Archive for the ‘ బోసి నవ్వులు ’ Category

సామెత – బ్లామెత


సామెత

“అవసరం తీరిందాకా ఆదినారాయణ, తీరిపోయాక బోడి నారాయణ”

బ్లామెత

వ్యాఖ్య రాసిందాకా బ్లాగు నారాయణ, రాసినతరువాత సోది నారాయణ

*** *** ***

సామెత

“మొదుల్లేదు మొగుడా అంటే, మీసాలకు సంపెంగనూనె అన్నాడంట”

బ్లామెత

హిట్టు లేదు రా మొగడా అంటే, వ్యాఖ్య కి బొమ్మ పెట్టమన్నాడంట

*** *** ***

సామెత

“పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం”

బ్లామెత

హిట్లు బెల్లం, తిట్లు అల్లం

*** *** ***

సామెత

“తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని”

బ్లామెత

బ్లాగు తెరచితిని, పోస్ట్ లు మరచితిని

*** *** ***

సామెత

“తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురునా”

బ్లామెత

అనానిమస్ తిట్లకు బ్లాగర్లు అదురునా

సామెత – బ్లామెత

సామెత

“దానము అయితే ఇవ్వలేను, దండము అయితే పెట్టగలను.”

బ్లామెత

వ్యాఖ్య అయితే వ్రాయలేను, హిట్టయితే కొట్టగలను.

సామెత

“మొగుడ్ని కొట్టి మొగసాలెక్కినట్లు”

బ్లామెత

బ్లాగుని తిట్టి కూడలికెక్కినట్టు.

సామెత

“తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్టు.”

బ్లామెత

వ్యాఖ్య ముదిరి టపా అయినట్టు.

సామెత

“యధా రాజా తధా ప్రజ”

బ్లామెత

యధా బ్లాగు తధా హిట్లు

సామెత

“అడుసు తొక్కనేల? కాలు కడగనేల?”

బ్లామెత

అనామక వ్యాఖ్య రాయనేల? అనవసరంగా తిట్లు తిననేల?

(ఈ బ్లామెతని జ్యోతిగారు, ఈ బ్లాగులో వ్యాఖ్యగా ఇచ్చారు.)

సామెత

“ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి.”

బ్లామెత

ఎగిరెగిరి రాసినా అన్నే హిట్లు, ఎగరకుండా రాసినా అన్నే హిట్లు

సరదాగా…

ఆంధ్రజ్యోతి చమత్కారాలు!!

images1.jpgimages.jpg

తెలుగు తనాన్ని, సంస్కృతిని, సాహిత్యాన్ని పాఠకులకి ఆంధ్రజ్యోతి అందించినంతగా వేరే ఏ ఇతర పత్రిక ఇంతవరకు అందించలేదు. అది రగిల్చిన సాహిత్యాభిలాష మాత్రం ఎప్పటికీ ఆగిపోదు. కొన్ని పాత ఆంధ్రజ్యోతి లలో అందంగా పొందుపరచిన మన పూర్వ కవుల, మేధావుల చమత్కారాలను, సమయస్పూర్థిని మరియు వారి ప్రతిభ, ఔన్నత్యం మీ అందరితో కొంచం పంచుకోవాలని మా ఆకాంక్ష.

కవి వృషభుడు

సంగీతం, సాహిత్యాలలో ప్రతిభగల ఆదిభట్ల నారాయణదాసుగారు చాలా ఠీవిగా వుండేవారు. నిండైన విగ్రహం, ఆజానుబాహువు, బుగ్గమీసాలతో చాలా హుందాగా కనిపించేవారు. ఒకరోజు నలుగురైదుగురు శిష్యులతో విజయనగరం వీధిన నడిచి వెళ్తున్నారు. విద్యల భోజుడుగా వాసికెక్కిన ఆనంద గజపతి ఏదో ఒక మందహాసం చేసి వెళ్ళిపోతే ఎలా వుండేదో? దాసుగారిని చూడగానే “ఎక్కడికి కవివృషభం ఇలా బయలు దేరింది?” అన్నారు. అందుకు నారాయణదాసు క్షణమైనా ఆలోచించకుండా“ఇంకెక్కడికి తమవంటి కామధేనువు వద్దకే..” అన్నారు. ఆనంద గజపతి రసహృదయుడు కనుక దాసుగారి సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు.   

