Archive for February 19th, 2008

“తల్లీ! భిక్షాందేహీ!”

images (3)

“తల్లీ! భిక్షాందేహీ!” ఓ ఇంటిముందు నిలుచొని దీనంగా అరిచాను. కొద్దిసేపటికి ఓ నడివయసు ఉన్న ఆవిడ చేతిలో బియ్యపు పాత్రతో బయటకువచ్చింది. ఆమె ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతూంది, నుదుటన సింధూరం తనకు మరింత శోభనిచ్చింది. …ముక్కు మాత్రం కోటేరుగా ఉంది  ఎవరిముక్కునో గురుతుకు తెస్తున్నట్లుగా

.“తల్లీ బిక్షాందేహీ!” మళ్ళీ అడిగాను ఈ సారి కాస్త ఆర్ద్రత నిండిన గొంతుకతో. బిక్ష వేయబోయి అనుమానంతో నావంక తేరిపార చూసి అడిగింది. ” నీవు ఈ ప్రాంతానికి చెందినవాడిలా కనిపించడములేదే? నీ దేహరంగు చూస్తుంటే ఉత్తరాదివాడిగా ఉన్నావు, నిజమేనా?”

“లేదమ్మా బిక్షకుడను, ఒక ప్రాంతం వాడినని ఎలా చెప్పను? అన్ని ప్రాంతములు తిరిగినవాడిని, అయితే ఎక్కువుగా హిమాలయములు, కాశీ, హరిద్వార్ వంటి పుణ్య క్షేత్రములలో తిరిగినందువలన కాస్త దేహం రంగు మారి ఉండవచ్చు. అంతే కాని నే ఉత్తరాదివాడిని కాను తల్లీ !…. అచ్చముగా తెలుగువాడినే.” అన్నాను.

“కాని, నాకు నమ్మకము కుదురుటలేదు. నీ భాష నందు యాస అదో మాదిరిగా ఉంది. అనాదిగా ఉత్తరాదివారు మమ్ము దోచుకొనుచున్నారు. వారికి నేను బిక్ష వేయనుగాక వేయను.” అందా మహా తల్లి.

“లేదు తల్లీ ! లేదు, నేను అచ్చ తెనుగువాడినే కావలిసినన్న నే చిన్నప్పుడు చదువుకున్న వేమన పద్యం చెబుతా విను అంటూ “ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు,చూడ చూడ రుచుల జాడవేరు..పురుషులందు…”

“ఆపూ !!” అని గట్టిగా గద్దించింది. ఒక్కసారి ఉలిక్కిపడి ఆపి బిక్కముఖంతో ఆమె వంక చూశాను.

“ఐతే… నీవు రాయలసీమవాడివన్న మాట! వేమన పద్యం చెబుతున్నావు , నీకు బిక్ష వేయనుగాక వేయను.” ఉగ్రరూపం దాల్చి అంది.

“తల్లీ! వేమనకు ఒక ప్రాంతం ఏమిటి?ఆయన అందరివాడు కదా!” అని నెమ్మదిగా గొణిగి, పైకి “అమ్మా! సిరికిం చెప్పక …చెప్పబోయి పొరపాటున ఉప్పు కప్పురం చెప్పాను . నన్ను క్షమించి బిక్ష వేయి తల్లీ!” దీనంగా వే్డుకున్నాను.

“సిరికిం చెప్పక రాసింది మన పొతనవారే కదా! ఐతే చెప్పు.”

కామాలు, పులుస్టాపులుతో సహా వప్పచెప్పాను చిన్నపిల్లాడిలా..

తృప్తి పడినట్లు కనిపించింది తన ముఖం చూస్తే,

“సరే పోతన గారి పద్యం చెప్పావు కదా ఇప్పుడు నీవు తెలంగాణా వాడివే అని నమ్ముతున్నా!”

“ఐతే బిక్ష వేయి తల్లీ !” కడుపు తడుముకుంటూ అడిగాను ఆశగా..
“ఆహా!నీవు తెలంగాణా వాడివి ఐనంత మాత్రాన బిక్ష వేసేస్తానా? చెప్పు నీది సికింద్రాబాదా? లేక హైద్రాబాదా? ఎందుకంటే సికింద్రాబాద్ బాగా డెవెలప్ అయింది. అన్ని రైళ్ళు అక్కడే ఆగుతున్నాయి. ఇది సికింద్రాబాద్ వారి కుట్ర, వారికి నే బిక్ష వేయనంటే వేయను.” మళ్ళీ అడ్డంతిరిగింది.

