చీమా! చీమా! నువ్వెక్కడా?

ant (2)

ఒక రాజుకి ఏడుగురు కొడుకులు.

వారంతా వేటకి వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు.

ఆ చేపలు అన్నీ ఎండ వేశారు.అన్ని చేపలుతో పాటూ మన ఎండకూడని ఏడో చేప కూడ ఎండి పోయింది.

చేపా చేపా ఎందుకెండావు? అంటే గడ్డిమోపు అడ్డం రాలేదు,అందుకు ఎండాను అనిందంట.

గడ్డిమోపూ గడ్డిమోపూ ఎందుకు అడ్డం రాలేదూ ? అంటే

ఆవు నన్ను మేసిందీ అనిందంట.

ఆవూ ఆవూ ఎందుకు మేసావూ?అంటే

పాలేరు నా కట్లు విప్పేశాడూ అనిందంట.

పాలేరూ పాలేరూ ఎందుకు విప్పావూ? అంటే బాబు ఏడవలేదు అన్నాడంటా.

బాబూ బాబూ ఏందుకు ఏడవలేదురా? అంటే చీమ నన్ను కుట్టలేదుగా అన్నాడంట.

చీమా చీమా ఏందుకు కుట్టలేదూ?అంటే

నేనూ సమైక్యాంద్ర ఉద్యమంలో ఉన్నాగా, అందుకే నా పనులకు తీరికలేదు అనిందంట.

నాయకులు లేకుండా ఆ డిల్లీ సర్పాలు కోసం ఈ చలి చీమల చేస్తున్న ఉద్యమానికి జిందాబాద్.

తమ్ముడూ! ఓ తమ్ముడూ!సత్యవాణి ఇన్ సేవ్ ఆంధ్ర.

“రాజకీయభేతాళం”

bhetaalam

                       పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, “రాజా, ఇంత అర్ధరాత్రి వేళ విశ్రాంతి, నిద్రా సుఖాలకు దూరమై, గుడ్ల గూబలూ ,విషసర్పాలు, ఆకలిగొన్న నక్కలూ తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వుపడుతున్న శ్రమ అర్ధహీనంగా తోస్తున్నది. నీ జీవితాశయం, ధ్యేయము ఏమిటి? గొప్ప కీర్తి సంపాదించాలనా? లేక అంతులేని సంపదా, లేక ఇంకా ఉన్నతమైన పదవా? ఎందుకంటే ఉన్నత పదవులలో ఉన్న మనిషి ఆవేశాలకూ, ఉద్వేగాలకూ లొంగకుండా సరైన నిర్ణయాలు తీసు కోగలిగినప్పుడే తన పదవికి, సమాజానికి న్యాయంచేయగలడు.
రాజుకి రాజనీతి విషయాలలో సలహాలిచ్చేందుకు మంత్రులూ, యుద్దవ్యూహాలలో తోడ్పడేటందుకు సేనాపతులూ, ఐహిక ఆధ్యాత్మిక చింతనాపరంగా కలిగే సంశయాలను తీర్చేందుకు పండితులూ ఉంటారు , నీ ఆస్థానములో అలాంటి వారికి కొదువవుండదని భావిస్తున్నాను. కాని వారి లో కొందరు ఒక్కొక్కసారి స్వార్ధం కొద్దిగాని, లేక హేతు,ఆచార విరుద్దమైన సమస్యను ఏదోవిధంగా పరిష్కరించి తృప్తి పడదామన్న తాపత్రయం కొద్దీ గానీ చిత్రమైన ఆలోచనలు చేస్తారు అలాంటివారి సలహాలు విని నిర్ణయాలు తీసుకుంటే తరువాత ఇరువైపులా న్యాయం చేయలేక  మౌనమోహనుడిలా మౌనాన్నే ఆశ్రయించక తప్పదు. నీకు ముందే హెచ్చరికగా ఉండేందుకు ఆయన కధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను,” అంటూ ఇలా చెప్పసాగాడు.