 ఆంధ్ర కేసరి

ఒకసారి విశ్వనాధ సత్యనారాయణగారికి రాష్ట్ర సచివాలయంలో ఏదో పని కావలసి వచ్చింది. చాలా రోజులుగా ఆ వ్యవహారం తెమలకపోవడంతో ఏదో సందర్భంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారిని కలిసినప్పుడు ఆ విషయం ప్రస్తావించారు. సచివాలయంలో వారికి కావలసిన పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకోమని ప్రకాశం గారిని అడిగారు. అందుకు ప్రకాశంగారు కొంత విముఖత చూపుతూ..”ఆ సచివాలయం పెద్ద అడివి. దానిలో పనులు అలాగే వుంటాయి” అన్నారు.అందుకు విశ్వనాధ ఓ చిరునవ్వు నవ్వి “అందుకే కదండీ తమకు మనవి చేసుకున్నది. మీరు ఆంధ్రకేసరి కదా! ఆ అడవి మీకొక లెక్క కాదు.” అన్నారు.ఆ మాట విన్నాక ఆంధ్రకేసరికి ఆ పని నెత్తిన వేసుకోక తప్పింది కాదు.

కట్టమంచి చమత్కారాలు

కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్ర విశ్వవిద్యాలం ఉపాధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆంధ్ర విశ్వవిద్యలయమే తన ప్రేయసి అని చెప్పుకునేవారు. ఒక సభలో ఆయనను భీష్ముడు. హనుమంతుడు అంటూ కొందరు వక్తలు ప్రస్తుతించడం ప్రారంభించారు. తర్వాత రెడ్డిగారు అందుకుని ” లేనిపోని వుపమానాలను, విశేషకాలను ఎందుకు దుర్వినియోగం చేస్తారు? అవివాహితుడు అంటే సరిపోతుంది” చమత్కరించారు.

బళ్ళారి రాఘవీయం

సుప్రసిద్ధ రంగస్థల నటుడు ఆచార్య బళ్ళారి రాఘవ “ఆర్ట్ లవర్స్ లీగ్” అనే సంస్థను స్థాపించి దేశమంతా పర్యటించి అనేక నాటకాలను ప్రదర్శించి అశేష ప్రజలను రంజింపజేశారు. ఒకసారి చంద్రగుప్తలో చాణుక్యుడుగా రాఘవ స్టేజి మీదకు వచ్చారు. తెర తీయగానే శ్మశాన వాటిక దృశ్యం ప్రారంభం కావాల్సి వుంది. ఇంతలో ఒక కుక్క వేదిక అటువైపు నుంచి ఇటు వచ్చింది. తెరవెనుక నిలబడ్డ ఇతర నటీనటులు, నాటక నిర్వాహకులు ఇది చూచి చాలా ఆదుర్ధాపడ్డారు. ఆచార్య రాఘవ అతి సమర్ధతతో కుక్క వంక ఒకసారి సాలోచనగా చూచి “శునకమా! వచ్చితివా, రమ్ము, ఈ శ్మశానవాటిక నాదేకాదు, నీది కూడాను” అని ఘట్టాన్ని రక్తి కట్టించారు. కుక్కను కావాలనే పంపారని ప్రేక్షకులనుకున్నారట! రాఘవ సమస్పూర్తికి ఇదొక ఉదాహరణ.

 చిత్ర విచిత్రం

అవి “సువర్ణమాల” చిత్ర నిర్మాణం జరుగుతున్న రోజులు. ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శ్రీ కాళ్ళకూరి సదాశివరావు అందులో ఒక సన్నివేశానికి ఉత్తుత్త రూపాయి నోట్లు అయితే మంచి ఎఫెక్ట్ రాదు, నిజమైన రూపాయి నోట్లు ఒక వెయ్యి తెప్పించండన్నారు.”

