఉన్నాయి.).

   పార్వతీ దేవికి “శక్తి, అంబిక, అగజాత, దుర్వ, దేవి, దాక్షాయణి, భువనేశ్వరి, భవాని, భార్గవి, సతి, గిరికన్య, గిరిజ, గౌరి, కాత్యాయని, కాళి, మేనక, మాత ….” ఇన్ని పేర్లున్నాయి. ఇవన్నీ అక్కడక్కడా కనిపించినవి మాత్రమే!

   పంచబాణుడు (మన్మధుడు)కి వున్న ఐదు బణాలు.
1.అరవిందము  – Lotus – ద్రావిణి.
2.అశోకము     – Jenesia Asoka- శోషిణి.
3.చూతము     – Mango Blossom- బంధిని.
4.వనమల్లిక     – Jasmin Arabian- మోహిని.
5.నీలోత్పలము -Blue Lotus- ఉన్మాదిని.
(వీటితో కొడితే ఎవరు మాత్రం పడిపోరు?)

   ఇలా వ్రాసుకుంటూ పోతే ఎన్నో…. తాపత్రయం, పంచమాతులు, షడ్గుణములు, షట్కర్మలు, షడ్విద్యలు, సప్తసముద్రాలు, పంచ లోహాలు, 9 రకాల బ్రహ్మలు, 14 మంది మనువులు, షడ్రుచులు…అన్నింటిని సోదాహరణంగా ఇందులో వివరించాడు.

   చరిత్రకు సంబంధించి కూడా ఎంతో విలువైన సమాచారం ఇందులో దొరుకుతుంది. ఆనాటి “గాంధార” దేశమే ఈనాటి “కందహార్” అట.

  ఆంగ్లేయుడై ఉండి తనది కాని మన తెలుగు భాష కి ఇంత సేవ చేసిన సి.పి.బ్రౌన్ గురించి గౌ|| శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు తన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఈవిధంగా వ్రాసారు “….ఖుతుబ్షాలు, అసఫ్జాలు అందరినీ ఒక్క ప్రక్క పెట్టి బ్రౌను దొర నొక్కదిక్కు పెట్టి తూచిన బ్రౌను దిక్కే త్రాసు ముల్లు సూపును. అతడు తాటాకు గ్రంధాలు సేకరించియుంచెను. వేమన పద్యాలను మెచ్చుకొని వాటిని ఇంగ్లీషులోని కనువదించెను. తెలుగు నిఘంటువులు రెండు రచించెను. అందొకటి వ్యావహారిక పదకోశము. నాటికిని ఇవి చాలా యుపయోగపడుచున్నవి….”     
  ఈ పుస్తకం మీద పి.హెచ్.డి చేయవచ్చో లేదో నాకు తెలీదు కాని, అది చేయటానికి కావల్సిన సరుకు మాత్రం ఇందులో పుష్కలంగా వుంది.తెలుగు పిచ్చి ఉన్నా లేకున్నా, మన భాషా సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించాలనుకునే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండి తీరవలసిన పుస్తకం ఇది. అంతులేని తెలుగు భాషా సంపత్తి నిగూఢమై ఉన్న దీన్ని నిఘంటువు కన్నా కావ్యం అనటమే భావ్యం.
 
ఇంతకీ “గోకరకాణి” అంటే ఎంతో తెలుసా? (సమాధానం కావాలంటే నిఘంటువు తిరగేయండి.బ్రౌన్ నిఘంటువు లేనివారికోసం మాత్రమే వ్రాస్తున్నాను fraction of 1/4096  ) 
 

“తడి పెయింట్”.. తోటే అంతరిక్షంలోకి దూసుకువెళ్ళిన భారత దేశపు మొట్టమొదటి రాకెట్ కథ.

 racket2.jpg (ఆ ప్రయోగంలో వాడిన రాకెట్ కోన్ ని సైకిల్ మీద తీసుకు వెళ్ళటాన్ని దృశ్యీకరించినవారు ఫ్రాన్స్ కి చెందిన హెన్రి కార్టిఎర్.)