ఫాటలి పుత్రా న్ని మౌనమోహనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నకాలంలో, త్రిలింగ రాజ్యం అనే ఓ పచ్చటి సామంత రాజ్యం ఉండేది,దాన్ని కిరణకుమారుడు అనే ఉప రాజు హంసద్వీపం రాజధానిగా పాలించేవాడు.  ఫేరుకి తగ్గట్టే హంసద్వీపం అందమైన నగరంగా పేరుపొందింది. గత రాజుల ప్రత్యేక శ్రద్ద తో ఓ గొప్ప నగరంగా , మిగతా నగరాలలో ప్రత్యేకంగా నిలచి దేశవిదేశాలలో ఓ మంచి  వ్యాపార కేంద్రం గా భాసిల్లుతూ అందరికీ జీవనోపాధిగా మారి రాజధాని అని పొట్టకూటికొసం వచ్చే వారందరిని తన కడుపులో పెట్టుకొని కాపాడసాగింది.  పాలకులు మరే నగర అభివృద్ధి మీదా దృష్టి పెట్టకపోయినా ఇది తమది అనే భావనతో అక్కడ జరిగే అభివృద్ధిని అందరూ స్వాగతిస్తూ వచ్చారు., కాని కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండధనే నానుడి ఋజువు చేస్తూ, పచ్చటి పొలానికే పురుగుపడుతుందనే చందంగా పచ్చటి త్రిలింగ రాజ్యాన్ని రెండు ముక్కలు చేసి హంసద్వీప రాజధానితో కలసిన  కొంతప్రాంతాన్ని తమకు వదిలి మిగతావారు వెళ్ళిపోవాలని  లేదా తమ భిక్షతో  ఇక్కడ బతకాలని , కొందరు రాజకీయ నిరుద్యోగ గొంగళిపురుగులు చేసిన ప్రసంగాలతో ఓ వైపు రేగిన  ప్రాంతీయ విద్వేషాలలో రాను రానూ  ప్రజలూ భాగస్వాములు కాక తప్పలేదు.

ఉద్యమ నాణాన్ని ఓ వైపునుంచే చూసిన మహరాజ రాజకీయ సలహాదారులు తాత్కాలిక రాజకీయ లబ్ధితో వేసిన లెక్కలతో రెండోవైపు జరిగే దీర్ఘకాలిక నష్టము గురించి ఆలోచించకుండా, విభజన పరమైన సమన్యాయాన్ని వదిలేసి, తమకు తోచినదే న్యాయమని భావిస్తూ ఇచ్చిన సలహాతో విభజనకి పచ్చజెండా వూపేసాడు మౌనమోహనుడు .  దీనితో హంసద్వీపంతో తమ జీవితాలు ముడిపడి ఉన్న ఇతర ప్రాంత ప్రజలు, తమ భాగ స్వామ్యంతో అభివృద్దిచెందిన నగరం తమకు, తమ పిల్లలకు కాకుండా పోతుందనే క్రోధాగ్నితో దహించుకు పోయి నిరసనలతో, తమ ఆగ్రహాన్ని పాలకులకు రుచి చూపిస్తూ వీధిపోరాటాలు చేయసాగారు. ఇది లేశ మాత్రంగానైనా ఊహించలేని  మహారాజు  సలహాదారులు తమ తప్పుడు నిర్ణయాన్ని సమర్దించుకోలేక  ఇచ్చినమాటని వెనుకకు తీసుకోలేక అన్యాయంగా ముందుకి పోలేక   అవస్థలు పడుతున్నారు.  అందుకే రాజా,  ఉన్నత పదవిలో ఉన్నవారు తాత్కాలిక ప్రయోజనాలు ఆశించకూడదు, దేశం కోసం ఓ ప్రాంతాన్ని, ఓ ప్రాంతం కోసం ఓ ఊరుని,  ఓ ఊరు కోసం ఓ ఇంటిని , ఓ ఇంటికోసం ఓ మనిషిని  బలి చేయొచ్చు అని పెద్దలన్నారు , కాని ఇక్కడ ఓ మనిషి కోసం ఓ ప్రాంతాన్ని బలి చేసిన రాజు నిర్ణయం సరైనదేనా? అలా అని మహ రాజు స్థానంలో ఉండి ఓ ప్రాంతానికి ఇచ్చిన మాట తప్పటం న్యాయమేనా?  రాజధాని మావైపు వుంది మాకే కావాలి అనే వారిది తప్పా?, దాని అభివృద్ధిలో మా వాటానే ఎక్కువ ఇప్పుడు మాది కాదంటారా అనే వారిది తప్పా? ఇదంతా  హాస్యాస్పదంగాలేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది.

