Archive for the ‘ అనగనగా ….. ’ Category

పెద్దలకు మాత్రమే

“బాబాయ్! షాలిమర్లో కొత్త సినిమా వచ్చింది, పోస్టర్ అదిరింది” అని సత్తిగాడు రూములోకి ఎంటరవుతూనే నవ్వతా అనటంతో నోరూరిపోయింది అందరికీ. (పదేళ్ళక్రితం బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు మేము ఒకరినొకరం బాబాయ్ అని పిలుచుకోవటం అలవాటు). బియ్యమేరుతున్న చారిగాడు, లెక్కలేసుకుంటున్న రమణగాడు నేనూ ఒకళ్ళ మొహాలొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నాం. షాలిమర్లో సినిమా అంటే అహ్మదాబాదులో అందరికీ తెలుసు. అందులో ఎక్కువగా పేరెప్పుడూ వినని ఇంగ్లీషు సినిమాలూ… కొన్ని సెలెక్టెడ్ హిందీ సినిమాలు మాత్రమే ఆడేవి. మా రూము నుండి నడిచి వెళితే మహా అయితే పదినిమిషాలు పడుతుంది ఆ సినిమా హాలుకి. “మీరు తినేసి మా రూము వైపు రండి మేమూ ఇంకా వండుకోలా” అనేసి సత్తిగాడు బయట చీకట్లో కలిసిపోయాడు. పుస్తకాలు పక్కన పడేసిన రవణ, నేను చారితో ఇలా అన్నాం “ఒరే ఏదన్నా పనుంటే చెప్పు…తొందరగా అయిపోద్ది గదా” అని. వాడెలాంటి వాడంటే, వాడి జీతాన్ని వేరే ఎవరన్నా తీసుకుని ఖర్చు పెట్టుకున్నా ఊరుకుంటాడేమో గాని, వాడు వంట చేస్తుంటే మాత్రం చచ్చినా వేరొకర్ని వేలు పెట్టనివ్వడు. ఇప్పుడూ అలాగే విసుక్కున్నాడు. “ఏందిబే…అంత తొందర? సినిమా ఏడికిబోద్ది? పదిగంట్ల సినిమాకి గింత జల్దీగెళ్ళి కూసోమంటావా?” అనేసి బియ్యంలో రాయిలా తీసిపారేసేడు. రవణకీ నాకూ ఏమీ తోచలా టైము చూస్తే ఎనిమిది గూడా కాలా. ఇక చారి గాడు వేసే తిరగమూత శబ్ధాలనీ, కుక్కరు విజిళ్ళనీ వింటా ఉండిపోయాము.

రాయలసీమకి చెందిన రవణ మా అందరిలోకీ వయసులోనే కాక పొడవులో కూడా చిన్నవాడు. నూనూగు మీసాలతో, గింగిరాల జుట్టుతో, మెరిసే బుగ్గలతో, నవ్వే కళ్ళతో అమాయకంగా (ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు) ఉండే వాడంటే మాకందరికీ ప్రత్యేకమైన అభిమానం. నువ్వు పిల్లోడివి లేరా అని ఎవరైనా అంటే, ఎంతో ఉక్రోషపడి ఆ వచ్చీరాని మీసాలనే మెలేసేవాడు. రమణ తల్లీదండ్రీ కూలికెళ్ళే వాళ్ళు. తమ్ముడికి పోలియో, అక్క క్షయ వ్యాధితో చనిపోయింది. ఇలా సినిమా కష్టాలతో వేగుతూనే B.Sc. Mathematics ఫస్ట్ క్లాస్ లో పాసైన రవణ ఏ లెక్కనైనా డీప్ గా అనలైజ్ చేసి దాని సూత్రాన్ని లాగి పీకి పాకాన పెట్టేదాకా వదిలిపెట్టడు. నా దృష్టిలో వాడో మేధావి. ఇక చారి తెలంగాణ వాడు. కాలేజి చదువులప్పుడు కార్పెంటరు పని చేసుకుని కష్టపడి చదివి ఒక దారికొచ్చిన వాడు. పొడుగ్గా కాస్త నల్లగా ఉండే వీడు వంటలు చాలా బాగా చేస్తాడు. (నేను కోస్తా వాడిని. మేము ముగ్గురం రూంమేట్స్ భలే ఉంది కదూ)