మీకు తెలుసా? భారత దేశపు మొట్టమొదటి రాకెట్ తడి పెయింట్ తోటే అంతరిక్షంలోకి దూసుకువెళ్ళిందని? ఆ ప్రయోగం లో అబ్దుల్ కలాం పాత్ర ఏమిటి? సమయం వుంటే చదవండి.

 ఈ నాడు మనం ఇంట్లో కూర్చుని, ఇంటర్నెట్ లో ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకుని ఝూమ్మంటూ ఎగిరిపోగలం. ఈ సౌకర్యాలన్నింటినీ మనకందించటానికి మన ముందు తరాల వాళ్ళు ఎంత తపన పడ్డారో? ఏంత శ్రమించారో అని ఎపుడైనా మనం తలచుకుంటున్నామా? ఆ దేవుళ్ళకు ఎనాడైనా నమస్కరించామా?

అసలు విషయానికి వద్దాం.

 అది రెండు స్టేజ్ ల రాకెట్. సోలిడ్ ప్రొపెల్లెంట్ నుండి శక్తి పొందింది. దాని బరువు 715 కిలోలు. సభ్యులు ఈ చారిత్రాత్మక ఘటనని వీక్షించేందుకు వీలుగా కేరళ అసెంబ్లీని ఈ రాకెట్ ప్రయోగానికి కొద్ది నిమిషాలముందు వాయిదా వేసారు. సముద్ర తీరం లో తుంబా (మళయాళం లో తుంబా అనేది వైద్య విలువలు గల ఓ తెల్లపూల చెట్టు పేరు.) లోని సెయింట్ మేరీ మెగ్డాలెన్స్ చర్చి ని ప్రయోగ స్థలం గా నిర్ణయించారు. ఆ చర్చి లోనే పేలోడ్ ని ఉంచారు.

 తుంబా ప్రయోగం “టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్” లో పనిచేసే విక్రం సారాభాయ్ యొక్క మానసపుత్రి. ఆయన అకుంఠిత దీక్ష మరియు అంకిత సేవల వలనే ఈ రోజు భారతదేశం విదేశీయుల ఉపగ్రహాలను కూడా నియమిత కక్ష్య లోకి ప్రవేశపెట్టగల స్థితి కి చేరుకుంది. సారాభాయ్ యు.ఎస్.ఎ లో పనిచేసే ముఖ్యమైన భారతీయ శాస్త్రవేత్తలకు రాకెట్ ప్రయోగానికి “తుంబా” అత్యంత అనువైన ప్రదేశమనీ, అక్కడికి ఒకసారి రమ్మనీ ఆహ్వానించాడు. అనేక మంది సారాభాయ్ ప్రతిపాదనని కొట్టి పడేసారు.

 అయితే ఆయన మీద నమ్మకమున్న కొద్దిమంది శాస్త్రవేత్తలు హార్వర్ద్, ఎం.ఐ.టి, కోర్నెల్ నుండి వచ్చారు. ఇక ఇప్పటి మన హీరొ, ఆనాడు “నాసా” లో పనిచేస్తూ ఉండిన అబ్దుల్ కలాం ఆగుతాడా? 1966 సంవత్సరం నవంబర్ 19 తారీఖున సారాభాయ్ నుండి కలాం ఒక అత్యవసర సమాచారం అందుకున్నాడు. ప్రొఫెసర్ జాక్స్ బ్లామోంట్స్ లాబొరేటరి కి వెళ్ళి ఒక సోడియం వేపర్ పేలోడ్ ని తీసుకుని, తరువాతి ఫ్లైట్ ఎక్కి భారత్ కి వచ్చి, ఆ పేలోడ్ తుంబాకి చేరేటట్లు చూడమని. కలాం ఆ పని పూర్తి చేసాడు. ఆ రోజుల్లో ఎవరైనా అనుకుని ఉంటారా? ఈ యువకుడు రాబోయే రోజుల్లో భారత రాష్ట్రపతి అవుతాడని.