  “నీ రూపాయి లెవరకి కావాలి, నాకు కావల్సింది కల్తీ లేని ప్రేమ”  అంటూ హీరోయిన్ ఆ షాట్లో హీరో ముఖం మీదకు నోట్లను విసరి వేసింది. నోట్లు సెట్ నిండా చెల్లాచెదురుగా పడ్డాయి. అక్కడ వున్న దర్శకునితో పాటు చాయాగ్రాహకుడు, మేకప్ మాన్, ప్రొడక్షన్ మేనేజర్ అందరూ ఆ నోట్ల మీద పడి ఎవరికి దొరికినవి వారు పోగు చేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన నిర్మాత “లబోదిబో” మన్నాడు. మూడు నెలలుగా జీతాలు లేని ఉద్యోగ బృందం పధకం ప్రకారమే ఈ పనిచేశారని తెలుసుకోడానికి నిర్మాతకు అట్టేసేపు పట్టలేదు.

 నిమిత్తమాత్రులు

కొన్నేళ్ళక్రితం రాచకొండ విశ్వనాధ శాస్త్రిగారు ఒక సిన్మాకి మాటలు రాసే నిమిత్తం మద్రాసు వెళ్ళారు. కొన్నాళ్ళుండి తిరిగి విశాఖ వెళ్తున్న శాస్త్రి గారిని ఓ శిష్యుడు “గురువు గారూ ఎలా వుంది సిన్మా ప్రపంచం?” అని అడిగాడు. అందుకు శాస్త్రి గారు చిదానందంగా నవ్వి ఇలా అన్నారట.   “ఏముంది? బానే వుంది! సిన్మా వాళ్ళతో చాలా సుఖం,  మన గదికి మన్ని అద్దె చెల్లించనివ్వరు! వాళ్ళే చెల్లిస్తారు. మన సిగరెట్లు మనం కొనే పని లేదు- వాళ్ళే కొనిస్తారు, మన మందు మనం కొనక్కర్లేదు, మన తిండి మనల్ని తిననివ్వరు! వాళ్ళే ఏర్పాటు చేస్తారు. మన డైలాగులు మనల్ని వ్రాయనివ్వరు! వాళ్ళే వ్రాసుకుంటారు.

రాముడు రాడు

అప్పట్లో మన దేశంలో ఉన్నత పదవులు నిర్వహించే బ్రిటిష్ ఐ.పి.ఎస్. దొరలు ఒక తెలుగు పరీక్ష ఉత్తీర్ణం కావాలనే నియమం ఉండేది. మద్రాసు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శీ హ్రడ్డు దొర కూడా తెలుగు పరీక్షకు హాజరై పరీక్షలో రాముడు అనే పదానికి “రాడు” అని వ్రాశాడు. విశ్వ విద్యాలయ ప్రధాన కార్యదర్శి, హ్రడ్డు దొర దగ్గర ప్రాపకం సంపాదించడం కోసం ఆ పేపర్ని చూసి పదములో రెండక్షరాలు సరిగ్గా వ్రాయనందుకు నూటికి అరవై ఆరు మార్కులు ఇవ్వవచ్చునని వాదించగా, బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన తెలుగు అనువాదకులుగా ఉన్న చెన్నాప్రగడ భానుమూర్తిగారు అది సరికాదని, రాముడుకి రాడుకి చాలా వ్యత్యాసం ఉందని, మార్కులు ఏమీ వేయరాదని వాదించగా ఆ తీర్పుని నాటి బ్రిటిష్ దొరలు సగౌరవంగా సమ్మతించారు.