“వాడు వంటయిపోయిందిరో!” అని కేక పెట్టగానే, గబగబ గిన్నెలన్నీ తెచ్చి ఫాను కింద బెట్టి తినేసరికి తొమ్మిదిన్నరయింది. ఫాంట్లు తొడుక్కుని సత్తిగాడి రూము వైపు వెళ్ళి వాళ్ళనీ కలుపుకుని మొత్తం ఐదుగురుం సినిమా హాలుకి వెళ్ళాం. అక్కడ ఈగలు దోలుకుంటా ఉన్నారు. “ఏందిరా సత్తిగా! పోస్టరు మంచిగున్నదని చెప్పినావుగదబే…గీడేంది చూడబోతే ఎవర్లేరు…మంచిగలేకుంటే డబ్బులు నువ్వే ఇయ్యాల బిడ్డా!” అని బెదరగొట్టాడు చారిగాడు. సినిమా టికెట్లు ఎవరో ఒకరు తెచ్చి, తరువాత తీరిగ్గా ఎంతైందో చెబితే అందరూ డబ్బులు తీసిచ్చేది మాకలవాటు. బాగా హుషారు మీదున్నాడేమో రవణగాడు “నేను తెస్తా టికెట్లు!” అని కేకేసి డిక్లేర్ చేసేడు. సరే “తా” అన్నాం అందరం. అనేసి ఓ పక్కగా కూచుని మాటాడుకుంటా ఉన్నాం. ఇంతలో బిక్కమొహమేసుకుని చేతులూపుకుంటా తిరిగి వచ్చాడు రవణ. వాడిని చూసి అందరం బిత్తరబోయాం. ఈడ చూస్తే మనుషులే లేరు, అప్పుడే టికట్లు అయిపోయాయా అని ఆశ్చర్యబోయాం. “ఏందిరా సంగతి?” అనడిగాం వాడిని ఆత్రంగా. వాడు మా మొహాలవంక చూడటానికి ఇష్టపడక “ఆ నా కొడుకు టికట్లు ఈనన్నాడురా!” అన్నాడు. మాకేం అర్ధంగాలా. “ఈనన్నాడా? ఏందంట ఇంకా టైము గాలేదా ఏంది?” అనడిగాం వాడిని. వాడు “అదేం కాదు…. ఇది ఇంగ్లీషు సినిమా, పెద్దోళ్ళకు మాత్రమే టికట్లిస్తాం, పిలకాయలకీయం అని చెప్పేడు…. నేనుద్యోగం జేస్తున్నానురా, నా వయసు పాతికేళ్ళు అని చెప్పినా ఇనలా.” అని డిప్రెస్ అయిపోయాడు. మాకెవరికీ నవ్వాగలా. అయినా వాడు బాధపడతాడని ఒకరి మొహాలొకరం చూసుకోకుండా నవ్వాపుకుంటా తంటాలు పడతా ఉంటే సత్తిగాడెల్లి టికెట్లు తెచ్చాడు క్కిక్కిక్కీ మని నవ్వతా. ఇక ఆపుకోలేకపోయాం నవ్వులు. “ఈ సినిమాలో ఏముందో నవ్వుకోవటానికి?” అని చుట్టూతా వాళ్ళనుకుంటా ఉన్నా మేము కడుపులు పట్టుకుని నవ్వుకుంటూనే ఉన్నామా రాత్రి. “బియ్యెస్సీ మాథమేటిక్స్ చదివేసి, స్టాఫ్ సెలక్షన్ లో ఉద్యోగం సంపాదించిన నన్ను పట్టుకుని పిల్లోడ్నని, టిక్కట్లివ్వనంటాడా?” అని వాడు గొణగతానే ఉండినాడు సినిమా అంతా.