 సారాభాయ్ ముఖ్య స్నేహితుడైన బ్లామోట్స్ కూడా తుంబా కి చేరుకున్నాడు. ఆ రాకెట్ ని తయారు చేసింది నైక్-అపాచి సంస్థ. దాన్ని యు.ఎస్ నుండి దిగుమతి చేసుకున్నారు. పేలోడ్ తయారయింది ఫ్రాన్స్ లో. ఈ రెండింటి అనుసంధానం ఎలా వుంటుందోనన్నది అనుమానమే?

 నవంబర్ 21 తేది ని ప్రయోగానికి అనువైన దినం గా నిర్ణయించారు. అందరిలోనూ టెన్షన్. ఏ పనీ అనుకున్నవిధంగా జరగటం లేదు. ముందు పేలోడ్ రావటం ఆలస్యమైంది. తుంబా కి చేరిందే గాని, దాన్ని ప్రయోగ స్థలానికి చేర్చటం ఎలా? అన్నదే ప్రధాన సమస్య అయింది.

 దానికి ఎద్దుల బండిని వాడారట. మిగిలిన భాగాల్ని, రాకెట్ కోన్ లాంటివాటిని సైకిల్ లాంటి ఏ వాహనం దొరికితే దాని మీద మోసుకువచ్చారు. తీరా అన్నీ చేరిన తరువాత చూస్తే ఫ్రెంచి పేలోడ్ కీ అమెరికన్ రాకెట్ కీ లంకె కుదరలేదు.

 అప్పుడు రంగంలోకి దిగాడు, భారతీయ మేధావి మరియు యూనివర్సిటి ఆఫ్ మిన్నెసొట లో ఫిజిక్స్ ఆచార్యుని గా పనిచేసిన ప్రొఫెసర్ పి.డి.భావ్సార్. ఆయన తన మేధస్సుని ఉపయోగించి కలాం సహాయంతో చిన్న చిన్న పనిముట్ల తో ఆ పేలోడ్ అంచులు గీకి, రాకెట్ కి సరిపోయేంత వరకు అరగదీసాడు. “ I was a paylod fellow then …” భారత రాకెట్ ప్రయోగ 40 వ వార్షికోత్సవం సందర్భం గా కలాం గుర్తు చేసుకున్నారు.

 అపూర్వంగా  ఆ పేలోడ్, రాకెట్ కి సరిపోయింది. ఈ లోపు కొంతమంది యువ శాస్త్రవేత్తలు అంతరిక్షం లోకి వెళ్ళబొయ్యే ఈ రాకెట్ కి పెయింట్ వెయ్యాలని నిర్ణయించారు. నిర్ణయించిందే తడవు డబ్బాలు, బ్రష్ లు వచ్చేయటం, పెయింట్ వేసేయటం జరిగిపోయాయి.

 ఇంతలో మరో సమస్య. రాకెట్ వెళ్ళే మార్గాన్ని చిత్రీకరించటానికి నాలుగు కెమెరా స్టేషన్లు కావల్సి వచ్చింది . ఒకటి కన్యాకుమారి లోని కేరళ హవుస్ గా నిర్ణయించారు. మిగిలినవి పొలయంకొట్టాయ్, కొట్టాయం మరియు కొడైకెనాల్ లోని కాలేజి బిల్డింగులు. విద్యార్ధులు కొందరు ఈ పనికి ఎన్నుకొనబడ్డారు. కాని ఈ నాలుగు స్థలాల మధ్య అనుసంధానం ఎలా? అప్పుడు టెలికాం డిపార్ట్ మెంట్ రంగం లోకి దిగి ఈ నాలుగు స్టేషన్ల మధ్య అనుసంధానం కుదుర్చి మార్గం సుగమం చేసింది.