సం … భావనలు

విజయవాడ ఆకాశవాణి కార్యనిర్వహణాధికారులలో ఒకరైన ఉషశ్రీ తెలుగు వారికి సుపరిచయులు. ఆయన రామాయణ ప్రవచనం నాస్తికులను సైతం చెవులు కోసుకునేలా చేస్తుంది. తెలుగు ప్రసంగాలు, ప్రసారాలలో తల మునకలు అవుతున్న ఉషశ్రీగారి దగ్గరకు ఓ రోజున ఓ పెద్ద మనిషి హఠాత్తుగా వచ్చి తనను తాను ఓ కవిగా పరిచయం చేసుకున్నాడు.  “ఏమిటి తమరు  వచ్చిన పని?”  అని సూటిగా  అడిగారాయన మామూలుగా మనకు వింపించే గొంతుతో.   “ఏదైనా  ఇప్పించాలి తమరు…” అన్నాడా  పెద్ద మనిషి. పనివత్తిడిలో ఉన్న ఉషశ్రీకి కొంచెం చిరాకు కల్గింది ఆ జవాబుకి.   ‘తమరేది ఇప్పించినా సరే” అన్నాడా కవి. వెంటనే ఆఫీసు కుర్రాణ్ణి పిలిచి “వీరికో టీ ఇచ్చి పంపించు.” అని హడావిడిగా స్టూడియోకి వెళ్ళిపోయారు ఉషశ్రీ. ఇస్తారేమో ఓ టాకు టాకి వెళ్దామని వచ్చిన ఆ కవి నిశ్చేష్టుడయ్యాడు.

గిడుగు విసురు

జయంతి రామయ్య పంతులుగారు గ్రాంధిక భాషావాది. అయితే వారి సమకాలికులు అయిన గిడుగు రామ్మూర్తి పంతులుగారు వ్యావహారిక భాషావాది. భాషాపరంగా వారి మధ్య గల భేదాభిప్రాయాలను పురస్కరించుకుని సందర్భం వచ్చినప్పుదల్లా ఒకరిపై ఒకరు విసుర్లు విసురుకోవడం పరిపాటి. ఒకసారి జయంతి రామయ్య పంతులుగారు ఎక్కడో పొరపాటున , “తలకు నూనె వ్రాసుకుని…” అని వ్రాసారట. అది చూసిన గిడుగు పిడుగు, “అవును రామయ్య పంతులు గారు తలకు నూనె వ్రాస్తారు. పుస్తకాలేమో రాస్తారు” అని చమత్కరించారు.

 జరుక్ సూక్తం

మల్లవరపు విశ్వేశ్వరరావుగారి మధుకీల కావ్యానికి ముందు మాటలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఇలా వ్రాశారు.

విశ్వేశ్వరరావూ!నీ రచనలన్నీ పుస్తక రూపంలో రావాలయ్యా

నువ్వు కవివయ్యా!

నేను ఎవ్వరితోటి ఇట్లా అనను, విశ్వేశ్వరరావు నిజంగా కవి”

ఈ పంక్తులు చదివాక సాహిత్య విదూషకునిగా ప్రసిద్ధికెక్కిన జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు చేసిన పేరడీ!

సుబ్బారావూ!నువ్వింక క్షవరం చేయించుకోవాలయ్యా

నీ తల మాసిందయ్యా!

నేను ఎవ్వరితోటీ ఇట్లా అనను,సుబ్బారావు నిజంగా తలకు మాసిన వాడు.”

జాయింటుమెంటు

ఆంధ్రదేశంలో కొప్పరపు కవులు, తిరుపతి వెంకట కవులు సాహితీ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న రోజులలో జంట కవులుగా చెలామణీ కావాలని చాలా మంది ఉత్సాహపడ్డారు. విశ్వనాధ గారు కొడాలి ఆంజనేయులు గారితో కలసి జంట కవిత్వం చెప్పారు. విశ్వనాధ వారి తండ్రి పేరు శోభనాద్రి. కొడాలి వారి తండ్రి పేరు వెంకటాచలం. ఇద్దరి తండ్రుల పేర్లలోనూ గిరులున్నవి కనుక వారిరువురు గిరికుమరులు అని కలం పేరుతో కలసి కవిత్వం చెప్పారు. ఆ రోజులలోనే దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుర్రం జాషువా కూడా జంట కవులుగా రూపొంది రచనలు చెయ్యాలని ఉబలాటపడ్డారు. ఇద్దరికీ కలిసి వచ్చే పేరు నిర్ధారణ చెయ్యడానికి ఒకరోజు సమావేశమైనారు. పైన చెప్పిన జంట కవుల్లాగా ఇమిదిడిపోయే పేరు వీరికి దొరకలేదు. పిచ్చి జాషువా లేదా జాషువా పిచ్చి అని పెట్టుకోవాల్సి వచ్చిందట. అందుకని వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకుని విడివిడిగా ప్రతిష్టనార్జించారు. వారికే కనుక పేరు కుదిరి ఉంటే ఆ జంట మరో గొప్ప కావ్యాన్ని తెలుగు మాగాణంలో పండించి ఉండేదేమో?