మిత్రుడు గుడిపాటి వెంకట రమణ (లేటెస్ట్ ఫోటో)

ముగింపు:

ముస్లిం ఏరియా మధ్యలో ఉన్న ఆ సినిమా హాలుకి, ఆ రోజుల్లో ఎంతో అమాయకంగా వెళ్ళే వాళ్ళం. కాని ఆ తరువాత ఆ ఏరియాలో లెక్కలేనన్ని కత్తిపోట్ల సంఘటనలు, హత్యలు, సజీవదహనాలు జరిగాయి. ఈ రోజు ఆ థియేటర్ కి వెళ్ళే ధైర్యం మాలో ఎవరికీ లేదు.

ముత్యమంత ముద్దా?

మామిడాకులకు విడాకులు

పండగ పూట విడాకులేంటి వీడి మొహం అనుకుంటున్నారా? కాస్త ఆగండి. అహ్మదాబాద్ కి వచ్చిన కొత్తల్లో బయటకి అడుగుబెడితే అన్నీ గుడ్లప్పగించి చూడటం తప్ప ఇంకేమీ చేయలేకపోయే వాళ్ళం. ఎక్కడ సైన్ బోర్డ్ లు చూసినా గుజరాతీలోనే, బస్సు పేర్లూ, నంబర్లూ గుజరాతీలోనే. ఎవడ్ని కదిలించినా హిందీలోనో లేకపోతే గుజరాతీలోనే జవాబు చెప్పేవాళ్ళు, వాళ్ళు నమిలే పాన్ మసాలా తుంపర్లతో మమ్మల్ని తడిపేసి. గుజరాతీ అక్షరాలు కాస్త హిందీని పోలి ఉండటం వల్ల కష్టపడి కొన్ని అర్ధం చేసుకోగలిగే వాళ్ళం. కాని ఆ నంబర్లు మాత్రం మమ్మల్ని గిజగిజలాడించేశాయి. సిటీ బస్సుల నంబర్లు గాని, పేర్లు గాని గుజరాతీలోనే ఉండేవి. ఆ అక్షరాలు కూడబలుక్కుని చదివేలోపు బస్సు వెళ్ళి పోయేది.ఇక లాభంలేదని, నంబర్లు తెలుసుకోవటానికి ఒక అయిడియా కనిపెట్టాం. బస్సు టిక్కెట్ మీద 1 నుంచి 9 వరకు గుజరాతీ నంబర్లు ఉంటాయి కదా (మన RTC వారి టికెట్ అయినా నంబర్లు ఉంటాయి) దాన్ని చేతిలో పట్టుకుని కంపేర్ చేసుకునే వాళ్ళం. అప్పటినుంచి జేబులో ఒక టికెట్ ముక్క పెట్టుకుని తిరిగాం కొన్నాళ్ళు డిక్షనరీ లాగ.