దానికి విక్రమార్కుడు, నువ్వు చెప్పినట్లు రాజనీతి సలహాలిచ్చేవారిలో స్వార్ధం ఉంటే తమ నాయకుడునో, నాయకురాలినో తృప్తి పరచటానికి ధీర్ఘకాలిక  దేశ ప్రయోజనాలు ఆలోచించక,  సలహాలిస్తే ఇలాగే తరాలు , ప్రాంతాలు నాశనమౌతాయి. అందుకే ప్రతిరాజు తన సలహాదారులను ఎంచి ఎన్నుకోవాలి. ఇటువంటి  సలహాలతో చివరకు వీరు ఎవరినీ తృప్తి పర్చలేరు వారు ఆశించిన ఫలితమూ పొందలేరు. అందరూ కలిసి అభివృద్ది చేసారు కాబట్టి ఆ ఫలం  ఒకరికే చెందదు,  అవతలి వైపు వారి సొమ్ముతొ చేస్తున్నఅభివృద్ధికి ముందు  ఎవరూ అడ్డు చెప్పక, అభివృద్ది అంతా జరగనిచ్చి  ఇప్పుడు మీది కాదు అనటం  ఒక విధంగా పంట చేతికి వచ్చిన తరువాత భాగ స్వామిని తరిమేసినట్లు , అందువల్ల అది ఖచ్చితంగా అన్యాయమే , ఈ నేలలో ఉందని ఒకరిదైపోదు. రెండోవైపు ఒప్పించి తీసుకోవలిసిందే కాని హక్కుగా కాదు. రాజుకి ఈ విధంగా మౌన భగం కలగగానే , భేతాళుడు శవం తో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

విభజనతంత్రం

kk

విష్ణుశర్మ తన” పంచతంత్ర “కధల సమాహారంలో భాగముగా చివరిరోజున తన శిష్యులకు, నాయనలార!  మీ తండ్రి సుదర్సన రాజు కోరిక ప్రకారము మీకు ఇప్పటిదాక మిత్రలాభం, మిత్ర భేదం, విగ్రహం, సంధిల గురించి విపులంగా చిన్నచిన్న కధల రూపం లో వివరించాను, ఈ చివరి రోజున అన్నిటిని గుర్తుకుతెస్తూ మీకు మరో కధ…..

పూర్వం తోనియా అనే ఓ సింహం అర్భకుడిగా ఉన్న తన కుమారుడిని  అడివికి ఎలా రాజును చేయ ప్రయత్నించిందో  ఈ తంత్రాలనన్నిటిని ఎలా సమయానుకూలంగా ఉపయోగించుకుని తన ఉత్తరకుమారుడికి రాజబాట  వేయాలని ఎలా ప్రయత్నించిందో  ఈ రోజున మీకు ఓసారి చెబుతాను సావధానంగా వినండి.

దక్షిణ దేశంలో అక్షపతి నే పట్టణంలో వర్ధమానుడు అనే వర్తకుడు ఉండేవాడు, విదేశి వర్తకం చేసి ధనం సంపాదించుకోవాలని తలచి ఓ మంచిరోజున తన పరివారంతో బయలుదేరాడు.  సుదుర్గమనే పర్వతానికి సమీపంలో తోనియా అనే మృగరాణి పరిపాలిస్తున్న అడవి దారిలో వెళుతుండగా ఇంద్రబాబు అనే ఎద్దు బండి లాగలేక కాలుజారి కిందపడిపోయింది.  వర్ధమానుడు దానిపై జాలిపడి దానిని ఆ అడవిలోనే వదిలి తన ప్రయాణాన్ని కొనసాగించాడు.  తన మిత్రుడైన ఇంద్రబాబుని వదలలేక తప్పని సరై వాజశేఖరుడు అనే మరో ఎద్దు చెసేదేమిలేక తన యజమనితో సాగిపోయింది. అలా అడవిలోనే ఉండిపోయిన ఇంద్రబాబు నిదానంగా కోలుకుని, అడవిలో దొరికే పచ్చిక తింటూ, చల్లని నీళ్ళు తాగుతూ, కొద్ది రోజులలోనే బాగా బలిష్టంగా తయారై క్రమంగా ఆ అడవిలో మిగతా జంతువుల మీద పట్టు సంపాదించి ఆ ప్రాంతాన్ని తన కనుసన్నలలో ఉంచుకోగలిగింది.