 విషయం తెలిసిన స్థానిక మళయాళీలు 208 కి.మీ. ఎత్తుకు దూసుకు పోనున్న ఆ రాకెట్ ప్రయోగాన్ని తిలకించటానికి గుంపు గా చేరారు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. సోడియం ఆవిరి ని చిమ్ముకుంటూ, నిప్పులు కక్కుతూ ఆ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్ళి భారతీయుల్ని ఆనందం లో ముచెత్తింది. ఆ విధంగా భారత దేశపు మొట్టమొదటి రాకెట్ తడి పెయింట్ తోటే అంతరిక్షం లోకి ప్రవేశించింది.

 మరుసటి రోజు, ఈ విజయాన్ని “నాసా” అభినందించింది. సారాభాయ్ టీం ఆ అభినందనల్ని స్వీకరిస్తున్న సమయంలోనే ప్రెసిడెంట్ కెన్నడీ హత్య చేయబడ్డారు. ఒక సవత్సరం తరువాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఏర్పాటయింది.
 
ఆ రాకెట్ ప్రయోగాన్ని ఒక మేడ మీద నుంచి తిలకించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తరువాత  “ఇస్రో” చైర్మన్ అయ్యాడు. ఆయనే  మాధవన్ నాయర్.

మన పెద్దవాళ్ళు చెప్పినట్లు మరణించినవారి ఆత్మలు పైన ఎక్కడో తిరుగుతూ వుండేమాట నిజమే అయితే విక్రం సారాభాయి ఆత్మ ఖచ్చితంగా పైన వంటరిగా తిరుగుతూ వుండే సాటిలైట్ల మధ్యనే గడుపుతూ వుండి వుంటుంది.

                                    “ఫోటొ మరియు ఇతర వివరాలు టైంస్ ఆఫ్ ఇండియ లో నుండి సంగ్రహించబడినవి. ఏమైనా తప్పులు వుంటె క్షమించి తెలియజేయగలరు.”

పాదముద్రలు

cac1az49.jpg

    ఒక వ్యక్తి ఒకనాటి రాత్రి కలగన్నాడు. ఆ కలలో అతనూ మరియు భగవంతుడూ కలసి సముద్రం వడ్డున నడచివెళ్తున్నారు. అతని జీవితం లో జరిగిన అనేక సంఘటనలు  ఆకాశం లో చలనచిత్ర ద్రుశ్యాల్లా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ద్రుశ్యానికీ రెండు జతల పాదముద్రలు ఇసుకలో పడుతూ ఉండటాన్ని అతను గమనించాడు. ఒకటి అతనిది, మరొకటి భగవంతునిది.

    అతని జీవితం లో ఆఖరి ద్రుశ్యం అయిపోయేసరికి, వెనుతిరిగి ఒకసారి పాదముద్రలు చూసుకున్నాడు. అతను గమనించిందేమంటే అతని జీవితరహదారి లో చాలా సార్లు ఒక జత పాదముద్రలు మాత్రమే ఉన్నాయి. ఆఅశ్చర్యకరంగా అవి అతను కష్తాల్లోనూ, బాధాకరమైన సమయాల్లో ఉన్నప్పుడె ఉన్నాయి.

    అతను కలవరపడి, వెంటనే భగవంతుడ్ని అడిగాడు. “స్వామీ! నువ్వు ఎప్పుడూ నావెంటే ఉంటానని వాగ్ధానం చేసావు. కాని, ఎప్పుదైతే నేను బాధల్లో ఉన్నానో ఆ సమయాల్లో కేవలం ఒక జత పాదముద్రలే ఉన్నాయి. నాకు అర్ధం కావటం లేదు స్వామీ! ఆ సమయాల్లో నువ్వు ఏమైపోయావు? అలాంటి సమయాల్లోనే కదా నాకు నీ తోడు అవసరం. మరి నన్నెలా వదిలేసావు స్వామీ?”

    దేవుడు బదులిచ్చాడు. “నాయనా! నువ్వు నా ప్రియపుత్రుడివి, నీవంటే నాకు అపారమైన ప్రేమ. నేను నిన్ను ఏనాడూ వదల్లేదు. కష్తాల్లో ఉన్న సమయాల్లో, నువ్వు ఓకే జత పాదముద్రల్ని చూసావు. ఎందుకంటె ఆ సమయాల్లో నిన్ను నేను మోసుకెళ్ళాను కాబట్టి.”