మేము ముగ్గురం రూంమేట్స్ ఉండే వాళ్ళం. అందరం తెలుగు వాళ్ళమే. ఒకే సారి జాయిన్ అవటం వల్ల, ఒకే వయస్సు వాళ్ళం అవటం వల్ల ఫ్రెండ్లీ గా ఉండేవాళ్ళం. ముఖ్యమైన ఇంటిపనిని మొత్తం ఆరు పనులుగా విభజించాం. ఉదయాన్నే మంచి నీళ్ళు పట్టటం, అంట్లు తోమటం, అన్నం, కూర,మళ్ళీ సాయంత్రం అన్నం , కూర. వీటిలో తలా రెండు పనులు చేయాలనమాట. నెలకొకరం కూరగాయలు తేవాలని నిర్ణయించుకున్నాం. అలా నేను మార్కెట్ కెళ్ళి కూరగాయలు తేవాల్సిన రోజు రానే వచ్చింది. వంకాయలని వంకాయలంటారు, బెండకాయలని బెండకాయలంటారని తెలుసుగాని వాటిని వీళ్ళేమంటారో తెలీదు. అయితే దానివల్ల పెద్ద సమస్య రాలేదు, వాటిని చూపిస్తే చాలు కదా అమ్మే అతనికి. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎన్ని కావాలో అడిగినప్పుడే. బుర్ర పాదరసంలా పనిచేసింది, అక్కడ కూడా అదే టెక్నిక్ ఉపయోగించి అరకేజి రాయి తీసి తక్కెడలో వేశాను, కొన్నింటికి పావుకిలో రాళ్ళు వేసి ఆ పూటకి తప్పించుకున్నాను. ఈ సమస్య మిగిలిన వాళ్లందరికీ వచ్చి ఉండటం వల్ల అందరం సరదాగా నవ్వుకున్నాం. అయితే నాకు ఏడుపుతెప్పించిన సంఘటన ఒకటి జరిగింది ఒకసారి. కొన్న కూరగాయలయిపోగానే మళ్ళీ మార్కెట్ కి వెళ్ళవలసి వచ్చింది. ఈ సారి ముందు జాగ్రత్తగా ఇంటి ఓనరమ్మనడిగాను, “పావుకిలోని ఏమంటారు ఇక్కడ?” అని “పావుకిలోని అడీ సౌ, అరకిలోని ఆదాకిలో అంటారని” చెప్పింది నవ్వుతూ. సరే వాటినే మననం చేసుకుంటూ వెళ్ళాను ధైర్యంగా. వంకాయలోడి దగ్గరకి వెళ్ళాను ట్రైల్ వేద్దామని. అప్పటికి వంకాయల నేమంటారో ఇంకా తెలీదు నాకు. వాటిని చూపించాను, ఇవి కావాలన్నట్లు. “ఎన్ని కావాలి?” అని అడిగాడు. నేను ఓనరమ్మ చెప్పిందే మననం చేసుకున్నాను. దాన్ని తెలుగుకి అన్వయించి ఒక వెధవ లాజిక్ మనసులో పెట్టుకున్నాను. తెలుగులో అరకిలోని వీళ్ళు ఆదాకిలో అంటున్నారు కదా అలాగే మన పావు కిలోని ఆంటీ చెప్పిన అడీసౌ ని మార్చి, “అడీసౌకిలో కావాలి” అన్నాను వాడితో. అతను మామూలుగా తూయటానికి తక్కెడ నెత్తి , అదిరిపడ్డాడు. ఏమిటీ!! అడీసౌ కిలో కావాలా? ఈ పూర్తి మార్కెట్ లో ఉన్న అన్ని వంకాయలని తూసినా అన్ని వంకాయలుండవు” అని తక్కెడ వదిలేశాడు. ఇదేం ఖర్మరా భగవంతుడా అనుకుని వాడికా రెండు తూనిక రాళ్ళు చూపించి వాడిచ్చిన నాలుగయిదు వంకాయలు తీసుకుని, వాడి మొహం చూడబుద్ది గాక బతుకు జీవుడా అనుకుని గుంపులో కలిసిపోయాను. అడీసౌ అంటే 250 అనీ, అడీసౌకిలో అంటే 250 కిలోలని ఇంటికొచ్చిన తరువాత తెలిసి నా మొహం కందగడ్డ లాగా మారిపోయింది.