ఆలా ఓ రోజున బాగా తిని ఇంద్రబాబు ఆనందముతో పెద్దాగా రంకె వేయగా. ఆ రంకె విన్న తోనియా నిర్ఘాంతపోయి తనకన్నా ఎవరో బలశాలి తనమీదకి యుద్దాని కొస్తున్నాడని బ్రమపడి, ఇతని వలన తన కుమారుడు కి రావలసిన జంతు మద్దతు ఆగిపోతుందేమోనని భయపడి తన అనుంగు బంటులైన దిగ్విజయుడు,ఆజాదులనే నక్కలను సంధికి పంపగా కుతంత్రాలలో పండిపోయిన ఆ నక్కలు రెండూ బలిష్టంగా ఉన్న ఇంద్రబాబుని  చూసి భయపడి వచ్చి తోనియాకి విషయం చెప్పాయి.  అంతగా ఆలోచించలేని తోనియా తన ఆప్తుడైన గిహమదు పటేలుడు అనే పావురాన్ని పిలచి సలహా అడుగగా,  విషయము తెలిసిన గిహమదు పటేలుడు, ఇంద్రబాబు ని  ఎదిరించ ఇప్పుడు సాధ్యము కాదని, తనకి ఆ ప్రాంత జంతువుల బలం చాలా వుందని తను అక్కడ నాయకుడిగా మారి దేశ విదేశాలలో అందరి మన్ననలు పొందుతున్నాడని, తనతో ఇప్పుడు శత్రుత్వము వద్దని అయినా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, నిదానంగా తనకి సరైన నాయకుడిని అక్కడకు పంపి  పోటీ నాయకుడిని తయారు చేయడమె అసలైన రాజనీతంటూ నచ్చచెప్పగా, రాజతంత్రంలో భాగంగా చేసేదేమిలేక ఇంద్రబాబుని ఆ ప్రాంత మంత్రిగా గుర్తించింది తోనియా.

తోనియాకి నచ్చచెప్పి తీవ్రంగా ఆలోచించిన గిహమదు పటేలుడు ఇంద్రబాబుకి సరియైన పోటి ఒకప్పటి మిత్రుడు ,జోడెద్దు, సమకాలికుడు అయిన  వాజశేఖరుడే అని తలచి తనని ఆ ప్రాంతానికి రాజుగా చేస్తానని నచ్చచెప్పి రంగప్రవేశం చేపించాడు.. స్వతహాగా నాయకత్వ లక్షణాలుగల వాజశేఖరుడు అనతికాలములోనే జంతు మన్నన పొంది  ఇంద్రబాబు సుదీర్గ పరిపాలనలొ వస్తున్న జంతు వ్యతిరేకతను అందుకుంటూ అడవంతా పాదయాత్ర చేసి ఇంద్రబాబుని ఎదిరించి  అ ప్రాంతంలో ఓ బలమైన నాయకుడిగా నిరూపించుకుని విజయగర్వముతో  ఓ రోజు ఇంద్రబాబుకన్నా పెద్దగా రంకె వేశాడు. నదిలో నీళ్ళు తాగడానికి వెళుతూ ఆ రంకె విని తనకు స్వతహగా ఉన్న భయంతో వణుకుతున్న తోనియాని చూసి మహారాణి భయ పడకండి ఇది మన గిహమదు పటేలుడు ప్రవేశపెట్టిన వాజశేఖరుడు అరుపు తను ఇంద్రబాబుని ఓడించి ఆప్రాంతంలో పట్టు తెచ్చుకుని విజయ గర్వముతో అరచిన అరుపులా ఉంది అదే నిజమయితే అతనిని తీసుకునివచ్చి మీకు పరిచయం చేస్తాము ,అంటూ వాజశేఖరుడు దగ్గరకు బయలు దేరాయి దిగ్విజయ,ఆజాదులు . వారి ద్వరా  విషయం తెలుసుకుని మిక్కిలి సంతసించిన వాజశేఖరుడు వెంటనే బయలుదేరి తోనియాని దర్శించుకుని తన విశ్వాసాన్ని ప్రదర్శించుకున్నాడు. అతని వినయాన్ని మెచ్చిన తోనియా  అతని వలన తన కుమారుని మద్దతు పెరుగుతుందని భావించి గిహమదు పటేలుడు సలహా తో వెంటనే తనని ఆ ప్రాంతపు మంత్రిగా ప్రకటించి మిత్రుడి స్థానమిచ్చింది తోనియా.