 భాషా భేదాలు

అవి గ్రాంధిక భాషకు వారసునిగా కొక్కొండ వెంకటరత్నంగారు, వ్యావహారిక భాషకు వారసునిగా కందుకూరి వీరేశలింగం పంతులుగారు పట్టుదల వీడక రచనలు చేస్తున్న రోజులు. గ్రాంధిక భాషకు సంబంధించిన ఇతివృత్తం తీసుకుని వెంకటరత్నం గారు ఒక ప్రహసనాన్ని రచించి అందులో వీరిగాడి పాత్రని ప్రవేశపెట్టి వాడి సంభాషణలను వాడుక భాషలో వ్రాశారు. ఆ నాటకం ప్రదర్శించే రోజున వీరేశలింగంగారికి ప్రత్యేక ఆహ్వానం పంపారు. వీరేశలింగంగారు ఆ నాటకం చూడగానే వీరిగాడి పాత్ర తనని దృష్టిలో పెట్టుకుని వ్రాసారని వెంటనే గ్రహించారు. మరునాటికల్లా వ్యావహారిక భాష ఇతివృత్తంగా తీసుకుని ఒక వ్యంగ్య నాటికను రచించి అందులో నత్తి పాత్రను ప్రవేశపెట్టారు. ఆ నత్తి పాత్ర పేరు కొండిగాడు. సంభాషణలో నీ పేరేమిటిరా అని అడిగినప్పుడు కొ..క్కొక్కొండిగాడు అంటాడు. వారిద్దరి మధ్య భాషా విషయమై ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని చెబుతారు.

 కమ్రగుణముల కుప్ప !  చిప్పరామభక్తి ఎంతొ గొప్పరా!

ఆంధ్ర వాల్మీకిగా వాసికెక్కిన వావిలికొలను సుబ్బారావు గారు ఆశ్రమ జీవితం ఆరంభించిన తర్వాత “వాసుదాసు” అని పిలిచేవారు అందరూ. ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని బాగు చేయించాలనే సంకల్పంతో ప్రజల నుంచి లక్ష రూపాయిల దాకా నిధిని ప్రోగు చేసి ఆ దేవాలయ పునర్నిర్మాణానికి చాలా కృషి చేశారు. అయితే ఆయన ఇప్పటి వాళ్ళలాగా తోలు సంచులు, రసీదు పుస్తకాలు పట్టుకుని విరాళాలు వసూలు చెయ్యలేదు. “నా రాముడి కోసం బిచ్చమెత్తుకుంటున్నాను.అంటూ ఒక టెంకాయ చిప్ప పట్టుకుని చిల్లర డబ్బులను సైతం ఆయన యాచించి నిధి ప్రోగు చేశారు. ఆ నిధి సమర్పణ ఉత్సవం రోజున ఆ టెంకాయ చిప్ప మీద ప్రశంసాపద్య శతకం చెప్పారు. అందులోంచి మచ్చుకు…

 ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచిరూప్యములు వేన వేలుగా ప్రోగు చేసిదమ్మిడైనను వానిలో దాచుకొనక ధరణి జాపతి కర్పించి, ధన్యవైతి కర్మ గుణపణిముల కుప్ప టెంకాయ చిప్ప!

కవుల లోపల బమ్మ రాకాసి

విజయవాడలో సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులైన గూడూరి వియ్యన్న గారిల్లు సాహిత్య నిలయంగా కూడా వాసికెక్కింది.