సరే ఈ చిన్న చిన్న అవమానాలకేమీ లెక్క లేదు గాని, అసలు అది అవమానమో? లేక అమాయకత్వమో? తెలీని ఓ విచిత్ర సంఘటన మేమిక్కడ అడుగిడిగిన తరువాత వచ్చిన మొట్టమొదటి ఉగాది రోజు జరిగింది. ఇప్పటికీ దానికి నవ్వాలో ఏడవాలో తీలీదు నాకు. గుజరాతీయులు పండుగలను చాలా వినూత్నంగా, ఆనందంగా, మనఃస్పూర్తిగా జరుపుకుంటారు. అందులో లీనమైపోతారు. దసరా నవరాత్రులలో గర్భ నృత్యాలే దానికి నిదర్శనం. ఆసమయంలో డాన్స్ చేయని గుజరాతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. భార్యా భర్తలు కలిసి అడుగులో అడుగేసుకుంటూ పబ్లిక్ గా నృత్యం చేయటం మన వైపు ఊహించగలమా. అసలు డాన్స్ చేయటమంటేనే సిగ్గు పడతాము. వీళ్ళింతగా సక్సెస్ అవటానికి వీరి సంప్రదాయాలే చాలావరకు దోహదపడుతున్నాయని అనిపిస్తుంది. సరే అసలు విషయానికొస్తే ఇలా ఒక్కో పండగ దాటు కుంటూ ఉంటే ఒక విషయాన్ని గమనించాం. వీళ్ళు మంగళ తోరణాలుగా మామిడాకులు వాడటం లేదు, అశోక ఆకులు వాడుతున్నారు. రెండూ ఇంచుమించు ఒకేలా ఉంటాయి కదా. పిచ్చోళ్ళు, వీళ్ళకి మామిడి చెట్లు లేక ఇవి వాడుతున్నారనుకున్నాము మొదట్లో. కాని అవి వారికి చాలా పవిత్రమైన ఆకులని తరువాత అర్ధమైంది. మనం పండుగలప్పుడు మామిడాకులని ఎలా పవిత్రంగా భావిస్తామో వీరు అశోక (ఆశోపాలవ్) ఆకులని అంతే పవిత్రం గా పూజిస్తారు. అన్ని రకాల పూజల్లోనూ ఇవే వాడుతున్నారు. అయితేనేమి వీరు గుజరాతీయులు, మనం ఆంధ్రులం. మనం మన మామిడాకులే కట్టుకుందాం అని మేం నిర్ణయించుకున్నాం. అయితే అవి ఎక్కడ దొరుకుతాయి? వెతికీ వెతికీ ఒక చెట్టుని పట్టాం (ఈ పదేళ్ళలో నేను కేవలం మూడు మామిడి చెట్లను మాత్రమే చూశాను అహ్మదాబాద్ లో).

ఉగాది ఉదయాన్నే తలస్నానం చేసి, శుచిగా కొన్ని ఆకులు గ్రుచ్చి వాటిని తోరణం గా కట్టాం. మాలో ఒకడు ఉగాది పచ్చడి చేయటం లో మునిగిపోయాడు (యాక్! మీకు చేయటం రాకపోతే ఊరుకోవచ్చుకదా! అని చివాట్లు పెట్టారు అది తిన్న గుజరాతీయులు తరువాత). ఇంతలో వాకిట్లో ఏదో శబ్ధం, ఏవో తెగిపోతున్నట్లు ఫట్ మని, ఆకులు రాసుకున్నట్లు. వెంటనే బయటికొచ్చి చూశాము. మా ఇంటి ఓనరు మన మామిడాకుల తోరణాన్ని తెంపేసాడు. “ఓరి దుర్మార్గుడా!” అనుకుని “ఏమిటీ అన్యాయం?” అని ప్రశ్నించేలోపు ఓ మోపెడు ఆశోక ఆకులు తెచ్చి ఇంటి ముందు పడేశాడు. “మీకు తెలీకపోతే మమ్మల్ని అడగఖఃరలేదా? పండగపూట ఈ పిచ్చాకులు కడుతారా?” అని కిందపడి ఉన్న మామిడాకుల తోరణాన్ని చూపిస్తూ నిష్టూరమాడాడు. “ఇవిగో వీటిని కట్టుకోండి” అని అశోక ఆకుల్ని తోరణంగా కట్టిచ్చాడు. ఈయనకిట్టగాదని ఇంట్లోకి పిలిచి ఉగాది పచ్చడి పెట్టాము. అది తిని కొంచెం చల్లబడ్డాడు. ఇలా జీవితానికీ, రుచులకీ ముడిపెట్టిన మన సంప్రదాయాన్ని పొగిడి, మమ్మల్ని ఆశీర్వదించి ఈ పిచ్చాకులు మళ్ళీ ఎప్పుడూ కట్టబాకండని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆ అశోక ఆకులు తలకి తగిలినప్పుడల్లా మామిడాకులు గుండెల్లో గుచ్చినట్టుండేది. అంతే ఆ రోజునుండి మామిడాకులకీ మాకు కనక్షనే తెగిపోయింది.