“అమ్మా ! నాది సికింద్రాబాద్ కాదు మన హైద్రాబాదే. అమీరుపేట.” అని ఆత్రుతగా చెప్పాను.

“ఏంటీ? అమీరుపేటా…..? అనుకున్నా, ఏదో తిరకాసుంటదని ….. అట్లా చెప్పు, మీ అమీరుపేటలోనే అన్నీ షాపింగు కాంప్లెక్సులు ఉన్నాయి మా యూసఫ్ గూడా అన్యాయం అయిపోయింది. ఎవరుపట్టినా అమీర్ పేటకి పోయి కొనుక్కుంటున్నారు ఏమికావాలన్నా….మా యూసఫ్ గూడ నష్టపోతూ ఉంది. ఇక నీవు బిక్ష ఆశ వదులుకోని పోవచ్చు.” నిష్కర్షగా చెప్పింది.

“తల్లీ! తొందరపడకు. మా అమ్మగారిది యూసఫ్ గూడానే, నే పుట్టింది కూడా ఇక్కడే యూసఫ్ గూడాలో, కొద్దిగా కనికరించి బిక్షవేయి తల్లీ.”

“యూసఫ్ గూడా అంటే సరిపోతుందా ? ఏ వీధో చెప్పు. ఎందుకంటే మాపక్క వీధి లో అన్నీ సిమెంటు రోడ్డులే కాని మాకు లేవు. అందుకే మావీధి కి స్వయం ప్రతిపత్తి కోరుతున్నాం.ఉద్యమాలు చేస్తున్నాం.”

“అమ్మా! సంతోషం. నేనూ ఈ వీధి వాడినే ఆ చివరింటిలోనే నేను పుట్టాను.” పరిస్థితి అర్ఢమై నోటికి వచ్చింది చెప్పాను.

“ఐతే సరే ఇదుగో బిక్ష. తీసుకో. మరో మాట నువ్వు ఇల్లు ఇల్లూ తిరుగుతుంటావుకదా, అందరికీ మన ఉద్యమం గురించీ, మనకు జరుగుతున్న అన్యాయం గురించీ చెప్పు. మన వీధికి స్వయం ప్రతిపత్తి వచ్చి విడిపోయాక నిన్నే ఈ వీధికి  మంత్రిని చేస్తాను.” అని భిక్ష వేసింది ఆ మహాతల్లి చివరకి.

“అలాగే తల్లి! సంతోషం… కాని చివరగా నాదో చిన్న సందేహం తల్లీ! మన ఇంట్లో అదే…. తమరింట్లో ఎంతమంది ఉంటారో కాస్త చెబుతారా?” కొంచెం భయం భయం గానే అడిగాను. సెల్లు కొచ్చిన బ్రేకింగ్ న్యూస్ మెసేజ్ చూస్తూ.

“మా ఇంట్లోనా ? మా చెల్లెలు, తన పిల్లలు, మా తమ్ముడు తన బార్య, పిల్లలు, మా అమ్మగారు, నాన్నగారు, అత్తగారు, మా మామగారు మొత్తం పిల్లలతో కలిపి సుమారు గా ఓ ఇరవై మంది దాకా ఉండొచ్చు. ఉమ్మడి కుటుంబం కదా … మే మందరమూ కలిసే ఉంటాము.” కాస్త గర్వం ఒలకబోస్తూ చెప్పి “అసలెందుకుకు నీకు ఇవి అన్నీ?”అని అడిగింది కాస్త అనుమానంగా చూస్తూ.

“ఆ….. ఏం లేదులే అమ్మా ! మన స్టేట్ విడిపోయిందని ఇప్పుడే మెసేజ్ వచ్చింది …….మరి మీ రెప్పుడు విడిపోతున్నారో ? తెలుసుకుందామని…” అనేసి..ఇక్కడే ఉంటే నాదిష్టి బొమ్మ కాల్చేస్తారేమోనని భయంతో… పరుగులంకించుకున్నా వెనక్కు తిరిగి చూడకుండా మా అమీర్ పేటవైపు.