                                                                               -రచయిత ఎవరో తెలియదు.

పెన్సిలిన్

    pencilin.jpg

        స్కాట్లాండ్ కి చెందిన ఫ్లెమింగ్ అనే ఒక పేద రైతు ఒక రోజు తన ఇంటి ముందు పని  చేసుకుంటూ ఉంటే,  దగ్గర  లోనే ఉన్న ఊబి  నుండి రక్షించండి.. రక్షించండి   అన్న కేకలు  వినిపించాయి.   వెంటనే   చేతిలో  ఉన్న  పనిముట్లను అలాగే వదిలేసి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఊబి లో కూరుకు పోతూ చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ ఒక పిల్లవాడు  దీనంగా  అరుస్తూ ఉన్నాడు.  ఆ   రైతు   వెంటనే  ఆ  పిల్లవాడిని  రక్షించాడు.  లేకుంటె  ఆ  ఊబిలో నెమ్మది నెమ్మది గా కూరుకు పోయి భయానకమైన చావుని రుచి చూసి ఉండే వాడు.

              పక్క రోజు, ఒక అందమైన రధం లాంటి బండి ఆ రైతు ఇంటి పరిసరాల్లో కి వచ్చి ఆగింది. అందులోనుండి  మంచి  దుస్తులు వేసుకున్న ఒక గౌరవనీయ మైన వ్యక్తి దిగి,   నిన్న రక్షింపబడిన   పిల్లవాడి  తండ్రి గా  పరిచయం  చేసుకుని ఇలా అన్నాడు. “నా బిడ్డని కాపాడినందుకు ప్రతిఫలంగా నీకు ఏమైనా ఇవ్వాల నుకుంటున్నాను.”

              “లేదు, నేను చేసిన దానికి  ఎలాంటి ప్రతిఫలాన్నీ తీసుకోను.” ఆ రైతు బదులిచ్చాడు. అదే సమయం లో ఆ రైతు కొడుకు ఇంటి లో నుండి బయటకు వచ్చి నిలుచున్నాడు.

             “అతను నీ కొడుకా?” ఆ గౌరవనీయమైన వ్యక్తి ప్రశ్నించాడు.
             “అవును” రైతు గర్వంగా చెప్పాడు.

             “అయితే మనం ఒక  వప్పందానికు వద్దాం. నా  కొడుక్కి ఎలాంటి      చదువు  సంధ్యలు చెప్పిస్తానో,  అంత  మంచి  చదువూ  నీ  కొడుక్కి  కూడ చెప్పిస్తాను. అతడికీ నీ లాంటి లక్ష్యణాలు ఎమైనా ఉండి వుంటే మనిద్దరి కీ గౌరవం తెస్తాడనటం లో సందేహం లేదు.”

              ఆ వ్యక్తి అన్నమాట నిలబెట్టుకున్నాడు. 

             ఆ రైతు కొడుకు ఆ రోజుల్లో ఉన్న అన్నింటి  కన్న మంచి బడులలో చదివాడు,  లండన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన  సెయింట్ మేరీస్ హాస్పిటల్ మెడికల్  స్కూల్  నుండి   పట్టభద్రుడయ్యాడు.   ఆ  రైతు బిడ్డే  “పెన్సిలిన్”  ని కనుగొని ప్రపంచమంతటా కొనియాడబడిన సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కొన్నాళ్ళ తరువాత   చిన్ననాడు  ఊబిలో   నుండి   రక్షింపబడిన  ఆ  ధనికుడి   కొడుకు న్యూమోనియా కు గురైతే ఈసారి అతన్ని రక్షించిందెవరో తెలుసా? పెన్సిలిన్. ఆ  ధనికుడి పేరు లార్ద్ రొనాల్ద్ చర్చిల్. ఆయన కొడుకు? సర్ విన్స్టన్ చర్చిల్.   

“టైంస్ ఆఫ్ ఇండియా సౌజన్యం తో”