ఉగాది శుభాకాంక్షలు.

లుంగీ పోయి నిక్కరు వచ్ఛే ఢాం..డాం…ఢాం.

తొమ్మిదేళ్ళ క్రితం అహ్మదాబాదుకి ఉద్యోగంలో చేరటానికి వెళ్ళేంత వరకు నన్ను నేను ఒక సెక్యులరిస్ట్ గా ఊహించుకుని గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. స్నేహితుల్లో ముస్లిములు, క్రిస్టియన్లు ఇంకా అనేక ఇతర మతాల వారుండటంతో నాలో నేనే గర్వపడేవాడిని. అయితే అహ్మదాబాదు లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే గర్వమంతా అణిగిపోయింది. దీనికంతా కారణం ఒక లుంగీ. పొట్ట బొడిస్తే హిందీ ముక్క రాని నేను ఎట్టకేలకు సిటీ అంతా తిరిగి ఆఫీసులో ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్నాను. ఉద్యోగంలో చేరేటప్పుడు నా దగ్గర ప్రతిజ్ఞ (అదో ప్రొసీజరులే) తీసుకున్నపెద్దాఫీసరు నాకు షేక్ హ్యాండిచ్చి ఒకటే మాట చెప్పాడు. “నువ్వు హిందువయితే నది (సబర్మతికి) కి పడమర వైపు ఇల్లు తీసుకో, ముస్లిం అయితే నదికి తూర్పు వైపు తీసుకో” అని. ఈ మాటలిన్నాక నేనాయన్ని ఏమనుకోవాల? ఈడి ముండ మొహాన ఎండ గాయ,ఈ ఊర్లో ఇట్ట అడుగు బెట్టామో లేదో హిందువనీ ముస్లిమనీ గొడవలు పెట్టేటట్టు ఉన్నాడు మహానుభావుడు అనుకున్నాను. బుద్ది గా ఆయనమాట ఆనాడు వినుంటే, ఎన్నో భయానక అనుభవాలు తప్పిపోయిఉండేవి. మతకలహాలప్పుడు, తిండినిద్రా కరువయ్యుండేది కాదు. చీమ చిటుక్కుమన్నా గుండె ఝల్లుమనేది కాదు. చాకు పట్టుకోవటం కూడా సరిగా రాని మాకు పెద్ద పెద్ద కత్తులు, బరిశలు ఇచ్చి, ఎవరైనా మన సొసయిటీ మీద దాడి చేస్తే అందరం కల్సి వాళ్ళతో పోరాడాల అని చెప్పిన ఇంటి ఓనరు. చీపురు కట్ట పెట్టే దగ్గర ఈ కత్తులు బరిశలు పెట్టాల్సి వచ్చింది కదరా దేవుడా అని వాటిని చూసినప్పుడల్లా, మేము ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం. ముస్లిం పేరున్న ఓ హిందు స్నేహితుడి వల్ల ఒకనాడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం. అలాగే మేము ఈ పాత బస్తీ నుండి మకాం ఎత్తేసి సబర్మతి నదికి పడమరవైపుకి మార్చినప్పుడు మమ్మల్ని వదలలేని రజాక్ అనే ముస్లిం స్నేహితుడిని రాజు అని అందరినీ నమ్మించి, రెండేళ్ళ తరువాత ఆ నిజం బయటపడి మళ్ళీ అక్కడి నుండి రాత్రికిరాత్రే మకాం ఎత్తేయటం…ఇలా ఒకటని కాదు, కాని మాలో మాకు ఎంత స్నేహమున్నా, చివరకి హిందువులం పడమరవైపు ముస్లిములు తూర్పువైపు స్థిరపడాల్సి వచ్చింది. ఇలా అనేక ఆసక్తికరమైన సంఘటనలు ఎన్ని జరిగినా, ఈ లుంగీ ఎపిసోడ్ మాత్రం జాతి వైషమ్యాల విషయంలో నాకు జరిగిన మొట్టమొదటి తమాషా అనుభవం. అది ఎలా జరిగిందంటే…