   ఒకసారి మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారు, వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు, కాటూరి వెంకటేశ్వరరావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అప్పటికి బాగా యువకులైన రాచకొండ నరసింహమూర్తిగారు, వీరంతా కూచుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు వియ్యన్న గారింట్లో. ఇంతలో విశ్వనాధ సత్యనారాయణ గారు వచ్చి చేరారు.

   ప్రసంగవశాన ఆ మాటా ఈ మాటా వచ్చి “కవుల సాంగత్యం చేసి బాగుపడ్డ వాడెవడూ కనిపించడం లేదు. మనల్ని దగ్గరికి చేర్చి దివాలా తీసిన వాడేగాని బాగుపడిన వాడు ఒకడూ లేడు.” అని విశ్వనాధ గారు ప్రారంభించారు. కావాలంటే నా విషయమే చూడండి. నా పుస్తకాలు అంకితం పుచ్చుకున్న వాడెవడూ సవ్యంగా బతికి బట్ట కట్టలేదు. అంటూ ఎవరెవరికి ఎంతెంత క్లేశాలు చుట్టుకున్నదీ చెప్పడం ప్రారంభించారు. అదంతా సావధానంగా విని సహజ గంభీరులైన కాటూరి వారు సైతం నవ్వుకున్నారు.

   నవ్వులు ఆగీ ఆగకుండానే మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి గారు శంఖం ఒత్తినట్టు తమ కంఠం ఎత్తి విశ్వనాధపై సీస పద్యం అందుకున్నారు.

పండు వంటి గృహస్థు పైడి పాట్యగ్ర హా

రికుడు నీ కృతిచె దరిదృడయ్యె”

(అంటే బెల్లంకొండ రాఘవరావుగారన్న మాట)

ఆ తరువాత పాదాన్ని వేదుల వారిలా పొడిగించారు-

కోరి నీ కృతి గైకొన్న పెన్నాడయ్య

వారి కయ్యెను స్థల భాండశుద్ధి”

(అంటే పెన్నాడ కదాళం రఘునాధ చక్రవర్తి)

విశ్వనాధ వారు వింటూ తెగ నవ్వుకుంటున్నారు.

మూడోపాదం నరసింహమూర్తి చెప్తాడని వేదుల వారు ప్రకటించారు. నరసింహమూర్తి గారు ముందు భయపడ్డా తర్వాత విశ్వనాధ వారు కూడా ఉత్సాహపరచడంతో..

కొన్నది లేద ఊ కొన్న పాపానికే

ముక్త్యాల దొర రాజ్యమునకు బాసె” అన్నారు.

వహ్వాఅన్నారంతా-

నాలుగో పాదం కృష్ణ శాస్త్రి గారి వంతు అయింది.

శుభమంచు క్రొత్తింట జొచ్చుచు, నీ కృతి

గొన్న లింగము కొంప కూలిపోయె” అన్నారు.

(లింగము అంటే బందా కనకలింగేశ్వరరావు గారు. వారికి ప్రధమ భార్య గతించారు)

ఇక ఎత్తు గీతి మిగిలింది.

జారె నీ కడిమి ని టంగుటూరి పదవి” అన్నారు కాటూరి వారు

(కడిమి అంటే కడిమి చెట్టు నవల)

కూలె కాశినాధుడు నీ త్రిశూలహతిని” అన్నారు బుచ్చి సుందర రామ శాస్త్రి గారు.

అంతవరకు అయాక కాటూరి వారు అందరినీ లేచి నిలబడమన్నారు.

రెండు చేతులూ జోడించి నేను చెప్పినట్టు చెప్పండి” అని మిగిలిన రెండు పాదాలు ఆయన పూరించారు.

కవుల లోపల బమ్మ రాకాసి నీవు 

దండముర బాబు నీదు కైతలకు నీకు”

సీస పద్యం మొత్తం పూర్తయింది. వాతావరణం నవ్వులతో నిండిపోయింది.