క్రమంగా వారిద్దరి స్నేహం పెరిగి దినదినాభివృద్ది కాసాగింది. సహజంగానే దాన్ని సహించలేని దిగ్విజయ,ఆజాదులు ఎలాగైనా వీరిద్దరి స్నేహాన్ని విడదీయాలని తలచి అదును కోసం చూడసాగాయి.  ఒ రోజు దిగ్విజయుడు ఆజాదుతో మనము ఇప్పుడు ఎమిచేయాలి?  తోనియా దగ్గర, మన ప్రాధాన్యత తగ్గిపోయింది, ప్రతిదానికి ఆ వాజశేఖరుడు మీదే మన రాణి అధారపడుతున్నారు, ఇలాగైతే మనకిక్కడ కొద్దిరొజులలో తిండే దొరకదు అని విచారముతో అనగా దిగ్విజయా!  పూర్వం తోనియాని సేవించిన కాటక, పాటకులనే రెండు నక్కలను కోపం వచ్చితోనియా, బయటకు పంపించింది, అవి ఇప్పుడు వాజశేఖరుడుని అనుసరిస్తున్నాయి, దానిని అదునుగా తీసుకుని ఎలాగైన, తోనియాని, వాజశేఖరుడుని విడగొడుతాను అన్నాడు స్థిరంగా  ఆజాదు.  ఆ మాటలు విని మిక్కిలి సంతసించిన దిగ్విజయుడు మంచిది జాగ్రత్తగా పని చేసుకునిరా అంటూ సాగనంపాడు ఆజాదుని.. ఆజాదుడు వెంటనే తోనియా దగ్గరకు వెళ్ళి సమయము చూచి మహారాణి మీ మిత్రుడైన వాజశేఖరుడు మునిపటిలా లేడు,, కాటక, పాటకులతో కలిసి మిమ్మలిని చంపి తను ఈ అడవికి మహరాజు కావాలని కుట్రలు పన్నుతున్నాడు అని చెప్పగా  తోనియా ముందు  నమ్మక, ఆ తరువాత నక్కలరాజుని పిలచి విచారించింది, నక్కల రాజు మహారాణీ , నా నోటితో ఏమని చెప్పను అనగా నిజమే  అని నమ్మి ఆజాదుడితో  సరే నీవు  పోయి తనని రమ్మని మా మాటగా చెప్పు అని ఆజ్ఞాపించింది తోనియా.

ఇదే అదునుగా ఆజాదు వాజశేఖరుడు దగ్గరకు వెళ్ళి,  నువ్వు మంత్రి వైనప్పటి నుండి మన తోనియా నిన్ను చంపి తినాలని  ఉంది అని ఉన్నవి లేనివి కల్పించి చెప్పగా ఆగ్రహించిన వాజశేఖరుడు కోపముతో రంకెలేస్తూ వెళుతుండగా ఊహించని విధముగా  మార్గమద్యములో అడవిలో రేగిన కార్చిచ్చుతొ అకాల మరణం పొందాడు.

ఇక తన వారిలో  బలహీనుడైన దోశయ్య ని మంత్రిగా పెట్టి పరిపాలనచేయాలని తలచిన తోనియా  ఊహించని విధముగా వాజశేఖరుడు కుమారుడైన గగనుడి రూపంలో మళ్ళి సవాలు ఎదురైంది. తనో గొప్ప నాయకుడి గా ఊహించుకుని మంత్రిపదవి ఆశించి భంగపడిన  గగనుడు తన తండ్రి అకాల మరణం తో వచ్చిన సానుభూతిని వాడుకుని ఎలాగైనా గద్దెనెక్కి తన ఆస్తులను కాపాడుకోవాలని మంత్రాంగం నడుపుతూ అటు ఇంద్రబాబుకి, ఇటు తోనియాకి సవాలు విసరసాగాడు.