కాశీమజిలీ కథల్లో లాగ “ఓ రాజకుమారా! నువ్వే దిక్కు కయినా వెళ్ళు గాని ఆ ఉత్తరం దిక్కుకు మాత్రం వెళ్ళద్దు.” అని పేదరాశి పెద్దమ్మ చెప్పినట్టు ఆ ఆఫీసరు చెప్పింది బుద్దిగా విని పాటించక నదికి తూరుపు దిక్కున, చుట్టూ ముస్లింలు ఉండే ఓ హిందూ సొసైటీలో మిద్దె మీద గది అద్దెకు తీసుకున్నాను. ఓ పదిరోజుల్లోనే ఆయన మాటల్ల్లో వాస్తవం అర్ధమై దిమ్మదిరిగిపోయింది. ఈ పదిరోజుల్లో పరిసరాలు కాస్త పరిచయమయ్యి, ఫ్రీ గా తిరగటం , ఎవరైనా పలకరిస్తే నవ్వటం వంటివి జరగతున్నాయి (మాట్లాడాలంటే భాషరావాలిగా) . ఆంధ్రాలో ఉన్నప్పుడు లుంగీలు ఎక్కువగా కట్టేవాడిని, కనీసం అహ్మదాబాద్ వెళ్ళినతరువాత అయినా షార్ట్ లు వాడదాం అన్న కోరిక మనసులో ఉండిపోయింది. ఇదా కొత్త ప్రదేశం, అసలేపెళ్ళైన ఆడవాళ్ళు కొంగు తలపై నుండి తీయటం లేదు. ఇక అవేసుకుని తిరిగితే ఏమేమి సమస్యలు వస్తాయో అని షార్ట్ లని వాయిదా వేసి లుంగీలే వాడుతున్నాను.

