Archive for the ‘ భావాలమాల ’ Category

చీకటి

dark1.jpg

విరబూసిన పూలతోట లేవి?
అరమూసిన వాలు చూపులేవి?
మెరిసే కోనల్లోన
నలిగే మల్లెలు లేవు
కురిసే వానల్లోన
విరిసే నవ్వులు లేవు
మదిన చెలరేగే కోరికలే
కెరటాలై నను ముంచేస్తుంటే
గుండెల్లోని భావావేశాలు
వుత్తుంగ తరంగాలై నామీద
విరుచుకు పడుతున్నాయి.
ఏవి?
చీకటి చాటున మెరవాల్సిన
వెలుగు జాడలు
ఎంతకీ కనిపించవేం?
అంతా కనిపించే వెన్నల రాత్రులు
ఎంతకీ ఆగిపోవేం? 

“ఒకే హృదయం”

caunct6r.jpg

రెండు
క్షణాలు.
ఒకటి నీవు
మరొకటి నేను.
కాల ప్రవాహం లో
కోసురాళ్ళ కు
గీసుకు పోతూ…
కాలిడేందుకు
నేలనేదే తగలక,
ఒకరి వూపిరిని
ఇంకొకరు లాగేసుకుని,
అలల కలలను
పొదవి పట్టుకుని
ఘడియ లో నుండి
బయటకు,
జలపాతం లా జారిపోతూ…
రెండే రెండు క్షణాలు,
ఒకటి నీవు
మరొకటి నేను.

“కాలే కనురెప్పలు”

in.jpg 

నాకీరోజే తెలిసింది
నిన్నటిదాకా
వారు నాకోసం
వేసిన కేకలూ, అరచిన అరుపులూ
అంతా సర్పరజ్జు భ్రాంతేనని.
నిజంగా, నాకీరోజే తెలిసింది
వారికి నేనేసే ఓటు
వినాయకుల్ని మోసే
మూషిక మత్తేనని.
ఈ అరుపులు చప్పట్ల మధ్య
అప్పటిదాకా వినపడలేదు మరి.
ఆ మెత్తటి చప్పుడు
ఆలకిస్తే తెలిసింది
అది నాకోసం, కనురెప్పలు చేసే
కవాతు చప్పుడని.
అంతలోనే ఏదో వాసన
కాలుతున్నట్లు.
కాలిపోతున్న కాపలా
కనురెప్పల కమురు వాసన.
జనం కోసం కనుమరుగైన
జవానుల శవాల సాక్షిగా,
ఏవరికైనా అనాలనిపిస్తుంది,

జై జవాన్ అనీ, జై భారత్ అని.

(గత 60 ఏళ్ళుగా మన కంటి పాపలను కాపాడుతున్న ఆ కనురెప్పలకు హృదయపూర్వక వందనములతో.)

“తల్లి మనసే”

cau3otuj.jpg

నాదీ ఓ తల్లి మనసే,
ఎప్పుడంటారా?
నా హృదయాగ్నిలో జనించి,జ్వలించిన ఓ నవ భావనా తరంగం,
అంతర్మధనంలో
అక్షరమై,
కలం కంఠం నుండి కాగితం మీద అక్షరించిన వేళ,
నా మనసుపడ్డ  నవ భావ మనో వేదన,
ప్రతి  తల్లీ పడే ప్రసవ వేదనే.
అందుకే మరో మారు చెబుతున్నా!
నాదీ ఓ తల్లి మనసేనని.