ఈ తలనెప్పిని భరించలేని తోనియా గిహమదు పటేలుడు సలహా కోరగా మహారాణీ, పూర్వం నా సలహా వినకుండా మాతోటి పావురాలు నూకలకు ఆశపడి  వెళ్ళి వలలో చిక్కుకుని చావు తప్పి కన్ను లొట్టపొయినట్లుగా చివరకు  మిత్రుడైన ఎలుక సహాయంతో  బయటపడ్డాయి. మీ మనసు తెలిసి ఈ  గగనుడు  పై ఓ కన్ను వేసి ఉంచాను, అత్యాశ పరుడైన  ఇతను ఇప్పటికే మన నూకలుతిని వలలో చిక్కుకుని గిజ గిజా కొట్టుకుంటున్నాడు. మీరు  ఇక  మన యువరాజుకి అతని మద్దతు కోసం పెద్దగా ఆలోచించనవసరములేదు తను ఎప్పుడైనా మనవైపు వస్తాడు అంటూ మహారాణి వైపు తలెత్తి చూశాడు .  అయినా తన వంక అపనమ్మకంగా చూస్తున్న మహారాణి తో గిహమదు పటేలుడు మహారాణీ ఇందాక చెప్పినట్లు ఆశకు అంతులేదు, పూర్వం ఓ పులి తనదగ్గర ఓ బంగారు కంకణం పెట్టుకుని ఎంతో మంది బాటసారులని ఆకర్షించించి తన ఆకలి తీర్చుకుంది, తనకి అవసరమైన అలాంటి  కంకణాలు మన దగ్గర చాలా ఉన్నాయి, ఇప్పటికే అటు పక్కనుంచి రాయబేరాలు మొదలైనాయి కాబట్టి దిగులులేదు, ఎటొచ్చి ఇంద్రబాబు మళ్ళి బలపడుతున్నాడని మన హంసవేగుల సమాచారం అని గిహమదు పటేలుడు చెప్పగా, మరి ఇప్పుడెలా అని తోనియా  విచారపడుతుండగా  మీరు భయపడకండి మహారాణీ, అడవి పెద్దది కాబట్టి ఇన్ని సమస్యలు  మనము  ఇంతకుముందు పెట్టి ఉన్న ప్రాంతియ చిచ్చు  ఇప్పుడు మంటలుగామారి అడవిని దహిస్తుంది ఇదే సరైన సమయము అడవిని రెండుగా చీల్చి మీ జన్మదిన కానుకగా రెండు వైపులవారికి బహుకరిద్దాం, అందరూ ఆనందముతో మన యువరాజు పట్టభిషెకానికి సహకరిస్తారు. ఇక అడవి రెండు ప్రాంతాలైతే రెండు ప్రాంతాలకు చెందిన ఇంద్రబాబు ఎవరికి వంతు పాడలేక తను కనుమరుగవుతాడు అని  గిహమదు పటేలుడు  అనగా మరి తరువాత ఆ కార్చిచ్చును మనము ఆపగలమా అని తోనియా అనుమానంగా పలుకగా  ,మహారాణీ మీ అనుమానం నివృత్తి చేయటానికి ఓ చిన్న కథ చెబుతాను  పూర్వం వింధ్యారణ్యం లో ఓ చెట్టు వుండేది , దాని తొర్రలో ఓ పిట్ట నివశిస్తుండేది, ఓ రోజు వర్షం కురవడముతో సకాలంలో తన గూటికి చేరలేకపోయిందాపిట్ట.  ఆ రాత్రి ఆ తొర్రలో ఓ కుందేలు కునుకుతీసింది, చీకటిలో ఎలాగో అలశ్యంగా వచ్చిన ఆ పిట్ట ఆ కుందేలుతో తగువేసుకుని న్యాయం కోసం ఓ పిల్లి దగ్గరకు వెళ్ళాయి అమయకంగా. పిల్లి వాటికి మర్యాదలు చేసి వచ్చిన పని అడుగగా పక్షి, కుందేలు తమ సమస్యను వివరించాయి, అప్పుడా పిల్లి నాయనా నేను ముసలి వాడినైపోయాను దగ్గరగా వచ్చి నా చెవులో చెప్పండి,  అనగా అవి దానిని గ్రుడ్డిగా నమ్మి దగ్గరకు పోగా పిల్లి  రెంటిని పట్టుకుని  తినేసింది. అలాగే మనమూ ఇద్దరిని నమ్మిద్దాం తరువాత మన యువరాజుని మహరాజుని చేద్దాము అని  గిహమదు పటేలుడు  పలుకగా తోనియా  త్రుప్తిగా తలాడించింది తన కనులముందు తన కుమారుడి పట్టభిషేకము కనిపిస్తుండగా…

అంతలో తోనియా ఆనందపు ఆలోచనలను భంగపరుస్తూ ఇంటిలోనుంచి  ఏడుపు వినిపించింది పెద్దగా…..  ,  ఎవరదని  తోనియా  గద్దించగా పక్కనుంచి దిగ్విజయ,ఆజాదులు బయటకు వచ్చి మహారాణీ! మన యువరాజ వారు బడికి పోనని పెద్దగా ఎడుస్తూ మారాం చేస్తున్నాడు , ఆడుకోడానికి  బొమ్మలు కావాలంట.

అది విన్న తోనియా హతవిధి అంటూ  తన పంజాతో తల బాదుకుంది, ఇదంతా ఎవరికోసం?  అనుకుంటూ.

సహజీవనపు లింకు పోస్టులు

“తల్లీ! భిక్షాందేహీ!”          అమ్మ…కోర్ కమిటీ…ఓ సూపర్ కంప్యూటర్.