అప్పటికే ఆఊరి అమ్మాయిల అందాలకి పరవశుడ్నైపోయి ఉన్నానేమో. ఓ శలవు దినాన షేవింగ్ చేసుకుని గ్లామరస్ గా తయారయి ఊరిమీద పడదామనుకుని, బ్లేడ్ కోసమని మెట్లు దిగి కిందకు వచ్చాను. మెట్లు దిగేటప్పుడు లుంగీ కాళ్ళకి అడ్డు పడుతుందని పైకి మడిచి కట్టడం అలవాటుకదా. అప్పుడు కూడా అలాగే దిగి, ఈ రోజు ఏఏ పార్కుల్లో తిరిగివద్దామా? అని అలోచించుకుంటూ సొసయిటీ బయట ఉండే ఓ షాప్ కెళ్ళి బ్లేడ్ కొని, తిరిగి సోసైటీలో అడుగు పెట్టాను. అంతే అక్కడో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. నేను ఆశ్చర్యపోయాను. బ్లేడ్ కొనటానికి వెళ్ళేటప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. ఈ పదినిమిషాల్లో ఏమైందబ్బా? అనుకుని. అహ్మదాబాద్ లో మొదటి గొడవ కదా! ఓ గోడ వారగా నుంచుని చోద్యం చూడసాగాను. మనం అక్కడ చూడగలమే గాని, ఆ గుజరాతీభాష ఒక్క ముక్క కూడా అర్ధం జేసుకోలేము కదా. నాకర్ధమైందేమిటంటే, అక్కడ రెండు గ్రూపులు గొడవాడు కుంటున్నాయి. నాకు కాస్త ముఖపరిచయం ఉన్న వాడిది మన బ్యాచ్ అనుకుంటే, ఎదుటి గ్రూప్ వాడిని ఎవరూ పట్టలేకున్నారు. ఎవరినో కొట్టడానికి పై పైకి వస్తుంటే వాడిని అందరూఆపుతున్నారు. చివరికి మన గ్రూప్ లీడర్ కూడా వాడిని శాంతింప జేస్తున్నాడు. అయితే నన్ను కలవర పెట్టిన విషయం ఏమంటే, మాటి మాటికీ నా పేరు ఆ గొడవలో వినపిస్తూ ఉండటం. అందరి చూపులూ నామీదే ఉన్నాయి. నాకాళ్ళు సన్నగా వణకసాగాయి. ఏమైఉంటుందిరా భగవంతుడా? అనుకుంటుండగా నాకు తెలిసిన గ్రూప్ లీడరు నా వైపు వచ్చాడు. ఏంది గొడవ? అని అడిగాను. “ఏందా? ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు నీ లుంగీని పైకి మడిచి ఎందుకు కట్టుకున్నావు? ఇక్కడ ముస్లిములే అట్టా కట్టుకుంటారు. నువ్వు ముస్లిమ్ వో లేక వారి మద్దతుదారుడివో అయ్యుంటావని నిన్ను కొట్టడానికి వస్తూంటే నేనాపాను. సౌత్ ఇండియన్లు అలాగే కడతారు అని అంటే వాడు వినటం లేదు. నాతోనే గొడవపెట్టుకుంటున్నాడు.” అన్నాడు పాన్ మసాలా నవులుతూ. ఇదన్న మాట విషయం. నేను వారి మధ్యకెళ్ళి సర్ధిచెప్పిమాట్లాడాలంటే మనకటు హిందీ రాదు ఇటు గుజరాతీ రాదు. మరో కొత్త గొడవని సృష్టించుకోవటం దేనికనుకుని. నా లుంగీ పైకుందా? కిందికుందా? అని ఓ సారి చూసుకున్నాను. “సరే నువ్వెళ్ళు నేను చూసుకుంటాలే, బయట మాత్రం లుంగీని ఎగకట్టకు” అని అనటంతో, సరే కొట్టుకుచావండి అనుకుని మెల్లగా నా రూంకి వెళ్ళిపోయాను. అయితే ఈ సారి మెట్లెక్కేటప్పుడు లుంగీ పైకి మడవలేదు కాని మనసులో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. షేవింగ్ చేసుకున్నానో లేదో గుర్తులేదు కాని త్వరగా తయారయి, బస్ ఎక్కి లాల్ దర్వాజా మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ఓ అరడజను షార్ట్ లు కొని సాయంత్రానికి తిరుగుముఖం పట్టాను.ఆహా నాచేత షార్ట్లు వేయించటానికి ఆ పైవాడు హిందు ముస్లింల గొడవలు రేపాడే అనుకుని, ఆ రోజునుండి షార్ట్ లు వేసుకుని కులకటం మొదలుపెట్టాను.అవి మోకాళ్ళ పైకి ఉండి అర్ధనగ్నంగా కనిపిస్తూఉన్నా ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేకుండాపోయింది. అంతే ఆనాడు విప్పిన లుంగీ మళ్ళీ కట్టనే లేదు అహ్మదాబాద్ లో.అలా లుంగీ పోయి నిక్కరు వచ్ఛే ఢాం..డాం…ఢాం.